ETV Bharat / state

POLAVARAM : పోలవరం ప్రాజెక్టు నిధుల విషయంలో కేంద్రం మరో మెలిక

author img

By

Published : Mar 20, 2022, 5:25 AM IST

Updated : Mar 20, 2022, 6:24 AM IST

POLAVARAM :పోలవరం ప్రాజెక్టు పూర్తికి సహకరిస్తామన్న కేంద్రం ఇప్పుడు మరో మెలిక పెట్టింది. ప్రాజెక్టుకు నిధులు వెచ్చించే విషయంలో.. కొత్తగా తొలిదశ పేరుతో లెక్కలు కట్టిస్తోంది. ఎప్పుడో 2004లో ప్రాజెక్టు ప్రారంభించినప్పటి నుంచి జరిగిన పనులు, చెల్లింపులను లెక్కగట్టాలని కేంద్రం చూస్తుండటంతో.. పోలవరం అధికారులు తలలు పట్టుకుంటున్నారు.

POLAVARAM
POLAVARAM

పోలవరం ప్రాజెక్టు నిధుల విషయంలో కేంద్రం మరో మెలిక

POLAVARAM : పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి నిధులు వెచ్చించే విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా తొలిదశ పేరుతో లెక్కలు కట్టిస్తోంది. తొలిదశలో +41.15 మీటర్ల స్థాయిలో నీళ్లు నిల్వచేసి కుడి, ఎడమ కాలువలకు, ఆయకట్టుకు ఇవ్వాలంటే ఆ స్థాయి నిర్మాణానికి, పునరావాసానికి ఎంత ఖర్చవుతుందని మళ్లీ లెక్కలు అడుగుతోంది. అక్కడివరకు నీళ్లు ఇస్తే ఏ స్థాయి ప్రయోజనాలు కలుగుతాయో అనీ కేంద్ర జలసంఘం గతంలోనే ఒక సమావేశం ఏర్పాటుచేసి వివరాలు కోరింది. కేంద్ర జలసంఘం డైరెక్టర్‌ ఒకరు ఇదే పనిపై ఉండి పోలవరం అధికారులకు మార్గదర్శనం చేస్తూ లెక్కలు సిద్ధం చేయిస్తున్నారు. ఇందుకోసం పోలవరం ఇంజినీర్లు కొందరు ప్రస్తుతం దిల్లీలో ఉండి ఆ కసరత్తులో భాగస్వాములయ్యారు.పోలవరం డ్యాంను +45.72 మీటర్ల స్థాయిలో నీటిని నిల్వ చేసేందుకు అనుగుణంగా ఇప్పటికే పోలవరం ప్రాజెక్టు అథారిటీ, కేంద్ర జలసంఘం లెక్కలు కట్టించాయి. 2011-12 లెక్కల ప్రకారం, 2013-14 లెక్కలు, 2017-18 లెక్కల ఆధారంగా ఎప్పుడో కొలిక్కి తెచ్చారు. 2013-14 లెక్కల్లో కేంద్ర జలసంఘం అంచనాల ప్రకారం ఎంత? రివైజ్డు కాస్ట్‌ కమిటీ (అంచనాల సవరణ కమిటీ-ఆర్‌సీసీ) ప్రకారం ఎంతో కూడా లెక్క కట్టించారు. 2017-18 ధరల ప్రకారం ఆర్‌సీసీ రూ.47,725.74 కోట్లకు సిఫార్సు చేసింది. ఇది జరిగి రెండేళ్లు దాటింది. ఈ మొత్తానికి కేంద్రం పెట్టుబడి అనుమతి ఇచ్చి పనులను తొలిదశ, రెండో దశగా విడగొట్టి ఆ మేరకు నిధులు విడుదల చేస్తే సరిపోయేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పుడు ప్రత్యేకంగా తొలిదశ పేరుతో మళ్లీ లెక్కలు కట్టాలని కోరుతోంది. 2014లో పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినప్పటి నుంచి ఇప్పటివరకూ ఎప్పటికప్పుడు లెక్కలు కడుతున్నారు తప్ప కేంద్రం దీన్ని కొలిక్కి తెచ్చి పెట్టుబడి అనుమతి ఇచ్చేందుకు అడుగు ముందుకు వేయలేదు. ఇప్పటికే ప్రాజెక్టులో అన్ని విభాగాలకు సంబంంధించిన ఖర్చుల లెక్కలన్నీ పక్కాగా ఉన్నాయి. పైగా పునరావాసంలో +41.15 మీటర్ల స్థాయికి నీళ్లు నిలిపితే ఎంత? ఆ తర్వాత +45.72 మీటర్ల స్థాయికి నీరు నిలిపితే ఎంత ఖర్చవుతుందో కూడా లెక్కలేశారు. ఆర్‌సీసీ ఆమోదించిన 2017-18 లెక్కల ఖర్చుకు పెట్టుబడి అనుమతి ఇచ్చి, నిధులు విడుదల చేస్తూ తొలిదశ, మలి దశగా విడగొట్టే అవకాశం ఉంది. డిజైన్ల మార్పు వల్ల పెరిగిన అదనపు పనికి అయ్యే వ్యయాన్ని దానికి జతచేస్తే సరిపోతుందనే అభిప్రాయం ఇంజినీర్లలో ఉంది.

