ETV Bharat / state

Ratha Saptami celebrations: రథసప్తమి వేడుకలకు సిద్ధమైన అరసవల్లి

author img

By

Published : Feb 7, 2022, 9:21 AM IST

Ratha Saptami celebrations: మాఘశుద్ధ సప్తమి(రథసప్తమి) రోజున అరసవల్లి క్షేత్రంలో కొలువైన సూర్యనారాయణస్వామిని దర్శించుకునేందుకు భక్తులు వేయి కళ్లతో ఎదురు చూస్తుంటారు. ప్రత్యక్ష భగవానుడైన ఆదిత్యుని నిజరూపాన్ని చూసి తరించాలని కోరుకుంటారు. ఆ సమయం రానే వచ్చింది. 8వ తేదీన రథసప్తమి ఉత్సవం జరుగుతుంది. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయి. విశాఖ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్రస్వామి మొదటి పూజ చేయనున్నారు.

Ratha Saptami celebrations
Ratha Saptami celebrations

Ratha Saptami celebrations: శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయంలో సూర్య జయంతి ఉత్సవాలు కోలాహలంగా సాగనున్నాయి. విశాఖ శారదా పీఠం ఉత్తరాధికారి స్వామి స్వాత్మానందేంద్ర సరస్వతి అరసవల్లి సూర్యభగవానుడికి తొలి పూజ చేయనున్నారు. స్వామి దర్శనం కోసం భక్తులు అధికసంఖ్యలో రానున్న నేపథ్యంలో ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

అన్ని ఏర్పాట్లు పూర్తి...

రథసప్తమి రోజున స్వామి దర్శనానికి వచ్చేవారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తున్నాం. ఇప్పటివరకు 600 మంది దాతలు వచ్చారు. వారికి శనివారం నుంచి పాస్‌లు అందజేస్తున్నాం. 5వ తేదీలోపు ఆలయ అభివృద్ధికి రూ.లక్ష విరాళం అందించివారందరికీ పాస్‌లు మంజూరు చేశాం. దాదాపు ఏర్పాట్లు పూర్తయ్యాయి. అన్నిశాఖల అధికారుల సమన్వయంతో వేడుకను విజయవంతం చేస్తాం. - వి.హరిసూర్యప్రకాష్‌, ఈవో, ఆదిత్యాలయం

సేవలివీ...

  • విశాఖకు చెందిన శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర స్వామిజీ మొదటిగా క్షీరాభిషేకం చేయనున్నారు.
  • విశేష అర్చనలు, ద్వాదశహారతి, మహానివేదన, పుష్పాలంకరణ సేవలు ఉంటాయి.
  • మరుసటి రోజు సాయంత్రం 4 గంటల వరకు నిజరూప దర్శనం కల్పిస్తారు.
  • 6 గంటలకు విశేషార్చన ఉంటుంది. రాత్రి 11 గంటల నుంచి ఏకాంతసేవ జరుగుతుంది.
స్వామి సన్నిధికి చేరుకునే మార్గ నమూనా

దర్శనానికి ఇలా వెళ్లాలి..

  • వీవీఐపీ, దాతలు, రూ.500 టిక్కెట్‌ లైన్లు ఆర్చిగేట్‌ సమీపంలో ప్రారంభమవుతాయి.
  • ఉచిత, రూ.100 టికెట్లు క్యూలైన్లలోకి శ్రీశయనవీధి రహదారి గుండా వెళ్లాలి.
  • మధ్యలో కేశఖండనశాలకు వెళ్లాలంటే వేరేగా నిర్మించిన క్యూలైనులో వెళ్లి అరసవల్లిలోని మున్సిపల్‌ హైస్కూల్‌లో మొక్కులు తీర్చుకోవచ్చు.
  • అనంతరం అక్కడ సమీపంలో నిర్మించిన ప్రత్యేక క్యూలైన్‌లో కలవాలి.
  • భక్తులను నియంత్రించేందుకు ఉచిత క్యూలైనులో 35 బాక్స్‌లుగా బారికేడ్లను నిర్మించారు. ఒక్కో బాక్స్‌లో వంద మందికిపైగా ఉండేటట్లు ఏర్పాటు చేశారు. ముందున్న బాక్స్‌ ఖాళీ అవుతుంటే వెనుక ఉన్నదాంట్లోని భక్తులను పంపుతారు.
  • వృద్ధులు, దివ్యాంగులు ఆర్చిగేట్‌ వద్ద రెవెన్యూ సిబ్బందిని సంప్రదిస్తే దర్శనానికి పంపుతారు.

600 మందితో బందోబస్తు..

రథసప్తమి వేడుక సందర్భంగా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. సుమారు 600 మంది సిబ్బంది విధులు నిర్వర్తించనున్నారు. ఇప్పటికే ఆలయంలో 32 సీసీ కెమెరాలు ఉన్నాయి. వీటితో పాటు రథసప్తమి రోజున డ్రోన్‌ కెమెరానూ వినియోగించనున్నారు.

టిక్కెట్లు.. ప్రసాదాలు..

  • ఉచిత దర్శనంతో పాటు, రూ.100, రూ.500 టిక్కెట్లు విక్రయించునున్నారు.
  • ఆలయం వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్ల ద్వారా ప్రసాదాలు, దర్శనం టిక్కెట్లను ఏపీజీవీ, యూనియన్‌ బ్యాంకు సిబ్బంది విక్రయిస్తారు.
  • ప్రసాదాలను ఆదిత్యాలయం ఎదురుగా ఉన్న కేంద్రాల్లోనే విక్రయిస్తారు. మొత్తం 8 కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. 70 వేల లడ్డూలు, 2 క్వింటాళ్ల పులిహోర సిద్ధం చేస్తున్నారు.

ప్రత్యేక బస్సులు..

శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్‌ నుంచి అరసవల్లి కూడలి వరకు ఆర్టీసీ అధికారులు 20 బస్సులు నడపనున్నారు. వీటికి అదనంగా గాయత్రీ సిల్స్క్‌ యాజమాన్యం ఉచిత బస్సు సౌకర్యం కల్పించనుంది.

డీసీఎంఎస్‌ గోడౌన్‌ వద్ద పార్కింగ్‌..

శ్రీకాకుళం నుంచి అరసవల్లి వచ్చే భక్తులు 80 అడుగుల రహదారిలో వాహనాలను నిలపాలి. విధుల నిమిత్తం వచ్చే వాహనదారులు డీసీఎంఎస్‌ గోడౌన్‌ వద్ద పార్కింగ్‌ చేయాలి. వీవీఐపీల వాహనాలు మాత్రమే ఆర్చిగేట్‌ వద్దకు అనుమతిస్తారు. గార వైపు నుంచి వచ్చే వాహనాలు అసిరితల్లి ఆలయం వద్ద ఉంచేలా ఏర్పాట్లు చేశారు.

అందుబాటులో అత్యవసర సేవలు...
ఇందిరా విజ్ఞాన్‌ భవన్‌, పెద్దతోట, సింహద్వారం, అసిరితల్లి ఆలయం వద్ద, ఇంద్రపుష్కరిణికి వెళ్లే దారిలో, కాపువీధి, శ్రీశయనవీధిలో మొత్తం 7 చోట్ల వైద్యశిబిరాలు ఏర్పాటు చేయనున్నారు. వీటితో పాటు 104, 108 వాహనాలు, అగ్నిమాపక శకటం అందుబాటులో ఉంటాయి.

ఇదీ చదవండి: వ్యవసాయ పనుల్లో సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.