ETV Bharat / state

International Blind Cricket Team: అంధుల క్రికెట్​.. ఆంధ్ర నుంచి అంతర్జాతీయ స్థాయికి

author img

By

Published : Jul 14, 2023, 8:23 PM IST

blind women's cricket team india
భారత మహిళల అంధుల క్రికెట్ జట్టులో స్దానం యువతులు

Blind women cricket team of india: మారుమూల ప్రాంతంలో.. పేదరికం అనుభవిస్తున్న జీవితాలు ఆ ముగ్గురు అమ్మాయిలవి. పైగా పుట్టుకతో వచ్చిన వైకల్యం వారి ఎదుగుదలకు అవరోధంగా మారింది. దానికి తోడు సమాజం పట్టించుకోలేదు. అయితేనేం ఎన్ని కష్టాలు వచ్చినా ఎదిరించి.. నిండైన అత్మవిశ్వాసంతో ముందుకు సాగారు. అవరోధాలనే అవకాశాలుగా మార్చుకుని లక్ష్యం వైపు అడుగులు వేశారు. ఫలితంగా అంతర్జాతీయ అంధుల క్రికెట్ టీంలో స్థానం లభించే స్థాయికి ఎదిగారు. ఇంతకీ ఎవరా అమ్మాయిలు? ఏంటా వారి స్ఫూర్తి కథనం అనుకుంటున్నారా..? అయితే వారి విజయాల వెనకున్న కథలు మీకు తెలియాల్సిందే..

ఆంధ్ర నుంచి అంతర్జాతీయ స్థాయికి

Blind women cricket team of india : ఉత్తరాంధ్ర జిల్లాల మారుమూల ప్రాంతాలకు చెందిన ఈ ముగ్గురు యువతుల పేర్లు రవణి, సంధ్య, సత్యవతి. తమకు క్రికెట్ పై ఉన్న అభిరుచితో దానికి సానపెట్టేందుకు చినజీయర్ స్వామి ఆధ్వర్యంలో నడుస్తున్న విశాఖ భీమిలి బీచ్ రోడ్​లో ఉన్న వారిజ ఆశ్రమం ఆంధుల పాఠశాల నిర్వాహకులు ఇచ్చిన ప్రోత్సాహం వీరికి కొత్త గమ్యాన్ని సానుకూలం చేస్తోంది.

అంతర్జాతీయ వేదికపై ఆడనున్న మట్టిలో మాణిక్యాలు..
ఈ ముగ్గురు క్రికెటర్ల ప్రస్థానం ఆత్మస్థైర్యం, పట్టుదల ఉంటే ఏమైనా సాధించవచ్చు అని చెప్పడానికి ఉదాహరణగా నిలుస్తోంది. ఈ ముగ్గురు క్రికెటర్లు ప్రస్తుతం విశాఖ పట్నంలోని నేత్ర విద్యాలయం వారిజ ఆశ్రమంలో ఉంటూ భారత మహిళల అంధుల క్రికెట్ జట్టులో స్దానం పొందారు. ఇంగ్లండ్​లోని బర్మింగ్ హామ్​లో ఆగస్టు 18 నుంచి 27 వరకు జరగనున్న అంతర్జాతీయ అంధుల స్పోర్ట్స్ అసోసియేషన్ (ఐబీఎస్ఏ) వరల్డ్ గేమ్స్ లో భారత అంధుల క్రికెట్ జట్లు పాల్గొంటున్నాయి. ఇందులో మహిళల జట్టు తరుపున రవణి, సంధ్య, సత్యవతి బరిలోకి దిగనున్నారు. రెండు రోజుల క్రితమే వీసా ఇంటర్వ్యూలు కూడా పూర్తయ్యాయి.

వ్యవసాయమే జీవనాధారంగా బతికే రవణి కుటుంబం..
రవణి స్వస్థలం అల్లూరి జిల్లా కేంద్రంమైన పాడేరులోని రంగసింగపాడు. వ్యవసాయమే జీవనాధారంగా బతికే ఆదివాసి కుటుంబంలో జన్మించిన రవణి పుట్టుకతోనే అంధురాలు. దీంతో ఆమె తల్లిదండ్రులు గోపాలకృష్ణ, చిట్టమ్మ చూపు లోపంతో పుట్టిన ఈమె రెండో తరగతి వరకు గ్రామంలోనే చదువించారు. ఆతర్వాత ఊర్లోని పెద్ద మనుషుల సలహా మేరకు రవణిని వారి తల్లి దండ్రులు విశాఖలోని చిన్నజియర్ స్వామి ట్రస్టు నడిపిస్తున్న నేత్ర విద్యాలయం వారిజ ఆశ్రమంలో చేర్పించారు. అంతవరకు గ్రామం దాటి ఎప్పుడు బయటి ప్రపంచంలోకి అడుగుపెట్టని రవణి కొత్తలో ఆశ్రమంలో ఉండలేక తరచూ పారిపోవడానికి ప్రయత్నించేది. అతర్వాత అక్కడ ఉపాధ్యాయులు, సిబ్బంది రవణి మనసును నెమ్మదిగా మారుస్తూ ఆశ్రమంలో ఉండడానికి అలవాటు చేశారు. అలా ఆత్మవిశ్యాసం ప్రొది చేసుకున్న రవణి తన వైకల్యాన్ని మర్చిపోయి ఆటల్లో చురుగ్గా పాల్గొనండం ప్రారంభించింది.

