ETV Bharat / state

రుషికొండను పిండి చేస్తున్నారు.. సుప్రీం వద్దన్నచోటే పునాదుల తవ్వకం!

author img

By

Published : Jul 1, 2022, 8:20 AM IST

Updated : Jul 1, 2022, 8:28 AM IST

RUSHIKONDA: రుషికొండ వద్ద చేపట్టిన పర్యాటక ప్రాజెక్టు పనుల్లో సుప్రీంకోర్టు ఆదేశాలను పాటిస్తున్న దాఖలాలు కనిపించడంలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొెండ వద్ద కొత్తగా తవ్విన చోట ఎటువంటి నిర్మాణాలు చేపట్టకూడదని.. కేవలం పాత రిసార్టు ఉన్నచోటే.. భవనాలున్న ప్రాంతంతో పాటు మైదాన ప్రాంతంలో పనులు చేసుకోవచ్చని జూన్‌ 1న సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే.

RUSHIKONDA
RUSHIKONDA

RUSHIKONDA: విశాఖపట్నంలోని రుషికొండ వద్ద చేపట్టిన పర్యాటక ప్రాజెక్టు పనుల్లో సుప్రీంకోర్టు ఆదేశాలను పాటిస్తున్న దాఖలాలు కనిపించడంలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సుప్రీం తీర్పునకు విరుద్ధంగా పనులు జరుగుతున్నాయని పర్యావరణవేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రుషికొండ వద్ద కొత్తగా తవ్విన చోట ఎటువంటి నిర్మాణాలు చేపట్టకూడదని.. కేవలం పాత రిసార్టు ఉన్నచోటే.. భవనాలున్న ప్రాంతంతో పాటు మైదాన ప్రాంతంలో పనులు చేసుకోవచ్చని జూన్‌ 1న సుప్రీంకోర్టు ఆదేశించింది. అయినా అందుకు విరుద్ధంగా పనులు సాగుతున్నాయనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ కొండ మీద నిబంధనలకు విరుద్ధంగా పనులు జరుగుతున్నాయని ఎంపీ రఘురామకృష్ణరాజు గతంలో జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్‌జీటీ)ను ఆశ్రయించగా మే 6న ఇక్కడ పనులు నిలిపేయాలని ఎన్‌జీటీ ఆదేశించిన విషయం తెలిసిందే. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీలు చేయగా పైవిధంగా తీర్పు వెలువరించింది.

ఇలా చేస్తున్నారు
ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) రుషికొండ వద్ద పర్యాటక పునరుద్ధరణ ప్రాజెక్టు పేరుతో నిర్మాణ పనులు ప్రారంభించింది. కేవలం పాత నిర్మాణాలను తొలగించి కొత్తవి కడుతున్నామని చెబుతుండగా.. కొండను పూర్తిగా తవ్వి చదును చేసేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తడంతో విషయం సుప్రీంకోర్టు వరకు చేరింది. కొండ తవ్వకం చాలా వరకు పూర్తికావడంతో తాజాగా భవన నిర్మాణాల కోసం పునాదులు నిర్మిస్తున్నారు. గతంలో సముద్రానికి అభిముఖంగా రిసార్టు గదులు ఉండేవి. రెస్టారెంటు, సమావేశ మందిరం, పర్యాటకుల వసతి గదులు కూడా అక్కడే ఉండేవి. ప్రస్తుతం చేపడుతున్న పనులు అటువైపు కాకుండా విశాఖ-భీమిలి రోడ్డు వైపు, కొత్తగా కొండను తొలిచిన ప్రాంతంలోనూ సాగుతుండడం గమనార్హం. ఇక్కడ మూడుచోట్ల పనులు జరుగుతున్నాయి. గతంలో ఈ వైపు కనీసం మైదాన ప్రాంతమైనా లేదు. మొత్తం కొండ మాత్రమే ఉండేది. ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న నిర్మాణం పనులను గమనిస్తే సుప్రీంకోర్టు ఆదేశాలకు పూర్తి విరుద్ధంగా సాగుతున్నాయనే విమర్శలు వస్తున్నాయి. అలాగే నిర్మాణ అవసరాల కోసం రుషికొండ వద్ద భూగర్భ జలాలను వాడేస్తున్నారు. తీర ప్రాంత జోన్‌ (సీఆర్‌జెడ్‌) అనుమతుల్లో భూగర్భ జలాలను వినియోగించకూడదని స్పష్టంగా పేర్కొనడం గమనార్హం. అయితే ఇక్కడ గతం నుంచి ఉన్న మోటారు నుంచే నీటిని పైపులైన్ల ద్వారా సరఫరా చేస్తున్నట్లు తెలుస్తోంది.

అనుమతుందా?

ఒకవైపు కొండను తవ్వి నిర్మాణాలు చేపడుతున్నా ఇప్పటివరకు భవన నిర్మాణాలకు కనీసం అనుమతి తీసుకోకపోవడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొద్దిరోజుల కిందట ఏపీటీడీసీ అధికారులు మాన్యువల్‌గా ప్లానింగ్‌కు అనుమతి కోరారు. అయితే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలని జీవీఎంసీ అధికారులు స్పష్టం చేసినట్లు సమాచారం. ప్లాన్‌కు కనీసం అనుమతి లేకుండా నిర్మాణాలు ఎలా మొదలుపెట్టారనే అంశంపై ఎవరూ సమాధానం చెప్పటం లేదు. మరోవైపు భవనాలకు ఇంటీరియర్‌ డిజైన్లు, ల్యాండ్‌స్కేప్‌ ఆర్కిటెక్చరల్‌ పనులకు కన్సల్టెన్సీ సేవల కోసం ఏకంగా రూ.75.84 కోట్లకు టెండర్లు ఆహ్వానించడం గమనార్హం.

ఇవీ చదవండి:

Last Updated : Jul 1, 2022, 8:28 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.