ETV Bharat / state

పారిశ్రామికవేత్త హరిశ్చంద్రప్రసాద్‌ శత జయంతి..

author img

By

Published : Aug 2, 2021, 7:33 AM IST

Entrepreneur Harishchandra Prasad‌
పారిశ్రామికవేత్త హరిశ్చంద్రప్రసాద్‌

నలుగురూ నడిచే దారిలోనే మనం నడిస్తే.. ఆ నలుగురిలో ఒక్కరిగా మిగిలిపోతాం. కొత్తదారులు అన్వేషిస్తే... నలుగురికీ దారి చూపి చిరస్థాయిగా నిలిచిపోతాం. రెండు పదుల వయసులోనే ఈ సూత్రాన్ని వంటబట్టించుకున్న ఆయన జీవితాంతం దాన్నే ఆచరించారు. 24 ఏళ్ల వయసులో ఆంధ్రాషుగర్స్‌ పేరుతో పశ్చిమగోదావరి జిల్లా తణుకులో చక్కెర కర్మాగారం స్థాపించి పారిశ్రామికవేత్తగా ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఆ సంస్థను ఎందరికో నీడనిచ్చే మహావృక్షంగా తీర్చిదిద్దారు. 91వ ఏట తుదిశ్వాస విడిచేవరకూ ఆంధ్రా షుగర్స్‌ సంస్థకు సీఎండీగా బాధ్యతలు నిర్వర్తించారు. అత్యంత పిన్న వయసులోనే పరిశ్రమను స్థాపించి, సుదీర్ఘకాలం సీఎండీగా కొనసాగిన వ్యక్తిగా చరిత్ర సృష్టించిన ఆయనే ముళ్లపూడి హరిశ్చంద్రప్రసాద్‌. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో... ఆ మాటకొస్తే ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలోనే తొలితరం పారిశ్రామికవేత్తల్లో ప్రముఖుడిగా, పారిశ్రామిక రంగ భీష్మాచార్యుడిగా, ఆంధ్రా బిర్లాగా పేరుగాంచిన హరిశ్చంద్రప్రసాద్‌ శత జయంతి సంవత్సరం ఇది.

ఇప్పుడంటే తణుకు ఒక పట్టణంగా ఎదిగింది. కానీ ఏడు దశాబ్దాల క్రితం అది ఒక పల్లెటూరు. పారిశ్రామిక వాసనలు లేని వ్యవసాయాధారిత ప్రాంతం. అక్కడ ఫ్యాక్టరీ స్థాపించాలన్న ఆలోచనే ఓ సాహసం. అదీ స్కూల్‌ ఫైనల్‌ వరకు మాత్రమే చదువుకున్న వ్యక్తి అలాంటి బృహత్కార్యానికి నడుం కట్టడం గొప్ప విషయం. హరిశ్చంద్రప్రసాద్‌ 1921 జులై 28న తూర్పుగోదావరి జిల్లా పెదపట్నం అగ్రహారంలో జన్మించారు. ఆయనది సంపన్న, జమీందారీ కుటుంబం. తణుకులోనే చదువుకున్నారు. పారిశ్రామికవేత్తగా మారాలన్న ఆలోచన ఆ వయసులోనే ఆయనలో మొగ్గతొడిగింది. అప్పట్లో ఉమ్మడి మద్రాసు రాష్ట్ర ప్రభుత్వానికి పారిశ్రామిక సలహాదారుగా ఉన్న ఐసీఎస్‌ అధికారి వెలగపూడి రామకృష్ణ సలహా మేరకు.. వ్యవసాయాధారిత పరిశ్రమ ఏర్పాటుచేయాలన్న నిర్ణయానికి వచ్చారు. అప్పట్లో తణుకు చుట్టుపక్కల చెరకు ఎక్కువగా పండించేవారు. దాన్ని బెల్లం తయారీకే వినియోగించడంతో రైతులకు గిట్టుబాటు అయ్యేది కాదు. చక్కెర పరిశ్రమను స్థాపిస్తే ఉభయతారకంగా ఉంటుందన్న నిర్ణయానికి వచ్చారు. దేశానికి స్వాతంత్య్రం రావడానికి నాలుగు రోజుల ముందు.. 1947 ఆగస్టు 11న తణుకులో చక్కెర కర్మాగారానికి శంకుస్థాపన చేశారు. 350 మంది సిబ్బందితో, 600 టన్నుల క్రషింగ్‌ సామర్థ్యంతో మొదలైన ఆంధ్రాషుగర్స్‌... అనంతర కాలంలో బహుముఖంగా ఎదిగింది. ప్రస్తుతం ఆ సంస్థలో 12 వేల మంది ప్రత్యక్షంగా, మరెందరో పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు.

