ETV Bharat / state

పోలీసులపై మంత్రి అప్పలరాజు వ్యాఖ్యలు.. డీజీపీ ఏమన్నారంటే..?

author img

By

Published : Feb 12, 2022, 8:00 PM IST

విశాఖ శారదాపీఠం వద్ద పోలీసులపై.. మంత్రి సీదిరి అప్పల్రాజు చేసిన వ్యాఖ్యల వ్యవహారంపై.. డీజీపీ గౌతం సవాంగ్‌ ముక్తసరిగా స్పందించారు. ఆ వ్యాఖ్యలపై విచారణ జరుగుతోందని విలేకరులు అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు.

పోలీసులపై మంత్రి అప్పలరాజు వ్యాఖ్యలపై విచారణ జరుగుతోంది
పోలీసులపై మంత్రి అప్పలరాజు వ్యాఖ్యలపై విచారణ జరుగుతోంది

విశాఖ శారదాపీఠం వద్ద పోలీసులపై.. మంత్రి సీదిరి అప్పల్రాజు చేసిన వ్యాఖ్యల అంశంపై.. డీజీపీ గౌతం సవాంగ్‌ ముక్తసరిగా స్పందించారు. ఇవాళ విశాఖలో పర్యటించిన ఆయన.. మంత్రి వ్యాఖ్యలపై విచారణ జరుగుతోందని విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. అంతకు ముందు డీజీపీ విశాఖ శ్రీ శారదాపీఠాన్ని సందర్శించారు. పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతి, స్వాత్మానందేంద్ర సరస్వతి ఆశీస్సులు తీసుకున్నారు. రాజశ్యామల అమ్మవారి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు.

వివాదం ఏంటంటే..
ముఖ్యమంత్రి జగన్ విశాఖ పర్యటన సందర్బంగా పశుసంవర్థకశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు శారదాపీఠం ముఖద్వారం వద్ద చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఈనెల 9న మంత్రి అప్పలరాజు తన అనుచరులతో కలిసి చినముషిడివాడలోని శారదా పీఠం వార్షిక మహోత్సవానికి హాజరయ్యారు. అప్పటికి ఇంకా సీఎం జగన్‌ రాలేదు. మంత్రి అప్పలరాజు పీఠం ముఖద్వారం నుంచి లోపలికి వెళ్లేటప్పుడు ఆయనతో పాటు ఉన్న పలాస పురపాలక సంఘం మాజీ ఛైర్మన్‌ పూర్ణచంద్రరావు, ఆయన అనుచరులను సీఐ రాజుల్‌ నాయుడు అడ్డుకోవడంపై మంత్రి అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఐపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. చేయి వేసి ముందుకు తోశారు.

"సీఎం మాకు దేవుడు. ఆయన చిత్రాన్ని ఇంట్లో పెట్టి పూజ చేసుకుంటాం. ఇక్కడ మాత్రం నచ్చితే రా.. లేకపోతే మానేయ్‌ అనడానికి ఎవడీయన. నాకు అర్థం కాదు. ఏయ్‌ బాబూ... తమాషాలు చేస్తున్నావా ? చొక్కా పట్టుకొని లాగేస్తా (ఇక్కడో అసభ్యకర పదం వాడారు). పిచ్చిపిచ్చి వేషాలా ? ఎలా కనిపిస్తున్నాం? మీ కమిషనర్‌ని రమ్మనండి. పిలిపిస్తారా లేదా ? ఆ భాషకి మాకు అర్థం తెలియాలి కదా.. ముందు సీపీని రమ్మనండి. మంత్రిని కదాని నాతోపాటు మా కుర్రోళ్లు సరదాపడి వచ్చారు. అందులో పురపాలక సంఘం మాజీ ఛైర్మన్‌ ఉన్నారు. అలాంటిది ఆయన ఏమన్నాడో తెలుసా ? నీకు నచ్చితే నువ్వు రా.. లేకపోతే నువ్వూ (సీఐ ఇక్కడ అసభ్యకర పదం వాడారని మంత్రి పేర్కొన్నారు). అదేంటో మాకు తెలియాలి కదా" అని అప్పల రాజు మండిపడ్డారు.

ఆ తర్వాత "అయ్యా మీకో నమస్కారం" అంటూ అక్కడి నుంచి వెనుదిరిగి కారులో వెళ్లిపోయారు. వెళ్లిపోతున్న మంత్రిని పోలీసు అధికారులు సముదాయించేందుకు ప్రయత్నించారు. ఎంత బతిమిలాడినా అసహనం వ్యక్తం చేయడంతో పోలీసులు ఏమీ చేయలేకపోయారు. ఈ సమయంలో మంత్రి అనుచరులు సీఐని సస్పెండ్‌ చేయాలని, క్షమాపణ చెప్పించాలని నినాదాలు చేశారు. మంత్రిని అడ్డుకున్న సీఐ ప్రస్తుతం వీఆర్‌లో ఉన్నారు.

మంత్రి అప్పలరాజు బహిరంగ క్షమాపణ చెప్పాలి: పోలీసు అధికారుల సంఘం
విధి నిర్వహణలో ఉన్న పోలీసు అధికారిని మంత్రి సీదిరి అప్పలరాజు పరుష పదజాలంతో దుర్భాషలాడి.. దౌర్జన్యం చేయడాన్ని ఆంధ్రప్రదేశ్‌ పోలీసు అధికారుల సంఘం ఖండించింది. వెంటనే మంత్రి బహిరంగ క్షమాపణ చెప్పాలని పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జె. శ్రీనివాసరావు డిమాండ్‌ చేశారు. ఈ సంఘటనపై ముఖ్యమంత్రి విచారణ చేయించి తగు చర్యలు తీసుకోవడంతోపాటు భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని సంఘం నాయకులు విజ్ఞప్తి చేశారు.


ఇదీ చదవండి

Seediri Appala Raju: సీఐపై మంత్రి అప్పలరాజు వ్యాఖ్యలు కలకలం... చొక్కా పట్టుకొని లాగేస్తానంటూ..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.