ETV Bharat / state

Possession of Temple Land కోట్లు విలువచేసే ఆలయ భూమిపై వైసీపీ నేత కన్ను.. అధికారులే సహకరిస్తున్నట్లు ఆరోపణలు

author img

By

Published : May 31, 2023, 7:48 AM IST

Updated : May 31, 2023, 12:32 PM IST

Possession of Temple Land: శ్రీ సత్యసాయి జిల్లాలో దేవుడి మాన్యాలపై అధికారపార్టీ నేతల కన్నుపడింది. పెనుకొండ నియోజకవర్గంలో ఇప్పటికే పెద్ద ఎత్తున భూకబ్జాలకు పాల్పడుతున్న ఓ ప్రజాప్రతినిధి సోదరుడు.. ఆలయ దూపధీప నైవేద్యం కోసం దానమిచ్చిన భూమిని హస్తగతం చేసుకునేందుకు పావులు కదుపుతున్నారు. ఈ అక్రమణలను అడ్డుకునేందుకు యత్నించిన వారిపైనే పోలీసులు బెదిరింపులకు పాల్పడున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.

ysrcp leaders temple land kabza
దేవాలయ భూమిపై వైసీపీ నేత కన్ను

Possession of Temple Land: శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం బూదిలిలో అత్యంత పురాతనమైన కోటిలింగేశ్వర ఆలయం ఉంది. ఇక్కడి లింగాయత్ సామాజిక వర్గానికి కోటిలింగేశ్వరుడు ఆరాధ్య దైవం. ఈ పురాతన ఆలయాన్ని దశాబ్దాల క్రితమే పునర్నిర్మాణం చేశారు. 1943లో స్వామి భక్తురాలైన బసవమ్మ.. 4.83 ఎకరాలను రంగప్ప అనే వ్యక్తి నుంచి కొనుగోలు చేసింది. సంతానం లేకపోవడంతో 1950 జనవరి 20న ఆ భూమిని ఆలయానికి దానం చేసి పకడ్బందీగా వీలునామా రాయించింది.

దాదాపు 73 ఏళ్లుగా ఈ భూమిని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో రైతులు కౌలుకు సాగుచేస్తున్నారు. వచ్చిన సొమ్ముతో కమిటీ ఆలయ కైంకర్యాలు జరుపుతోంది. ఇప్పుడు ఈ భూమిపై పెనుకొండకు చెందిన వైసీపీ ప్రజాప్రతినిధి సోదరుడు కన్నుపడిందని.. ఆక్రమించేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాడని.. కమిటీ సభ్యులు ఆరోపిస్తున్నారు. అందుకోసం నిత్యం బెదిరింపులకు పాల్పడుతున్నట్లు తెలిపారు.

ఆలయ భూమిని చేజిక్కించుకునేందుకు వైసీపీ నేత ఏడాది క్రితమే తమను పెనుకొండ అతిథి గృహానికి పిలిచి బెదిరించాడని.. కమిటీ సభ్యులు ఆరోపించారు. ఆ భూమి తమవారు కొనుగోలు చేశారని.. మీరు వదులుకోవాలని హెచ్చరించినట్లు తెలిపారు. గోరంట్ల మండల రెవెన్యూ అధికారులను అక్కడకు పిలిపించి భూమి ఆలయానిది కాదని చెప్పించే ప్రయత్నం చేశాడని వివరించారు. భూమికి సంబంధించిన అన్ని రికార్డులు వైసీపీ నేతకు, రెవెన్యూ సిబ్బందికి చూపించగా.. అన్నీ పక్కాగా ఉండటంతో మారుమాట్లాడకుండా పంపించేశారని తెలిపారు.

భూమి ఒకేసారి కబ్జా చేస్తే ఇబ్బంది తలెత్తుతోందని భావించిన సదరు నేత.. రికార్డుల్లో వాస్తవ భూమి కన్నా 8 ఎకరాలు ఎక్కువగా నమోదు చేయించాడని.. ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. వాస్తవంగా 532 సర్వే నెంబర్ లో 19.36 ఎకరాలు ఉండగా.. దాన్ని 28 ఎకరాలుగా మార్చారని వివరించారు. ఇప్పుడు ఆ మిగిలిన భూమి తాము కొనుగోలు చేశామంటూ ఓ అగ్రిమెంట్ సిద్ధం చేసి.. ఆలయ భూమి ఆక్రమణకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

భూమిలో రాతి స్తంభాలు నాటి, కంచె వేసే ప్రయత్నం చేయటంతో ఆలయ కమిటీతో పాటు లింగాయత్ కుటుంబాలు తీవ్రంగా ప్రతిఘటించాయి. దాదాపు కోటిన్నర విలువైన భూమిని దక్కించుకునేందుకు.. వైసీపీ నేత విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు వారు మండిపడ్డారు. పోలీసులు న్యాయం చేయకపోగా.. తమనే స్టేషన్‌కు పిలిపించి బెదిరిస్తున్నారని ఆరోపించారు. దీనిపై రెవెన్యూ అధికారులూ పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఆలయ భూమిని కాపాడుకునేందుకు ఎంతవరకైనా పోరాటం చేస్తామని ఆలయ కమిటీ సభ్యులతో పాటు గ్రామస్థులు తేల్చి చెప్పారు.

"వైసీపీ కన్వినర్​ ఇదంతా చేస్తున్నారు. ఈ ఆస్తి వారిదే అని మాతో వాదిస్తున్నారు. ఇది దేవస్థానం ఆస్తి. దీన్ని ఎవరి చేతికీ చిక్కకుండా చూసుకుంటాము. ఆలయ భూమిని కాపాడేందుకు ఎంతవరకైనా పోరాడతాం." - సదాశివప్రసాద్, బూదిలి గ్రామస్థుడు

దేవాలయ భూమిపై వైసీపీ నేత కన్ను

ఇవీ చదవండి:

Last Updated : May 31, 2023, 12:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.