ఇప్పటికీ తణుకు నుంచే..

ఆంధ్రా షుగర్స్‌ ఒక కార్పొరేట్‌ సంస్థగా ఎదిగినా తణుకు కేంద్రంగానే కార్యకలాపాలు నిర్వహించారు. పలు ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాలూ నిర్వహించారు. భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానం ట్రస్ట్‌బోర్డు ఛైర్మన్‌గా పనిచేసి, పరిపాలన విభాగాన్ని పునర్వ్యవస్థీకరించారు. ముళ్లపూడి వెంకట్రాయుడు మెమోరియల్‌ ఎడ్యుకేషన్‌ ట్రస్ట్‌, మెడికల్‌ ట్రస్ట్‌ల ఆధ్వర్యంలో తణుకులో పాలిటెక్నిక్‌ కళాశాల, 450 పడకలతో ఆస్పత్రి స్థాపించారు. కాకినాడ రంగరాయ వైద్య కళాశాల స్థాపనకు ప్రధాన దాతగా సహకరించారు. ఐ కేర్‌ సెంటర్‌, కార్డియోవాస్క్యులర్‌ సెంటర్లను ఏర్పాటు చేశారు. దువ్వ, వెంకట్రాయపురం, దొమ్మేరుల్లో ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు, తణుకులో గ్రంథాలయం, సాంస్కృతిక కేంద్రాలను ఏర్పాటు చేశారు. హరిశ్చంద్రప్రసాద్‌ని అనేక అవార్డులు, పురస్కారాలు వెతుక్కుంటూ వచ్చాయి. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌తో సత్కరించింది. అనకాపల్లి ప్రాంతీయ చెరకు పరిశోధన కేంద్రం ‘శర్కర కళాప్రపూర్ణ’ బిరుదు ప్రదానం చేసింది. జాతీయ అంతరిక్ష పరిశోధన రంగానికి అందించిన సేవలకు ఇస్రో ప్రశంసాపత్రం అందజేసింది. తానా లాంటి సంస్థలు ఆయనను జీవితకాల పురస్కారాలతో సత్కరించాయి.

హరిశ్చంద్రప్రసాద్‌ తమ సంస్థల్లో పనిచేసే ఉద్యోగుల్నీ కుటుంబసభ్యుల్లానే చూసుకునేవారు. ఆయన హయాంలో సమ్మె అన్నదే జరగలేదంటే... వారిపై ఆయన ప్రేమాభిమానాలు చూపించడం, వారి బాగోగులు చూడటమే కారణమని చెబుతారు.

ఆహార్యం పల్లెటూరి పెద్దమనిషిదే..!

జీవితంలో ఎంత ఎదిగినా హరిశ్చంద్రప్రసాద్‌ నిరాడంబర జీవన విధానాన్నే అనుసరించారు. విదేశీ పర్యటనలకు వెళ్లినా... పంచెకట్టుతోనే కనిపించేవారు. చూసేవాళ్లకు ఒక విశాల పారిశ్రామిక సామ్రాజ్యానికి అధిపతిలా కాకుండా, పల్లెటూరి పెద్దమనిషిలానే అనిపించేవారు. సొంతూరిలో పాతకాలం మండువా ఇంట్లో ఉండటానికే ఇష్టపడేవారు.

చక్కెర నుంచి రాకెట్‌ ఇంధనం వరకూ..

హరిశ్చంద్రప్రసాద్‌ గొప్ప దార్శనికుడు. చదవింది ఎస్సెస్సెల్సీనే అయినా.. ఆయన జీవితం మేనేజ్‌మెంట్‌ విద్యార్థులకు గొప్ప పాఠం. గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్‌ సదుపాయం లేని రోజుల్లో జనరేటర్‌ సాయంతో చక్కెర ఫ్యాక్టరీని నడిపించారు. వ్యవసాయ ఆధారిత ఉత్పత్తుల తయారీ, స్థానికంగా ఉపాధి అవకాశాల కల్పనే ఆంధ్రా షుగర్స్‌ ఏర్పాటు వెనుక ఉన్న ప్రాథమిక లక్ష్యమైనా, తర్వాత సంస్థను బహుముఖంగా విస్తరించారు.

ఎక్కడో తణుకులో ఉన్న ఆంధ్రాషుగర్స్‌... దేశానికి తలమానికమైన ఇస్రో సంస్థకు రాకెట్‌ ఇంధనం ఉత్పత్తి చేసే స్థాయికి ఎదిగిందంటే అదంతా ఆయన కృషి ఫలితమే. ప్రపంచంలో రాకెట్‌ ఇంధనం ఉత్పత్తి చేస్తున్న 5 దేశాల సరసన భారత్‌ను నిలబెట్టిన ఘనత హరిశ్చంద్రప్రసాద్‌కే దక్కుతుంది.

