ETV Bharat / state

జీవీఎంసీకి 2 'బండికూట్'‌లు.. ఇక సులభం మురుగు పనులు

author img

By

Published : Dec 12, 2020, 9:40 AM IST

ఇన్ని రోజులు డ్రైనేజీని తీసేందుకు మనుషులు కష్టపడ్డారు. ఇప్పుడు ఆ స్థానంలో మర యంత్రాలు (రోబో) వచ్చేశాయి. ఇవి మ్యాన్​ హోల్స్, సెప్టిక్ ట్యాంకుల్లో క్లిష్టమైన సమస్యలను పరిష్కరిస్తాయి. బండికూట్​గా పేరున్న ఈ రోబోలను జీవీఎంసీ అందుబాటులోకి తీసుకురానుంది.

జీవీఎంసీకి 2 బండీకూట్‌ రోబోలు
జీవీఎంసీకి 2 బండీకూట్‌ రోబోలు

భూగర్భ మురుగునీటి వ్యవస్థల్ని బాగుచేసేందుకు జీవీఎంసీ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మ్యాన్‌హోల్స్​లో, సెప్టిక్‌ట్యాంకుల్లో క్లిష్టమైన సమస్యల పరిష్కారానికి రెండు రోబోల్ని తెప్పిస్తోంది. వీటిని ‘బండికూట్‌ (వీ2.0)’గా పిలుస్తున్నట్లు జీవీఎంసీ అధికారులు తెలిపారు. వీటిని సుమారు 6 నెలల పాటు ఉంచుకునేందుకు సుమారు రూ. 80 లక్షల వరకు ఖర్చుపెడుతున్నారు. మరో నెల రోజుల్లో ఇవి అందుబాటులోకి రానున్నట్లు అధికారులు తెలిపారు.

రోబోలు ఏం చేస్తాయంటే..

మ్యాన్‌హోల్, సెప్టిక్‌ట్యాంకుల్ని శుభ్రపరిచే కార్మికులు అనేకరోగాలకు గురవడం, పలువురు మృతిచెందడం వివిధ రాష్ట్రాల్ని వేధిస్తోంది. ఈ నేపథ్యంలో స్వచ్ఛ సర్వేక్షణ్​‌లో భాగంగా.. కార్మికులకు అండగా నిలిచేందుకు ఎలాంటి మానవ అవసరంలేని ఈ రోబోల్ని తెస్తున్నారు.

భూగర్భపైపుల్లో మురుగు జామ్‌ అయినప్పుడు వాటిలోతుల్లోకి వెళ్లి సమస్యను పూర్తిగా పరిష్కరించడం కష్టమవుతోంది. రోబోకు అనుబంధంగా ఉన్న పైపుద్వారా కెమెరాల్ని ఉంచి లోపలికివెళ్లడం, రిమోట్‌ ద్వారా లోపలి సమస్యకు పరిష్కారం చూపడం చేసే ఆలోచన చేస్తున్నారు. ఈ మొత్తం రోబోను ఆపరేట్‌ చేసేందుకు ఓ సాంకేతిక సిబ్బంది అవసరం అవుతుంది.

పైపుల్లో మురుగు స్తంభించినా, పైపుల్ని మార్చాల్సి వచ్చినా.. ఈ యంత్రాన్ని వినియోగించి సూక్ష్మమైన పనుల్నీ చేసే అవకాశం ఉంది. వీటి ఏర్పాటు, వినియోగం నిమిత్తం ఇప్పటికే జీవీఎంసీని పలు స్టార్టప్‌ కంపెనీలు సంప్రదించాయి కూడా. తాజాగా వీటిని రప్పించేందుకు జీవీఎంసీ టెండర్లకు వెళ్లింది. ఈ బండికూట్​ల రాక ఎప్పుడన్నది.. త్వరలోనే తేలే అవకాశం ఉంది.

ఇవీ చదవండి:

కోస్ట్​గార్డు, డిఆర్​ఐ జాయింట్ ఆపరేషన్..9కిలోల బంగారం స్వాధీనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.