ETV Bharat / state

Accidents: సత్యసాయి జిల్లాలో రోడ్డు ప్రమాదం.. 12మందికి గాయాలు.. మరోవైపు స్కూల్ బస్సు బోల్తా..

author img

By

Published : Jun 14, 2023, 10:02 AM IST

Updated : Jun 14, 2023, 12:14 PM IST

Accidents and Crimes
యాక్సిడెంట్స్ అండ్ క్రైమ్స్

Accidents and Crimes: సత్యసాయి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 12మంది గాయాలపాలయ్యారు. మరోవైపు.. గుంటూరు జిల్లాలో ఓ వ్యక్తి మృతదేహం కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే..

Accidents and Crimes: శ్రీ సత్య సాయి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. సోమందేపల్లి మండల కేంద్రం సమీపంలో 44వ రహదారిపై మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత శ్రీశైలం నుంచి బెంగళూరుకు వెళుతున్న కర్ణాటక ఆర్టీసీ రాజహంస బస్సు డివైడర్​ను ఢీకొంది. ఈ ప్రమాదంలో పదిమంది ప్రయాణికులకు, ఇద్దరు డ్రైవర్లకు గాయాలయ్యాయి. వారిలో తొమ్మిదిమంది స్వల్ప గాయాలతో బయటపడగా.. మరో ముగ్గురు తీవ్ర గాయాలపాలయ్యారు. ప్రమాద సమయంలో బస్సులో 28 మంది ప్రయాణికులు ఉన్నారు.

క్షతగాత్రులను 108 అంబులెన్సులో పెనుగొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కొందరిని హిందూపురం, మరికొంతమందిని బెంగళూరు వైద్యశాలలకు తరలించారు. కాగా.. హిందూపురం వైద్యశాలలో కనీసం తాగునీరు అందుబాటులో లేకపోవడంతో క్షతగాత్రులు తీవ్ర ఇబ్బందికి గురయ్యారు. అర్ధరాత్రి సమయంలో నీళ్లు దొరక్క ప్రయాణికులు అవస్థలు పడ్డారు.

శ్రీకాకుళం జిల్లాలో స్కూల్ బస్సు బోల్తా..

మరోవైపు.. శ్రీకాకుళం జిల్లాలోని సరుబుజ్జిలి మండలం పురుషోత్తపురం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. పురుషోత్తపురం వద్ద అవధానచెరువులో ఓ ప్రైవేటు పాఠశాల బస్సు బోల్తా పడింది. పురుషోత్తపురం నుంచి రొట్టవలసలోని పాఠశాలకు వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 15 మంది విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.

గుంటూరు జిల్లాలో వ్యక్తి హత్య..

గుంటూరు జిల్లా మేడి కొండూరు మండలం పేరేచర్లలో వ్యక్తి మృత దేహం కలకలం రేపింది. మేడికొండూరు సీఐ తెలిపిన మేరకు.. పేరేచర్ల శివారు జగనన్న కాలనీలో మంగళవారం వ్యక్తి మృత దేహం ఉందని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే మేడికొండూరు సీఐ వాసు తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కాగా మృతి చెందిన వ్యక్తి పల్నాడు జిల్లా సత్తెనపల్లికి చెందిన మంద సైదేశ్వరరావు(33)గా పోలీసులు గుర్తించారు.

అతడు ఆటో నడుపుకొని జీవనం సాగిస్తున్నాడు. రోజు మాదిరిగానే మంగళవారం ఉదయం తన ఆటో తీసుకొని జగనన్న కాలనీకు బాడుగ నిమిత్తం వెళ్లగా.. 10 గంటల తర్వాత నుంచి అతని మొబైల్ స్విచ్ఛాఫ్​లో ఉందని మృతుడి భార్య తెలిపినట్లు పోలీసులు పేర్కొన్నారు. కాగా గుర్తుతెలియని దుండగులు అతడి తలపై బలమైన వస్తువుతో కొట్టి.. గొంతు కోసి వెళ్లిపోయినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు సీఐ తెలిపారు. ఘటనా స్థలంలో వేలిముద్ర నిపుణులు, జాగిలాలతో.. అధికారులు ప్రత్యేక గాలింపు చర్యలు చేపట్టారు.

కడపలో అగ్ని ప్రమాదం.. రూ.3 లక్షల ఆస్తి నష్టం..

కడప శివారులో అగ్నిప్రమాదం జరిగింది. అష్టలక్ష్మి కల్యాణ మండపం సమీపంలో ఉన్న పాత సామగ్రి గోదాంలో జరిగిన ఈ అగ్నిప్రమాదంలో సుమారు రూ.3లక్షల వరకు ఆస్తి నష్టం జరిగింది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో మంటలు విపరీతంగా వ్యాపించాయి. పైగా శివారు ప్రాంతాలు కావడంతో వాటికి గాలి తోడై మంటలు భారీగా వ్యాపించాయి. మహబూబ్ బాషా అనే వ్యక్తి పాత సామగ్రి కొనుగోలు చేసి ఎగుమతి చేసే వ్యాపారం నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో భారీగా పాత సామగ్రిని కొనుగోలు చేసి గోదాంలో నిల్వ ఉంచాడు.

మంగళవారం రెండు నుంచి మూడు గంటల సమయంలో ప్రమాదవశాత్తు గోదాంలో మంటలు చెలరేగాయి. మధ్యాహ్నం కావడంతో అక్కడ సిబ్బంది మొత్తం భోజనానికి వెళ్లారు. దీంతో మంటలు రాజుకుంటూ చుట్టుపక్కలకు వ్యాపించాయి. దట్టమైన పొగలు రోడ్డు మొత్తం చుట్టుకోవడంతో స్థానికులు అప్రమత్తమై అగ్నిమాపక శాఖకు సమాచారాన్ని చేరవేశారు. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు వెళ్లి మంటలను అదుపు చేసింది. ఈ అగ్ని ప్రమాదంలో సుమారు మూడు లక్షల మేరకు ఆస్తి నష్టం వాటిల్లినట్లు అగ్నిమాపక అధికారులు తెలిపారు.

Last Updated :Jun 14, 2023, 12:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.