ETV Bharat / state

నాడు కళకళ.. నేడు విలవిల.. కుదేలైన ఆక్వా రంగం

author img

By

Published : Mar 17, 2023, 8:01 PM IST

AQUA FARMING: ఒకప్పుడు కాసుల వర్షం కురిపించిన ఆక్వారంగం కొన్ని కారణాల వల్ల ఇప్పుడు కుదేలవుతుందని ఆక్వా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రొయ్యలకు వివిధ రకాల వైరస్​లు వ్యాధి సోకడంతో అవి చనిపోతున్నాయి. దీంతోపాటు పెరుగుతున్న ధరల కారణంగా వందలాది ఎకరాల్లో రొయ్యల సాగును ఆక్వారైతులు నిలిపి వేస్తున్నారు. జిల్లాలో ఆక్వా సాగు చేసే వేలాది ఎకరాలు చెరువులు ఖాళీగా దర్శనం ఇవ్వడంతో ఆక్వా సాగు ప్రశ్నార్థకంగా మారింది.

aqua farmers facing various problems
ఆక్వా రైతులకు తీరని నష్టాలు

ఆక్వా రైతులకు తీరని నష్టాలు

AQUA FARMING: ఆక్వా రంగంలో వచ్చే ఒడిదొడుకులు తట్టుకోలేక సాగుదారులు వందల ఎకరాలను ఖాళీగా వదిలేస్తున్నారు. రొయ్యలకు వివిధ వ్యాధులు సోకి తెగుళ్లు రావటంతో పాటు పెరిగిన మేతలు, మందులు, లీజుల రేట్లతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఇన్ని అవస్థలు పడుతూ రొయ్యలను సాగు చేసినా.. ధర గిట్టుబాటు కావడం లేదని వ్యాపారం తగ్గించేస్తున్నారు. గతంలో మన రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి విదేశాలకు వెళ్లి తిరిగి వచ్చిన యువకులు స్వగ్రామంలో పొలాలను లీజుకు తీసుకుని ఆక్వా సాగు చేసేవారు. కానీ ప్రస్తుతం అనేక కారణాల వల్ల ఇంతకుముందు ఆక్వా రంగంపైన ఉన్న మక్కువ ఇప్పుడు ఆక్వా రైతుల్లో కనిపించటం లేదు.

ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలోని సంతబొమ్మాలి, ఇచ్చాపురం, కవిటి, సోంపేట, గార, వజ్రపు కొత్తూరు, పోలాకి గ్రామాల్లో దాదాపు 6 వేల ఎకరాల్లో ఆక్వా సాగవుతోంది. సుమారు 3 వేల మంది సాగుదారులు, 20వేల మంది కార్మికులు, పరోక్షంగా మరో 15 వేల మంది ఈ రంగంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. అయితే ఆక్వారంగంలో వచ్చే ఇబ్బందుల వల్ల ఆక్వా రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

మరోవైపు నాసిరకం సీడ్ కారణంగా చెరువుల్లో రొయ్య పిల్లలను వదిలిన నెల రోజులకే సమస్యలు ఎదురవుతున్నాయని ఆక్వా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఆధ్వారంగంపై దృష్టి సారించకపోతే భవిష్యత్తులో జిల్లాలో ఆక్వా రైతు కనబడే పరిస్థితి లేదని వాపోతున్నారు. పెరిగిన విద్యుత్ ఛార్జీలు, డీజిల్, రొయ్య మేత ధరలు వంటి వాటి వల్ల నష్టాలు పాలవుతున్నామంటూ రైతులు ఆక్వారంగాన్నే వదిలేస్తున్నారు. దీంతో ఇదే రంగంపై ఆధారపడిన వేలాదిమంది కూలీలు అరకొర పనులతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఇతర ప్రాంతాలకు వలస పోతున్నారు.

"నాకు ఆక్వారంగం మీద ఉన్న ఆసక్తితో ఈ రంగంలోకి వచ్చాను. అయితే రొయ్యలకు కొన్ని రకాల వైరస్​లు సోకటం వల్ల మేము నష్టపోతున్నాము. దీంతోపాటు ఆక్వా రంగంలో ఫీడ్, మెడిసెన్ రేట్లు పెరిపోవటం వల్ల ఆక్వా రైతులం ఇబ్బంది పడుతున్నాము. ఇన్ని సమస్యలను దాటుకుని రొయ్యల సాగు చేసినా వ్యాపారులు రేట్లు తగ్గించటంతో పెట్టుబడులకు తగిన ఆదాయం రావట్లేదు. ప్రభుత్వం ఈ ఆక్వారంగాన్ని ఆదుకుని డీజిల్, మెడిసెన్, ఫీడ్ రేట్లను తగ్గించి, సబ్సిడీ కల్పించాలి... లేకుంటే భవిష్యత్తులో ఆక్వారంగం కనుమరుగైపోవచ్చు" - రాజు, ఆక్వా రైతు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.