ETV Bharat / state

ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఎడతెరిపి లేని వర్షాలు

author img

By

Published : Oct 15, 2020, 1:58 AM IST

Updated : Oct 15, 2020, 2:11 AM IST

http://10.10.50.85:6060///finalout4/andhra-pradesh-nle/finalout/15-October-2020/9178671_kj.JPG
http://10.10.50.85:6060///finalout4/andhra-pradesh-nle/finalout/15-October-2020/9178671_kj.JPG

బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రాజెక్టులు, వాగులు, వంకలు వరద నీటితో పరవళ్లు తొక్కుతున్నాయి. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

ఎడతెరిపి లేని వర్షాలకు శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా నదులు ఉప్పొంగాయి. నాగావళి, వంశధార నదులు వరదతో పోటెత్తాయి. మడ్డువలస, తోటపల్లి ప్రాజెక్ట్‌ నుంచి నాగావళికి వరద నీరు వచ్చి చేరడంతో.......సంతకవిటి మండలంలో పంట పొలాలు ముంపు బారిన పడ్డాయి. మెళియాపుట్టి మండలంలో రాధాకాంత సాగరం గెడ్డ ప్రవాహానికి గోకర్ణపురానికి చెందిన శ్రీనివాస్‌ అనే వ్యక్తి గల్లంతయ్యాడు. స్థానికులు గాలించినా ఆచూకి లభ్యం కాలేదు. బాహుదా నది ప్రవాహం కూడా తోడవుతున్నందున.....నదీ పరీవాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ నివాస్‌ సూచించారు. ఎప్పటికప్పుడు వరద సమాచారం సేకరించేలా మండల కేంద్రాల్లో కంట్రోల్‌రూమ్‌లు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్‌ తెలిపారు.

యువకుడు గల్లంతు...

సంతబొమ్మాళి మండలం మూలపేటలో చేపల వేటకు వెళ్లిన ఐదుగురు యువకుల్లో......ఒకరు ప్రమాదవశాత్తు జారిపడి నీటి ఉద్ధృతిలో కొట్టుకుపోయాడు. యువకుడిని ఎం.సున్నాపల్లి గ్రామానికి చెందిన మేరుగు నరేష్‌గా గుర్తించిన పోలీసులు....గజఈతగాళ్లతో సుమారు 8 గంటల పాటు గాలింపు చర్యలు చేపట్టారు. అయినా యువకుడి జాడ లభ్యంకాలేదు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో పాటు చీకటి పడటంతో గాలింపు చర్యలు నిలిపేశారు. ఈ రోజు మళ్లీ కొనసాగిస్తామని తెలిపారు. మూలపేట పరలో వరద నీటి ప్రవాహం ఎక్కువగా ఉందని, చేపల వేటకు వెళ్లొద్దని పోలీసులు హెచ్చరించారు. టెక్కలి నియోజకవర్గంలో గత మూడ్రోజులుగా కురిసిన వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. పట్టణంలోని మండాపొలం కాలనీలో జనం నడుంలోతు నీళ్లలో రాకపోకలు కొనసాగిస్తున్నారు. భవానినగర్‌, శ్రీనివాస నగర్‌ ప్రాంతాల్లో రహదారులపై నీరు నిలిచి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

విశాఖ మన్యంలోనూ....

భారీ వర్షాలకు పొంగిపొర్లుతున్న వాగులు వంకలతో విశాఖ మన్యంలో ప్రజలు అవస్థలు పడుతున్నారు. అరకులోయ మండలంలోని పెదలబుడు గ్రామానికి వెళ్లే రహదారి జలదిగ్బంధంలో చిక్కుకుంది. డుంబ్రిగూడ మండలంలోని పరిశీల వద్ద వంతెన లేకపోవడంతో.......తాడు కట్టుకుని అవతలి వైపుకు రాకపోకలు సాగిస్తున్నారు. దేవరాపల్లి వద్ద శారదా నదిపై ఉన్న కాజ్‌వే వరద ఉద్ధృతికి కొట్టుకుపోయింది.

రైవాడ జలాశయం గేట్లు ఎత్తి అదనపు నీటిని శారదా నదిలోకి విడుదల చేస్తుండడంతో....నది ఉగ్రరూపం దాల్చింది. ఫలితంగా కాజ్‌వే పూర్తిగా కొట్టుకుపోయింది. నదికి అటువైపున ఉన్న దేవరాపల్లి, అనంతగిరి, హుకుంపేట మండలాల్లోని దాదాపు 100 వరకు గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఎలమంచిలి నియోజకవర్గంలోని నారాయణపురం సమీపంలో మైనర్‌ శారదానది వంతెనపై నుంచి ప్రవహించడంతో.......ఎలమంచిలి - గాజువాక మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఈ మార్గం ద్వారానే విశాఖ స్టీల్‌ప్లాంట్‌ వెళ్ళాల్సి ఉండడంతో....భారీ వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. చోడవరంలో వరి, చెరకు పంటలు నీట మునిగాయి. పొలాలన్నీ చెరువులను తలపిస్తున్నాయి. రహదారులపై నాలుగు అడుగుల మేర వరద నీరు ప్రవహిస్తోంది. చోడవరం నుంచి చాకిపల్లి, చోడవరం- సింహాద్రిపురం మార్గావ్వో రాకపోకలు నిలిచిపోయాయి.

ఇదీ చదవండి:

భారీవర్షాలు, వరదలపై సీఎం జగన్‌ సమీక్ష

Last Updated :Oct 15, 2020, 2:11 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.