ETV Bharat / state

వాహనచోదకుల బాధలు తీరేదెన్నడో.. వేలల్లో రుసుములు చెల్లిస్తున్నామంటూ అవేదన

author img

By

Published : May 31, 2023, 8:58 PM IST

Permanent Driving Lenience
లైసెన్సు కార్డులు

Permanent Driving Lenience : డ్రైవింగ్​పై ఆధారపడి జీవిస్తున్నవారికి వాహనమిత్ర అందించి నేనున్నానంటూ ముందుకు వచ్చిన ప్రభుత్వం.. ప్రస్తుతం డ్రైవర్ల సమస్యలను పట్టించుకోవటం లేదనిపిస్తోంది. వాహనదారులకు శాశ్వత డ్రైవింగ్​ లైసెన్సులు, రిజిస్ట్రేషన్​ కాగితాలు అందక రాష్ట్ర సరిహద్దులు దాటి.. ఇతర రాష్ట్రాలకు వెళ్లినప్పుడు అపరాధ రుసుముల రూపంలో వేలల్లో వారి జేబులకు చిల్లులు పడుతున్నాయి.

Permanent Driving Lenience Problems : వాహనమిత్రలకు 10వేల రూపాయలు ఇస్తున్నామని గొప్పలు చెబుకుంటున్న ప్రభుత్వం.. వారికి అవసరమైన శాశ్వత డ్రైవింగ్‌ లైసెన్సులు మాత్రం ఇవ్వలేకపోతోంది. మూడేళ్లుగా లైసెన్సు కార్డులు జారీకాక వాహనచోదకులు ఇబ్బందులు పడుతున్నారు. పక్క రాష్ట్రాలకు వెళ్లినప్పుడు వేల రూపాయలు అపరాధ రుసుం కట్టాల్సి వస్తోందని డ్రైవర్లు వాపోతున్నారు. రవాణా, హరిత పన్నుల పేరిట వందల రూపాయలు, అపరాధ రుసుముల రూపంలో వేల రూపాయలు ముక్కు పిండి వసూలు చేసే రవాణా శాఖ వాహన చోదకులు, వాహనాల యజమానులకు జారీ చేసే లైసెన్స్‌, ఆర్సీల శాశ్వత కార్డులు మాత్రం ఇవ్వకపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

వాహనం ఏదైనా నిబంధనలు సాకుగా చూపుతూ సవాలక్ష ప్రశ్నలు సంధించి అపరాధ రుసుము వసూలు చేయడమే పనిగా పెట్టుకున్న రవాణాశాఖ.. తన అసలైన బాధ్యతలను పూర్తిగా గాలికి వదిలేసింది. గత మూడేళ్లుగా వాహనాల రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్‌-ఆర్​సీ, డ్రైవింగ్‌ లైసెన్స్‌ కార్డుల జారీ నిలిపివేసింది. కార్డుల స్థానంలో తాత్కాలికంగా కాగితాలు ఇస్తూ.. వాటినే లైసెన్స్‌లు, ఆర్సీలుగా భావించాలని సూచిస్తోంది. డ్రైవింగ్‌ లైసెన్స్‌, వాహనాల రిజిస్ట్రేషన్‌ కోసం సర్వీస్‌ ఛార్జ్​, లైసెన్స్‌ కార్డు పేరుతో వందల రూపాయలు తీసుకొంటున్న రవాణాశాఖ డ్రైవింగ్‌ లైసెన్స్‌ కార్డులు, ఆర్సీలు మాత్రం జారీ చేయడం లేదని వాహనదారులు తీవ్రంగా మండిపడుతున్నారు.

రాష్ట్రంలో రవాణాశాఖ జారీ చేస్తున్న ఆర్​సీ, డ్రైవింగ్‌ లైసెన్స్‌ కాగితాలు పొరుగు రాష్ట్రాల్లో చెల్లడం లేదు. స్థానిక నిబంధనల మేరకు శాశ్వత కార్డులు లేని వాహనాల యజమానులు, డ్రైవర్లకు వేల రూపాయల జరిమానాలు విధిస్తున్నారు. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులను తీసుకొని పొరుగున ఉన్న తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు వెళ్లే వాహనాల యజమానులు, డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏపీ ప్రభుత్వం ఇచ్చిన ఆర్​సీ, డీఎల్​ కాగితాలను పక్క రాష్ట్రాలు.. చిత్తు కాగితాల్లా పరిగణిస్తూ జరిమానాలు విధిస్తున్నాయని వాహనదారులు, డ్రైవర్లు వాపోతున్నారు. తమకు ఇచ్చే బత్తానే అపరాధ రుసుములుగా చెల్లించాల్సి దుస్థితి వచ్చిందని.. డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తిరుపతి, చిత్తూరు జిల్లాలు ఉన్నాయి. వాటి పరిధిలో పలమనేరు, పుత్తూరు, శ్రీకాళహస్తి, పీలేరు, మదనపల్లె ప్రాంతీయ రవాణా కార్యాలయాలు పనిచేస్తున్నాయి. ప్రాంతీయ రవాణా కార్యాలయాల్లో డ్రైవింగ్‌ లైసెన్స్‌ పరీక్షలు, వాహనాల రిజిస్ట్రేషన్‌ చేపట్టినా తిరుపతి, చిత్తూరు జిల్లా కార్యాలయాల నుంచి కార్డులు జారీ చేయాల్సి ఉంటుంది. రెండు జిల్లాల్లోని రవాణా శాఖ కార్యాలయాల్లో మూడు సంవత్సరాలుగా కార్డుల జారీ ఆగిపోవడంతో లక్షల మంది వాహనాల యజమానులు, డ్రైవర్లు ఆర్సీలు, లైసెన్స్‌ కార్డులు లేక ఇబ్బందుల పాలవుతున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.