ETV Bharat / state

Ex Minister: 'ఇక నుంచి రాజకీయాల్లో చురుగ్గా ఉంటా'.. సత్యసాయి జిల్లాలో రాజకీయ సమావేశం..

author img

By

Published : Apr 19, 2023, 9:26 AM IST

ex minister active in congress
సత్యసాయి జిల్లాలో రాజకీయ సమావేశం

Ex Minister Active in Congress: పార్టీ నేతలందరి ఏకాభిప్రాయం మేరకు ఇక నుంచి రాజకీయాల్లో చురుగ్గా ఉంటానని మాజీ మంత్రి రఘువీరారెడ్డి అన్నారు. శ్రీ సత్య సాయి జిల్లా మడకశిర పట్టణంలో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు. వివరాల్లోకి వెళ్తే..

Ex Minister Active in Congress: శ్రీ సత్య సాయి జిల్లా మడకశిర పట్టణంలో మాజీ మంత్రి రఘువీరారెడ్డి కార్యకర్తలతో కాంగ్రెస్ రాజకీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానికులతో పాటు జిల్లాలోని ఇతర నియోజక వర్గాలకు చెందిన పలు నాయకులు పాల్గొన్నారు. రఘువీరా రెడ్డి రాజకీయ మౌనం వీడి తిరిగి రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనాలని సభలో ప్రతీ నాయకుడు ఉద్ఘాటించాడు. కార్యకర్తల మధ్యలో కూర్చొని వారి మాటలు విని ఆఖరిగా రఘువీరా ప్రసంగించారు.

సమావేశంలో రఘువీరా మాట్లాడుతూ.. నా స్వగ్రామంలో దేవాలయాల నిర్మాణం కోసం సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అనుమతితో రాజకీయ సెలవు ప్రకటించానని అన్నారు. నాలుగు సంవత్సరాలుగా ఈ ప్రయాణం సాగిందని చెప్పారు. నాలుగు సంవత్సరాల కాలంలో పేపరు, టీవీ కూడా చూడలేదని ఆయన తెలిపారు. రాజకీయాల నుంచి రిటైర్డ్ అవ్వాలని నిర్ణయించుకున్నానని, అదే విషయం చాలామందితో చెప్పానని వెల్లడించారు.

అయితే కొన్ని రోజుల క్రితం మోదీ పేరు ఎత్తకుండా దేశంలో పెద్ద పెద్ద దొంగలకు ఆ పేర్లు ఉన్నాయని రాహుల్ ఒక్క మాట అన్నందుకు ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష వేశారని, 24 గంటల్లోపే పార్లమెంటు సభ్యత్వం రద్దుచేసి.. వెంటనే ఇల్లు కూడా ఖాళీ చేయించడం తన మనసును చాలా కలిచి వేసిందని రఘువీరా పేర్కొన్నారు. కాగా ఇలాంటి పరిస్థితుల్లో తాను రాజకీయాలకు విశ్రాంతి ఇవ్వటం భావ్యమా? అని పునరాలోచించి ఇలా అందరి ముందుకు వచ్చానని తెలిపారు.

పార్టీ నేతలందరి ఏకాభిప్రాయం మేరకు ఇకనుంచి రాజకీయాల్లో చురుగ్గా ఉంటానని రఘువీరా అన్నారు. రాహుల్ గాంధీని అవమాన పరచడం వల్లే కర్ణాటకలో ప్రజలు.. అధికారాన్ని కాంగ్రెస్​కు పట్టం కట్టారని అర్థమయ్యేలా ఎన్నికల ప్రచారంలో పాల్గొందామని పార్టీ నాయకులతో చెప్పారు. ఇన్ని రోజులు ఆయన చెప్పినట్లు వారు నడిచారని, భవిష్యత్తులో వారు మార్గం నిర్దేశించి ఏ నిర్ణయం తీసుకుంటే అందుకు తాను సిద్ధంగా ఉంటానని సమావేశంలో భాగంగా పార్టీ నాయకులతో రఘువీరా పేర్కొన్నారు.

"నా స్వగ్రామంలో దేవాలయాల నిర్మాణం కోసం సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అనుమతితో రాజకీయ సెలవు ప్రకటించాను. నాలుగు సంవత్సరాలుగా నేను పేపరు, టీవీ చూడలేదు. రాజకీయాల నుంచి నేను రిటైర్డ్ అవ్వాలని నిర్ణయించుకున్నాను, అదే విషయం చాలామందితో చెప్పాను. అయితే కొన్ని రోజుల క్రితం మోదీ పేరు ఎత్తకుండా దేశంలో బడా దొంగలకు ఆ పేర్లు ఉన్నాయని రాహుల్ ఒక్క మాట అన్నందుకు ఆయనకు రెండు సంవత్సరాల జైలు శిక్ష, 24 గంటల్లోపే పార్లమెంటు సభ్యత్వం రద్దుచేసి.. వెంటనే ఇల్లు ఖాళీ చేయించడం వంటి అంశాలు నా మనసును కలిచి వేశాయి. ఇలాంటి పరిస్థితుల్లో నేను రాజకీయాలకు విశ్రాంతి ఇవ్వటం భావ్యమా అని పునరాలోచించి మీ ముందుకు వచ్చాను. రాహుల్ గాంధీని అవమాన పరచడం వల్లే కర్ణాటకలో ప్రజలు అధికారం కాంగ్రెస్​ పార్టీకి పట్టం కట్టారని అర్థమయ్యేలా ఎన్నికల ప్రచారంలో పాల్గొందాం." - రఘువీరారెడ్డి, మాజీ మంత్రి

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.