ETV Bharat / state

ఏవోబీలో ఉద్రిక్త వాతావరణం.. బిక్కుబిక్కుమంటున్న గిరిజనులు

author img

By

Published : Jul 22, 2021, 4:43 PM IST

tribes from andhra odisha boarder
ఏవోబీలో ఉద్రిక్త వాతావరణం

ఆంధ్రా -ఒడిశా స‌రిహ‌ద్దులోని ఏవోబీలో గిరిజనలు బిక్కుబిక్కుమంటున్నారు. ఈ నెల 28 నుంచి మావోయిస్టులు తలపెట్టిన అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు భగ్నం చేయాలన్న పట్టుదలలో పోలీసులు ఉన్నారు. దీంతో స‌రిహ‌ద్దుల్లో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మరోవైపు తప్పించుకు తిరుగుతున్న మావోయిస్టుల కోసం పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు ప్రారంభించారు.

ఆంధ్రా -ఒడిశా స‌రిహ‌ద్దుల్లో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ నెల 28 నుంచి అమరవీరుల సంస్మరణ వారోత్సవాలకు మావోయిస్టులు పిలుపునివ్వడంతో మళ్లీ సరిహద్దు టెన్ష​న్ పుట్టిస్తోంది. ఇదే సమయంలో బుధవారం ఉదయం గూడెంకొత్తవీధి మండలం పెబ్బెంపల్లి అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరగడం.. తప్పించుకున్న మావోయిస్టుల కోసం పోలీసులు గాలింపు చర్యలను ముమ్మరం చేయడంతో ఏవోబీలో ఎప్పుడు ఏం జరుగుతుందోనని గిరిజనులు భయాందోళన చెందుతున్నారు.

సీపీఐ మావోయిస్టు పార్టీ తూర్పు డివిజన్‌ గాలికొండ ఏరియా కమిటీ పరిధిలో కొంతకాలం నుంచి తరచూ ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. కొయ్యూరు మండలం యూ.చీడిపాలెం పంచాయతీ పాల‌స‌ముద్రం అటవీ ప్రాంతంలో మే నెలలో ఎదురుకాల్పులు జరగ్గా.. ఇరువైపులా ఎటువంటి ప్రాణనష్టం వాటిల్లలేదు. అయితే జూన్‌ 16న తీగ‌ల‌మెట్ట ప్రాంతంలో మరోసారి ఎదురుకాల్పులు జరిగి, ఆరుగురు మావోయిస్టులు మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జూలై 28 నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు మావోయిస్టులు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలకు ఏవోబీలో ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిసింది. మారుమూల గ్రామాల్లో గిరిజనులతో సమావేశాలు నిర్వహిస్తూ, తీగలమెట్ట ఎన్‌కౌంటర్‌ మృతుల పేరిట స్థూపాలు ఏర్పాటుచేసి, ఘనంగా నివాళులు అర్పించాలని ప్రజలకు చెబుతున్నట్టు పోలీసు వర్గాలకు సమాచారం అందింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఇటు తూర్పుగోదావరి, అటు ఒడిశా సరిహద్దు మండలాల్లో గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.

ఈ నేపథ్యంలో ఒడిశా కటాఫ్‌ ఏరియాకు ఆనుకుని ఉన్న జీకే వీధి మండలం అమ్మవారి ధారకొండ పంచాయతీ పెబ్బెంపల్లి గ్రామ సమీప అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కదలికలు ఉన్నాయన్న పక్కా సమాచారం మేరకు బుధవారం ఉదయం పోలీసులు గాలింపు చర్యలు మొదలుపెట్టారు. సుమారు 10 గంటల ప్రాంతంలో కూంబింగ్‌ నిర్వహిస్తున్న పోలీసులకు.. మావోయిస్టులు తారసపడడంతో ఇరుపక్షాల నడుమ కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇరువైపులా ఎటువంటి నష్టం జరగలేదని లేదని ప్రాథమిక సమాచారం. తప్పించుకున్న వారిలో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు ఉద‌య్ అలియాస్ గాజ‌ర్ల ర‌వి, విశాఖ‌-తూర్పు డివిజ‌న్ క‌మిటీ కార్య‌ద‌ర్శి అరుణ ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. వీరి కోసం అదనపు బలగాలతో కూంబింగ్‌ను ఉద్ధృతం చేశారు. కొయ్యూరు, చింతపల్లి, జి.మాడుగుల మండలాల్లోని పోలీసు స్టేషన్లను అప్రమత్తం చేశారు.


బిక్కుబిక్కుమంటున్న గిరిజనులు

అమరవీరుల సంస్మరణ వారోత్సవాలకు వారం రోజుల ముందు ఎదురుకాల్పులు జరగడంతో గిరిజన గ్రామాల్లో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను భారీగా నిర్వహించాలని మావోయిస్టులు, వీరి ప్రయత్నాలను భగ్నం చేయాలని పోలీసులు పట్టుదలతో ఉండటంతో ఎటువంటి హింసాత్మక సంఘటలు జరుగుతాయోనని ఆదివాసీలు భయపడుతున్నారు.

ఇదీ చదవండి:

CM Jagan alert on rains: భారీ వర్షాలు... అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశాలు

వర్ష బీభత్సం- స్తంభించిన రవాణా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.