చక్కెర తయారీలో ఉప ఉత్పత్తిగా వచ్చే మొలాసిస్‌తో పలు రకాల ఉత్పత్తులు చేయవచ్చని హరిశ్చంద్రప్రసాద్‌ గ్రహించారు. దాని కోసం ప్రత్యేకంగా పరిశోధన, అభివృద్ధి (ఆర్‌ అండ్‌ డీ) కేంద్రం ఏర్పాటుచేశారు.

దేశంలో ఆస్ప్రిన్‌ మందును ఉత్పత్తి చేసిన మొదటి కంపెనీ కూడా ఆంధ్రా షుగర్సే.

తణుకుతో పాటు కొవ్వూరు, తాడువాయి, భీమడోలు, సగ్గొండల్లోనూ, గుంటూరు జిల్లాలోని డోకిపర్రులోనూ పరిశ్రమలు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఆ పరిశ్రమలు చక్కెరతో పాటు, పారిశ్రామిక ఆల్కహాల్‌, ఎరువులు, రసాయనాలు, వంటకు, పారిశ్రామిక అవసరాలకు ఉపయోగపడే నూనెలు, వస్త్రాలు, బల్క్‌ డ్రగ్స్‌ ఉత్పత్తి చేస్తున్నాయి. అనంతపురం, తమిళనాడుల్లో పవన విద్యుదుత్పత్తి కేంద్రాలూ ఉన్నాయి.

లండన్‌కి చెందిన డేవీ మెక్‌కీ సంస్థ సాంకేతిక సహకారంతో విశాఖపట్నంలో ఆంధ్రా పెట్రోకెమికల్స్‌ సంస్థనూ హరిశ్చంద్రప్రసాద్‌ ఏర్పాటు చేశారు.

రాజకీయాల్లోనూ తనదైన ముద్ర

క పక్క పారిశ్రామిక, మరో పక్క రాజకీయ రంగాల్లో హరిశ్చంద్రప్రసాద్‌ తనదైన ముద్ర వేశారు. 1946-55 మధ్య పీసీసీ సభ్యుడిగా పనిచేశారు. 1952లో ఉమ్మడి మద్రాసు రాష్ట్ర శాసనమండలి సభ్యుడిగా ఎన్నికయ్యారు. 1955, 1967 మధ్య రెండు సార్లు శాసనసభ్యుడిగా పనిచేశారు. 1959 నుంచి 1964 వరకు తణుకు గ్రామ పంచాయతీ అధ్యక్షుడిగా ఉన్నారు. 1981లో తణుకు మున్సిపాలిటీగా మారాక జరిగిన తొలి ఎన్నికల్లో ఆయన మున్సిపల్‌ ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. తణుకు ఉత్పత్తిదారులు, వినియోగదారుల సంఘాన్ని స్థాపించి 25 ఏళ్లపాటు దానికి అధ్యక్షుడిగా కొనసాగారు. 91వ ఏట తుదిశ్వాస విడిచేవరకూ ఆంధ్రా షుగర్స్‌కు సీఎండీగా వ్యవహరించారు. ఆంధ్రా పెట్రోకెమికల్స్‌కి ఎండీగా, అక్కమాంబ టెక్స్‌టైల్స్‌, ఆంధ్రా ఫారం కెమికల్స్‌, హిందుస్థాన్‌ ఎల్లైడ్‌ కెమికల్స్‌, జోసిల్‌ లిమిటెడ్‌, శ్రీ సత్యనారాయణ స్పిన్నింగ్‌ మిల్స్‌ వంటి సంస్థలకు ఛైర్మన్‌గా వ్యవహరించారు. గుజరాత్‌లోని వల్లభ్‌నగర్‌లో ఉన్న ఎం.ఎస్‌.ఎలికాన్‌ ఇంజినీరింగ్‌ కంపెనీ, హైదరాబాద్‌లోని ఆంధ్రా ఫౌండ్రీ అండ్‌ మెషీన్స్‌, రీజెన్సీ సిరామిక్స్‌ లిమిటెడ్‌ సంస్థలకు డైరెక్టర్‌గానూ వ్యవహరించారు. పలు వ్యాపార, వాణిజ్య సంస్థలకు అధ్యక్షుడిగా, పలు ప్రభుత్వ కమిటీల్లో సభ్యుడిగానూ ఉన్నారు.

ఇదీ చదవండీ... Online admissions: ఆన్‌లైన్‌ ప్రవేశాలు..ఆందోళనలో తల్లిదండ్రులు !

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.