సంధ్య తల్లిదండ్రులిద్దరూ వ్యవసాయ కూలీలే..
బాల్యం నుంచి ఏ క్రీడైనా చురుగ్గా ఆడే సంధ్య ది మన్యం జిల్లా పార్వతీపురానికి చాలా దూరంగా ఉన్న మారుమూల కుగ్రామం. తల్లిదండ్రులిద్దరూ వ్యవసాయ కూలీలే. కొద్దిపాటి పొలం వారికి జీవనాధారం. 11 ఏళ్లప్పుడు వెయిట్ లిఫ్టింగ్ లో ప్రవేశించిన ఆమె రెండు సార్లు ఆంధ్ర ఛాంపియన్ గా నిలిచి పసిడి పతకాలు సాధించింది. 2013, 2016లో మహిళల 44 కిలోల కేటగిరీలో సంధ్య విజేత. 2016లో అయితే, అత్యధికంగా 165 కిలోల బరువెత్తి స్టేట్ రికార్డును నెలకొల్పింది. అతర్వాత సాధన చేయడానికి అవసరమైన సదుపాయాలు లేకపోవడంతో వెయిట్ లిఫ్టింగ్ అంటే ఇష్టమున్నా తప్పనిసరి పరిస్థితుల్లో ఆ గేము విడిచిపెట్టింది. విశాఖపట్నంలోని నేత్ర విద్యాలయం వారిజ ఆశ్రమంలో చేరాక షాట్ పుట్, డిస్కస్ త్రో వైపుకు మళ్లింది. తన ప్రతిభతో బెహ్రెయిన్లో 2019లో జరిగిన ఆసియా పారా అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ లో పాల్గొనే అవకాశం వచ్చినా భాషా సమస్య కారణంగా వైదొలగాల్సి వచ్చింది. ఆ ఘటనతో బాధపడిన సంధ్య అథ్లెటిక్స్ కి దూర మైంది. కొన్ని నెలలు తర్వాత అంధుల క్రికెట్ జట్టు గురించి తెలుసుకుని, ధోనీకి వీరాభిమాని అయిన సంధ్య బాట్ పట్టింది.

వికెట్ కీపర్ గా భారత అంధుల మహిళా క్రికెట్ జట్టులో సత్యవతి..
మగుపల్లి సత్యవతి స్వస్థలం శ్రీకాకుళం జిల్లా, రణస్థలం మండలం లోని జీరుపాలెం. వీరిది మత్యకారుల కుటుంబం. చేపల వేట వృత్తిగా సాగించే సంప్రదాయ మత్స్యకారులైన తల్లిదండ్రులు లక్ష్మణ్, పోలమ్మ కి ఈమె తొలి సంతానం. ఈమెకు బి3 కేటగిరి అంధత్వం, అంటే ఆరుమీటర్ల వరకే చూపుఉంటుంది. వికెట్ కీపర్ గా భారత అంధుల మహిళా క్రికెట్ జట్టులో ఈమె స్ధానం దక్కించుకుంది. తొలుత వేరే చోట విద్య నభ్యసించినా వారిజ అశ్రమం కి వచ్చిన తర్వాత క్రికెట్ ఇతర స్పోర్ట్స్ లో ఇచ్చే ప్రోత్సాహం ఆమెకు చక్కని బాటలు పరిచాయి.

ఎవరెవరికి ఎందులో ఆసక్తి ఉందో గమనించడం..
ఎవరెవరికి ఎందులో ఆసక్తి ఉందో గమనించడం వారిజ ఆశ్రమంలో నిర్వాహకులు, ఉపాధ్యాయులు నిరంతరం చేయడం వల్లనే ఇది సాధ్యమైంది. దీనికి చినజీయర్ స్వామివారి మంగళశాసనాలు లభించడంతో వీరి ప్రతిభకు సానపట్టి భారత జట్టులో స్దానం లభించిందన్నది ఇక్కడి వారి అభిప్రాయం..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.