ETV Bharat / state

60 తులాల బంగారం, కేజీన్నర వెండి మాయం

author img

By

Published : Dec 15, 2020, 4:52 PM IST

Updated : Dec 16, 2020, 7:44 AM IST

Theft in a locked house
ఆభరణాలు చోరీ

విశాఖ జిల్లా ఆక్కయ్యపాలెంలో చోరీ జరిగింది. తాళం వేసిన ఇంట్లోకి దొంగలు చొరబడి బీరువాలో ఉన్న సుమారు రూ.40లక్షల విలువైన నగలు దోచుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

ఇటీవల ఇల్లు కొనుగోలు చేద్దామనే ఆలోచనతో ఉన్న బంగార్రాజు పైసాపైసా కూడబెట్టారు. అక్కయ్యపాలెంలోని ఓ బ్యాంకు లాకర్‌లో ఉంచిన బంగారం, వెండిని ఇంటికి తెచ్చి బీరువాలో భద్రపరిచారు. తాళాన్ని కూడా అక్కడే పెట్టాడు.

సోమవారం రాత్రి కిరాణా జనరల్‌ స్టోర్స్‌ నిర్వహించుకునే బంగార్రాజు ఇంట్లో బంగారం, వెండి కనిపించలేదు. బీరువాలో దుస్తులు చెల్లాచెదురవడంతో ఆందోళన రేగింది. భారీ స్థాయిలో సొత్తు అపహరణకు గురయినట్లు తెలియడంతో స్థానికంగా కలకలం రేగింది. ఈ ఘటనపై పోలీసులు, బాధితులు తెలిపిన వివరాలివి.

నర్సీపట్నానికి చెందిన జాలుమోరి బంగార్రాజు కుటుంబంతో సహా కొన్నేళ్ల క్రితం నగరానికి వచ్చారు. అక్కయ్యపాలెంలో ఓ గ్రూప్‌హౌస్‌ మొదటి అంతస్తులో ఉంటూ దగ్గర్లోనే ఓ కిరాణా జనరల్‌ స్టోర్స్‌ నడుపుతున్నారు. వీరి కుమార్తె కుటుంబం బెంగళూరులో ఉంటోంది.పగలు భార్యభర్తలిద్దరిలో ఒకరు ఇంట్లో, మరొకరు దుకాణంలో ఉంటారు. సాయంత్రం రద్దీ సమయాల్లో ఇంటికి తాళం వేసి ఇద్దరూ దుకాణంలోనే ఉంటారు. తాళాల్లో ఒక సెట్టు వీరివద్ద, మరొకటి దుకాణంలో ఉంటుంది.

14వ తేదీన ఏమయిందంటే..

సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి 5.30 వరకు విశ్రాంతి తీసుకొన్న బంగార్రాజు ఇంటికి తాళాలు వేసి దుకాణానికి వెళ్లారు. రద్దీగా ఉండటంతో దంపతులిద్దరూ దుకాణంలోనే ఉండిపోయారు. హడావుడి తగ్గాక భార్య రాత్రి ఇంటికి వచ్చారు. తలుపు దగ్గరకు వేసి ఉండటంతో అనుమానంతో పరిశీలించగా బీరువాలో ఉన్న దుస్తులు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. అందులో ఉంచిన 60 తులాల బంగారం, కేజీన్నర వెండి వస్తువులు కనబడలేదు. భర్తకు ఫోన్లో సమాచారం అందించింది. తరువాత బాధితులు నాలుగో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో క్రైం డీసీపీ సురేశ్‌బాబు ఆధ్వర్యంలో ఏసీపీలు, సీఐలు, సిబ్బంది సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఇంట్లో ఆధారాలు సేకరించారు. పక్కనే దుకాణాల్లో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్‌ పరిశీలించారు. ఆ భవనంలో ఉంటున్న వారిని, దుకాణంలో పనిచేసే ఏడుగురినీ పోలీసులు విచారిస్తున్నారు.

తాళం కప్ప ఏమైంది..

ఇంటికి తాళం వేశామని బాధితులు చెబుతున్నారు. దొంగతనం జరిగిన తీరు చూస్తే అలాంటి ఆనవాళ్లు కనపడటం లేదు. తాళం పగులగొట్టిన గుర్తులు కూడా లేవు. చుట్టుపక్కల వెతికినా కప్ప కనిపించలేదు. దొంగతనం జరిగిన తీరుచూస్తే బాగా అనుభవం ఉన్న వ్యక్తులే చేసి ఉంటారని భావిస్తున్నారు.

ఇదీ చదవండి: 'వైకాపాను విమర్శించే అధికారం అయ్యన్నకు లేదు'

Last Updated :Dec 16, 2020, 7:44 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.