ETV Bharat / state

అధ్వానంగా విశాఖ రోడ్లు..తాత్కాలిక మరమ్మతులు చేపట్టని అధికారులు

author img

By

Published : Oct 20, 2020, 5:42 PM IST

రాష్ట్రంలో భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రహదారులు పలుచోట్ల చెరువులను తలపిస్తున్నాయి. మరికొన్ని చోట్ల రోడ్డుపై రాళ్లు తేలి, గుంతలు పడి వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. అధికారులు ఇంతవరకు తాత్కాలిక మరమ్మతులు కూడా చేపట్టలేదు. విశాఖ జిల్లాలో ఆయాప్రాంతాల్లో రహదారులు అధ్వానంగా తయారయ్యాయి.

worst condition of roads
పాడైపోయిన రహదారులు

విశాఖ జిల్లాలో ఇప్పటికే అధ్వానంగా ఉన్న రహదారులు కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు మరింత దారుణంగా తయారయ్యాయి. గతంలో ఏర్పడిన గుంతలు భారీ వర్షాల కారణంగా మరింత పెద్దవి అయ్యాయి. పలుచోట్ల రహదారులపై నీరు నిలిచి చెరువులను తలపిస్తున్నాయి. కొన్నిచోట్ల తారు తొలగి, రాళ్లు తేలిపోయి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇంతవరకు తాత్కాలిక మరమ్మతులు కూడా చేపట్టలేదు.

జిల్లాలోని భీమునిపట్నం-నర్సీపట్నం రహదారి పూర్తిగా పాడైపోయింది. చోడవరం నుంచి చీడికాడ కె.కోటపాడు, దేవరపల్లి వెళ్లే దారుల్లో గోతులు ఏర్పడ్డాయి. నర్సీపట్నం నుంచి గొలుగొండ, రోలుగుంట, కోటవురట్ల, నాతవరం వెళ్లే దారులదీ ఇదే దుస్థితి.. ఇక విశాఖ ఏజెన్సీకి సంబంధించి పాడేరు నుంచి జి.మాడుగుల, అచ్యుతాపురం, గాజువాక వెళ్లే రహదారులు నరకాన్ని తలపిస్తున్నాయి. ద్విచక్ర వాహన ప్రయాణం పక్కన పెడితే కాలినడకే భయానకంగా ఉంటుందని పలువురు పాదచారులు వాపోతున్నారు.

కొన్ని గ్రామీణ ప్రాంతాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం లేకపోవడంతో ఆటోలు, ఇతర ప్రైవేటు వాహనాలపైన ఆధారపడుతుంటారు. రహదారులు సరిగాలేక ప్రయాణికులకు ఆందోళనే కాక, అధిక చార్జీలు వసూలు చేస్తున్నారని వాపోతున్నారు. గతవారం కురిసిన వర్షాలకు పాయకరావుపేట మండలంలోని పెంటకోట-వెంకటనగరం రహదారి పూర్తిగా ధ్వంసమైంది. గొలుగొండ మండలంలోని పలు దారులపై భారీగా గోతులు పడ్డాయి. కృష్ణదేవిపేట రహదారిని నాలుగేళ్ల క్రితం కోటి యాభై లక్షలతో అభివృద్ధి చేశారు. మూడేళ్ల క్రితం మరమ్మతులు చేశారు. రెండు మూడు నెలలకే గొయ్యిలు ఏర్పడ్డాయి. ఆ మార్గాల్లో రాకపోకలు సాగించే ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు.

భారీ వర్షాలు, వరదల కారణంగా రహదారులు శిథిలావస్థకు చేరుకున్నాయని ఆర్​అండ్​బీ అధికారులు నివేదిక రూపొందించారు. 157.7కిలోమీటర్ల పొడవైన రోడ్లు దెబ్బతిన్నాయని.. 6.2 కోట్ల నష్టం వాటిల్లిందని అంచనా వేశారు. ఇక పంచాయతీల పరిధిలో దెబ్బతిన్న 21 రోడ్లకు తాత్కాలిక మరమ్మతులు చేసేందుకు 65 లక్షలు అవుతాయని లెక్కగట్టారు. శాశ్వత ప్రాతిపదికన వేయాలంటే ఆరు కోట్లు అవసరమని ప్రతిపాదించారు. ప్రస్తుతం నిధుల సమస్య ఉండటం వల్ల అత్యవసర పనులు చేయడానికి అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు జిల్లా నాయకుల ద్వారా ఆయా మంత్రులపై ఒత్తిడి తీసుకొచ్చి సత్వర పనులు చేపట్టే దిశగా సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

ఇదీ చదవండి: అక్టోబర్​ నెలలోనూ ఈ కుండపోత వానలేందీ?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.