ETV Bharat / state

నిర్వాసితులపై ఇంత నిర్లక్ష్యమా ?: ఎస్టీ కమిషన్‌

author img

By

Published : Sep 15, 2021, 4:34 AM IST

Updated : Sep 15, 2021, 7:47 AM IST

National st Commission on Polavaram Project Expatriates
జాతీయ ఎస్టీ కమిషన్‌

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై ఉన్న శ్రద్ధ, నిర్వాసితులకు పునరావాసం కల్పించడంపై లేదని.. జాతీయ ఎస్టీ కమిషన్‌ ఆక్షేపించింది. పునరావాసంలో అటవీ చట్టాలను వర్తింపజేయడం లేదని, ఇది గిరిజనుల రాజ్యాంగ హక్కుల్ని విస్మరించడమేనని అసంతృప్తి వ్యక్తంచేసింది. నిర్వాసితుల ప్రయోజనాల్ని కాపాడేందుకు పలు సిఫార్సులు చేసింది.

ఏపీ, ఒడిశాలోని పోలవరం నిర్వాసిత గ్రామాలు, కొత్తగా నిర్మించిన పునరావాస కాలనీలను ఇటీవల సందర్శించిన జాతీయ ఎస్టీ కమిషన్‌... పలు లోపాలను ఎత్తిచూపింది. ప్రాజెక్టు నిర్మాణంపై ఉన్న శ్రద్ధ.. నిర్వాసితులకు పునరావాసంపై చూపడం లేదని రాష్ట్ర ప్రభుత్వాలను నిలదీసింది. జాతీయ ఎస్టీ కమిషన్‌ సభ్యుడు అనంతనాయక్‌తో కూడిన బృందం ఆగస్టు 24 నుంచి 4 రోజులపాటు పర్యటించింది. ఈమేరకు ఎస్టీ కమిషన్‌ ఛైర్మన్‌తోపాటు ఏపీ, ఒడిశా ప్రభుత్వాలకు నివేదిక సమర్పించింది. దీనిపై 4వారాల్లోగా నివేదిక పంపాలని రెండు ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులను ఆదేశించింది.

పునరావాస గ్రామాల్లో ఉల్లంఘనలను గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు జాతీయ ఎస్టీ కమిషన్‌ తెలిపింది. 2013 పునరావాస చట్టం 30 ప్రకారం నిర్వాసితులకు వసతుల విషయంలో నిర్దేశిత షెడ్యూల్ ప్రకారం పనులు చేపట్టడం లేదని వివరించింది. భూమికి బదులుగా ఇచ్చిన భూమి.. కొన్నిచోట్ల వ్యవసాయయోగ్యం కాదని తెలిపింది. అటవీ, కమ్యూనిటీ చట్టాలను వర్తింపజేయడం లేదని గిరిజనులు వాపోతున్నారని తెలిపింది. దీనిపై అధికారుల నుంచి సమాధానమూ లేదని వెల్లడించింది. పునరావాస కల్పనకు ముందే అటవీ హక్కుల చట్టం కింద వారికేమేమి లభిస్తాయో అందించే వరకూ గిరిజనులను తరలించడానికి వీల్లేదంది. వ్యవసాయం కోసం కమ్యూనిటీ అంతటికీ కలిపి ఏపీ ప్రభుత్వం భూమినిస్తోందని.. వ్యక్తిగతంగా పట్టాలివ్వాలని గిరిజనులు కోరుతున్నారని స్పష్టంచేసింది.

పోలవరం పునరావాస కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలు సరిగా లేవని.. శ్లాబుల్లోంచి నీరు లీకవుతోందని ఎస్టీ కమిషన్ పేర్కొంది. అలాగే గోడలు బీటలు వారాయని, ఏ ఇతర వసతులూ కల్పించలేదని గుర్తించినట్లు తెలిపింది. సరైన మంచినీటి వసతి, రోడ్లు, డ్రైనేజీ లేవని.. ఇళ్లకు కిటికీలు, విద్యుత్‌ సదుపాయం, మరుగుదొడ్లు సరిగా నిర్మించలేదని గుర్తుచేసింది. నిర్వాసితుల సమస్యలను పట్టించుకునే వారే లేరంటూ ఆవేదన వ్యక్తంచేసింది. నిర్వాసితుల ఫిర్యాదుల స్వీకరణ- పరిష్కార వ్యవస్థ కనిపించలేదని తెలిపింది.

జాతీయ ఎస్టీ కమిషన్ పలు సఫార్సులు చేసింది. పునరావాస కాలనీల నిర్మాణాల్లో నాణ్యత పాటించాలని, లీకేజీలు, ఇతర మరమ్మతు పనులను పునరావాస కమిషనర్‌ పర్యవేక్షణలో చేపట్టాలని సూచించింది. అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలలు ఏర్పాటు చేయాలని.. పిల్లలు, గర్భిణుల సంరక్షణ, ఆరోగ్య సంరక్షణ కేంద్రాలను నిర్మించాలని సిఫార్సు చేసింది. నిర్వాసితులను తరలించడానికి ముందే భూమికి బదులు భూమినివ్వాలని, అదికూడా ఆవాస ప్రాంతాలకు సమీపంలోనే ఉండాలని సూచించింది. అధికారులు ప్రతి వారం ఆయా గ్రామాలకు వెళ్లాలని.. తాము వస్తున్నట్టు ముందుగా తెలిపి ఫిర్యాదులను ఆహ్వానించి పరిష్కరించాలని సూచించింది. పునరావాసంపై కేంద్ర జలశక్తి కార్యదర్శి ప్రతి నెలా సమీక్షించాలని సిఫార్సు చేసింది.

ఇదీ చదవండి..

HC ON MINING: మీరేమో నిద్రపోతుంటారు.. వాళ్లేమో తవ్వేస్తుంటారు: హైకోర్టు

Last Updated :Sep 15, 2021, 7:47 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.