ETV Bharat / state

వెలిగొండ పరిహారంపై నిర్వాసితుల అసంతృప్తి

author img

By

Published : Jun 17, 2020, 2:35 PM IST

ప్రజా ప్రయోజనమే పరమావధిగా కమ్యూనిస్టు నాయకుడు పూల సుబ్బయ్య చేసిన అలుపెరగని పోరాటం... దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు దూరదృష్టి... మాజీ సీఎం చంద్రబాబునాయుడి సంకల్పం... దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కార్యాచరణ... వెరసి వెలిగొండ ప్రాజెక్టు ప్రకాశం జిల్లా ఆశల సౌధంగా మారింది. దీంతో దీని నిర్మాణం ఎప్పుడు పూర్తవుతుందా... వెలిగొండల్లో నల్లమల సాగర్‌ ఎప్పుడు జలకళను సంతరించుకుంటుందా అని పాతికేళ్లుగా ఎదురుచూస్తున్నారు. మంగళవారం నాటి రాష్ట్ర బడ్జెట్లో మొదటి సొరంగం పనులు ఈ ఏడాది పూర్తి చేస్తామని పేర్కొన్నప్పటికీ ప్రాజక్టు కోసం ఇళ్లు, పొలాలను వదులుకున్న ముంపు ప్రాంతవాసులు మాత్రం పరిహారం విషయంలో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.

veligonda project rehabilitates problems
వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితుల కష్టాలు

నల్లమల అడవుల్లోని వెలిగొండల మధ్యన 43.5 టీఎంసీల నిల్వ లక్ష్యంగా ప్రాజెక్టు నిర్మాణానికి పునాది పడింది. కర్నూలు జిల్లా శ్రీశైలంలోని కొల్లంవాగు నుంచి పెద్దదోర్నాలలోని కొత్తూరు వరకు 18.8 కిలోమీటర్ల పొడవున నిర్మిస్తున్న రెండు సొరంగ మార్గాల ద్వారా నల్లమల సాగర్‌కు కృష్ణా నది నీటిని తరలిస్తారు. ఆ నీరు నిల్వ ఉండేలా మార్కాపురం మండలం గొట్టిపడియ, పెద్దారవీడు మండలం సుంకేసుల, అర్ధవీడు మండలం కాకర్ల ఆనకట్టలు నిర్మించగా మొదటి సొరంగం ఇంకా దాదాపు 800 మీటర్లు, రెండోది 7.8 కి.మీ. మేర తవ్వాల్సివుంది. మొత్తం 7,555 మంది పరిహారం పొందేందుకు అర్హులని ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. అందుకుగాను రూ.1,301 కోట్లు కేటాయించి వన్‌టైం సెటిల్‌మెంట్‌ కింద ఒక్కో కుటుంబానికి రూ.12.50 లక్షలు ఇచ్చేందుకు నిర్ణయించగా ఆ మొత్తాన్ని పెంచాలని కోరుతూ నిర్వాసితుల సంఘం నాయకులు మార్కాపురం ఆర్డీవో కార్యాలయంలో వినతిపత్రం ఇచ్చారు. కలెక్టర్‌ను కలిసి తర్వాత చలో అమరావతి కూడా నిర్వహిస్తామన్నారు.

వన్‌ టైం సెటిల్‌మెంట్‌ రూ.20 లక్షలు ఉండాలి

తాతముత్తాల నుంచి ఇక్కడే ఉంటున్నాం. మాలో ఒక 10 శాతం మంది మాత్రమే ఆర్థిక ఇబ్బందుల్లేేని వాళ్లు ఉన్నారు. మిగిలిన 90 శాతం మంది ఉన్న పొలంలో బోర్లు వేసి సాగు చేయడం, కరవు, ఇతర కారణాలతో అప్పుల పాలయ్యాం. వెలిగొండ ప్యాకేజీపైనే ఆశలు పెట్టుకుని బతుకీడుస్తున్నాం. గత తెదేపా ప్రభుత్వ హయాంలో వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ కింద రూ.12.50 లక్షల పరిహారానికి అధికారులు ప్రతిపాదనలు పంపారు. ఆ సమయంలో జిల్లా వైకాపా నాయకులు తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రూ.24 లక్షల వరకు ఇస్తామని నమ్మబలికారు. మొదటి సొరంగం పనులు పూర్తయ్యాయని, త్వరలో నీళ్లు అందిస్తామని, దానికంటే నిర్వాసితుల సమస్యలను తీరుస్తామన్న ప్రభుత్వ ప్రకటనతో సంతోషపడ్డాం. కానీ ఇస్తామన్న వన్‌టైమ్‌ ప్యాకేజీ రూ.12.50 లక్షలుగా ఉండడం చూసి ఆవేదన చెందుతున్నాం. ఆ మొత్తం బోర్లు, ఏళ్లుగా జీవనం కోసం చేసిన అప్పులకు సరిపోవు. పైగా ఉన్న ఊరు, పొలాల్ని వదిలి పునరావాస ప్రాంతాలకు వెళ్లాలన్నా ఇక్కడ వచ్చే ప్యాకేజీ అప్పులు, ఇంటి నిర్మాణానికే సరిపోతుంది. చేయడానికి పనులు లేక, అక్కడ ఉండలేక పక్కనే ఉన్న రైలు పట్టాలపై తల పెట్టాల్సిన పరిస్థితులు వస్తాయి. ఈ విధంగా చేస్తే మా త్యాగాలకు విలువుండదు. మా సమస్య పరిష్కరించకుండా సొరంగం పనులు పూర్తయినా ప్రయోజనం ఉండదు. ఇప్పటి వరకు నాయకుల మాటలు విని మోసపోయాం. వన్‌టైం సెటిల్‌మెంట్‌ కింద రూ.20 లక్షలు ఇవ్వాలి. తమ పిల్లల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని తమకో దారి చూపాలి. - సుంకేసుల, కలనూతల నిర్వాసితులు

ఇదీ చదవండి: చెట్టుకు ఉరేసుకుని ప్రేమజంట బలవన్మరణం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.