+41.15 మీటర్ల స్థాయికి నీళ్లు నిలబెట్టినా ప్రాజెక్టు, కాలువల నిర్మాణపరంగా వ్యత్యాసం ఏమీ ఉండదని, ఆ ఖర్చు యథాతథంగానే ఉంటుందని ఇంజినీర్లు చెబుతున్నారు. ఇప్పుడు మళ్లీ తొలిదశ అంటూ లెక్కలు కట్టించడం చర్చనీయాంశమవుతోంది.

పోలవరం ప్రధాన డ్యాం నిర్మాణపరంగా గత మూడు, నాలుగేళ్లుగా డ్యాం డిజైన్‌ రివ్యూ కమిటీ సూచనలు, కేంద్ర జలసంఘం సూచనల మేరకు అనేక ఆకృతులు మార్చాల్సి వచ్చింది. అదనంగా ఇప్పటికే దాదాపు రూ.600 కోట్ల అంచనా వ్యయంతో పనులకు టెండర్లు పిలిచి చేపట్టారు. ప్రస్తుతం పోలవరంలో వరదల వల్ల ప్రధాన డ్యాం ప్రాంతంలో ఇసుక కోత వల్ల ఏయే పనులు చేపట్టాలో వాటి ఆకృతులు తేలాల్సి ఉంది. మొత్తం ప్రధాన డ్యాం నిర్మాణంలో పని పరిమాణం నాటి అంచనాలకు, ఇప్పటికీ మారిపోయింది.

కేంద్ర జలసంఘం మాత్రం ఎప్పుడో 2004లో పోలవరం టెండర్లు పిలిచి పనులు ప్రారంభించిన నాటి నుంచి ఎవరు ఎంత పని చేశారు.. ఎంత చెల్లించారనే అంశాలతో సహా మళ్లీ లెక్కలు కట్టాలంటోంది. దీంతో ఇంజినీర్లు ఉసూరుమంటున్నారు. ఈ అంశంపై కేంద్ర జల సంఘంతో చర్చించేందుకు పోలవరం సీనియర్‌ అధికారులు సోమవారం దిల్లీ వెళ్లనున్నారు. ఇప్పటికే పోలవరానికి సంబంధించి రకరకాలుగా కేంద్రం నేతృత్వంలో సిద్ధమైన లెక్కలు.. వివిధ దశల్లో ఆమోదం పొందిన వాటి వివరాలు ఇలా ఉన్నాయి.

అసెంబ్లీలో రేపు పోలవరంపై చర్చ

శాసనసభలో పోలవరంపై సోమవారం స్వల్పకాలిక చర్చ చేపట్టనున్నారు. తెదేపా హయాంలో ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఏం చేశారు? ప్రస్తుత ప్రభుత్వం చేసిన, చేస్తున్న పనులేంటనే అంశాలపై ఇందులో చర్చించనున్నారు. సీఎం జగన్‌ ప్రసంగించే అవకాశముంది. మూడు రాజధానుల అంశంపైనా ఈ సమావేశాలు ముగిసే రోజు.. అంటే ఈ నెల 25న లేదా ఆ ముందు రోజు (24న) చర్చ చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలిసింది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో అమరావతిలో ప్రభుత్వం ఏం చేయనుంది? వికేంద్రీకరణపై ఎలా ముందుకెళ్లనుందనే విషయాలు చర్చకొచ్చే అవకాశం ఉందని ప్రభుత్వవర్గాలు చెబుతున్నాయి. వీటన్నింటిపై ముఖ్యమంత్రి ప్రకటన కూడా ఉండనుంది. మూడు రాజధానుల బిల్లును ఈ సమావేశాల్లోనే ప్రభుత్వం ప్రవేశపెట్టనుందని ప్రచారం జరుగుతున్నా.. ఇప్పటి వరకూ అధికారికంగా స్పష్టత రాలేదు.

...

ఇదీ చదవండి : పోలవరం నిర్మాణ పనులపై కేంద్ర జలశక్తి శాఖతో కీలక భేటీ

Last Updated : Mar 20, 2022, 6:24 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.