ETV Bharat / state

కోడి పందేలకు జోరుగా ఏర్పాట్లు.. గెలుపు పందెంరాయుళ్లదా.. పోలీసులదా..?

author img

By

Published : Jan 3, 2022, 9:20 PM IST

Updated : Jan 3, 2022, 10:46 PM IST

పశ్చిమగోదావరిలో.. జూదరులు కోళ్లను సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు. రూ.వేలల్లో ఖర్చు చేసి కొనుగోలు చేస్తున్నారు. గతేడాది మూడు రోజుల పందేల్లో సుమారు రూ.100 కోట్ల వరకు చేతులు మారిందనేది అంచనా. పోలీసుల సాక్షిగా ప్రజాప్రతినిధులు, కీలక నేతల సమక్షంలోనే భారీగా పందేలు జరిగిన విషయం తెలిసిందే. పోలీసులు తూతూమంత్రంగా వ్యవహరించారన్న ఆరోపణలు లేకపోలేదు. మరి ఈసారి పందెంరాయుళ్లు గెలుస్తారా? పోలీసులే పైచేయి సాధిస్తారో వేచిచూడాల్సిందే.

cock fights
కోడి పందేలకు సిద్ధమవుతున్న బరులు

పశ్చిమగోదావరి జిల్లాలోని మెట్ట ప్రాంతాలైన చింతలపూడి, కలరాయనగూడెం, కళ్లచెరువు, వెంకటా పురం, శంకుచక్రపురం ప్రాంతాల్లో ప్రత్యేకంగా పందెం కోళ్లను పెంచి విక్రయిస్తుంటారు. పండగ దగ్గర పడుతుండటంతో వీటి కొనుగోలుకు గుంటూరు, కృష్ణా జిల్లాల నుంచి పందెంరాయుళ్ల రాక మొదలైంది.

జోరుగా కోళ్ల పెంపకం..
జిల్లాలోని జూదరులు కోళ్లను సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు. రూ.వేలల్లో ఖర్చు చేసి కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటికే ఒక్కో కోడి రూ.20 వేల నుంచి రూ.1 లక్షకు పైగా ధర పలుకుతోంది. భీమవరం, పాలకొల్లు, ఉండి, నరసాపురం, కళ్లచెరువు, కలరాయనగూడెం, శ్రీనివాసపురం, దెందులూరు తదితర ప్రాంతాల్లో భారీ ఎత్తున పందేలు నిర్వహిస్తుంటారు.

రహస్యంగా ఏర్పాట్లు..
ఎట్టి పరిస్థితుల్లోనూ కోడి పందేలు జరగనిచ్చేది లేదంటూ జిల్లా పోలీసు యంత్రాంగం చేస్తున్న హెచ్చరికలను పందెం రాయుళ్లు పెద్దగా పట్టించుకోవడం లేదు. పందేల నిర్వహణకు రహస్యంగా ఏర్పాట్లు ప్రారంభించారు. ఇప్పటికే డెల్టా ప్రాంతంలోని పలు లాడ్జీల్లోని గదులు పండగ మూడు రోజులకు బుక్‌ అయిపోవడం గమనార్హం.

రిహార్సల్స్‌ మొదలయ్యాయి
ఇటీవల చింతలపూడి మండ లంలో కోడిపందేల శిబిరంపై పోలీసులు దాడి చేసి రూ.లక్ష వరకు విలువ చేసే 50కి పైగా పందెంకోళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటిని కోర్టులో హాజరుపరిచి జడ్జి సమక్షంలో వేలం పాట నిర్వహించగా ఒక్కో కోడిని రూ.20 వేలకు పైగా ధర పెట్టి కొందరు దక్కించుకున్నారు.

ఒత్తిళ్లు.. ఆహ్వానాలు
సంక్రాంతి నాలుగు రోజులపాటు కోడి పందేలు, పేకాటకు అనధికారికంగా అనుమతి లభించేలా చూడాలని జిల్లాలోని ముఖ్య ప్రజాప్రతినిధులపై ఇప్పటికే వారి అనుచరుల నుంచి ఒత్తిడి మొదలైంది. దీనికి నేతలు కూడా సానుకూలంగానే స్పందిస్తున్నట్లు సమాచారం. ఇతర ప్రాంతాల్లోని బంధువులు, నేతలు, పారిశ్రామిక వేత్తలు, సినీనటులను పందేలకు తరలిరావాలని ఆహ్వానిస్తున్నట్లు తెలుస్తోంది.

నిడదవోలు, చింతలపూడి, లింగపాలెం, భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: చట్టానికి విరుద్ధంగా కోడిపందేలు, జూదాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ రాహుల్‌దేవ్‌ శర్మ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు పోలీస్‌ స్టేషన్లలో బైండోవర్‌ కేసులు నమోదు చేస్తున్నారు. ఇదిలా ఉండగా సంక్రాంతి సంప్రదాయం ముసుగులో పందేలకు నిర్వాహకులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. గతేడాది కొవిడ్‌ ఉద్ధృతితో నిబంధనలను ప్రభుత్వం కఠినతరం చేసింది. అయినా జిల్లాలోని ఏజెన్సీ, డెల్టా ప్రాంతాల్లో పందేల జోరు కొనసాగుతూనే ఉంది. పుంజుల కొట్లాట నడుమ రూ.కోట్లు చేతులు మారుతున్నాయి.

కోడిపందేలు, జూదం నిర్వహిస్తే చర్యలు తప్పవు. తెలిస్తే వాట్సాప్‌ నంబరు 95503 51100కు తెలియజేయాలి. - రాహుల్‌దేవ్‌ శర్మ, ఎస్పీ

గతంలో నమోదు చేసిన బైండోవర్‌ కేసులు1,398
ఏటా పండగల సమయంలో స్వాధీనం చేసుకునే నగదురూ.15 లక్షలకు పైగా
పందేల సమయంలో పట్టుబడుతున్న జూదగాళ్లుసుమారు 2,200 మంది
జూదగాళ్లపై ఏటా నమోదు చేస్తున్న కేసులుదాదాపు 675 నుంచి 700

ఇదీ చదవండి:

జల్లికట్టు జరుగుతుండగా బైక్​ ప్రయాణం- చావుబతుకుల్లో మహిళ!

Last Updated : Jan 3, 2022, 10:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.