ETV Bharat / state

అనుమతించినా తెరుచుకోలేని దుస్థితిలో పరిశ్రమలు

author img

By

Published : May 16, 2020, 9:05 PM IST

కరోనా మహమ్మారి అన్ని రంగాలను అతలాకుతులం చేసింది. కార్మికులకు అన్నంపెట్టే పరిశ్రమలు... ఆ పరిశ్రమల ద్వారా ఉపాధి పొందే పారిశ్రామిక వేత్తలకు కూడా వెతలు తప్పడంలేదు. అప్పోసప్పో చేసి పరిశ్రమ పెట్టి నెమ్మది నెమ్మదిగా కుదుటుపడదామనుకున్న ఔత్సాహికులు దిక్కుతోచని స్థితిలోపడ్డారు. పరిశ్రమలు నడిస్తే ఆర్థిక లావాదేవీలకు కొంత ఊరట లభిస్తుందని ప్రభుత్వం కొన్ని సడలింపులిచ్చినా.. వాటిని నడిపేందుకు కార్మికులు లేని పరిస్థితి నెలకొంది.

small industries facing problem due to lockdown
పరిశ్రమల కష్టాలు

సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల వల్ల ఎంతో మంది ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు జీవనం సాగిస్తున్నారు. వారివద్ద పనిచేసే కార్మికులకు ఉపాధినిస్తున్నారు. ఆర్థిక లావాదేవీలకు వీరు నడిపే యంత్రాలు ఎంతో సహకారాన్ని అందిస్తున్నాయి. బ్యాంకులు, ప్రయివేట్ వ్యాపారుల నుంచి అప్పులు తీసుకొని ఏర్పాటు చేసిన పరిశ్రమలు కరోనా దెబ్బకు మూతపడ్డాయి. లాక్‌ డౌన్‌ కారణంగా పనిచేయకూడదన్న నిబంధనతో ఇప్పటివరకు మూతపడ్డ పరిశ్రమలకు.. ఇప్పుడు ఇచ్చిన సడలింపులు కూడా ఊరటనివ్వలేకపోతున్నాయి.

ప్రకాశం జిల్లా మద్దపాడు గ్రోత్‌ సెంటర్‌లో దాదాపు 300 సూక్ష్మ, మధ్య, చిన్న తరహా పరిశ్రమలు ఉన్నాయి. కోటి, కోటిన్నర పెట్టుబడులతో పదిమందికి ఉపాధినిచ్చే ప్లాస్టిక్‌ పైపులు, ఫొటో ఫ్రేమ్స్‌, వస్త్రాలు, చెక్కపెట్టెలు, ఇటుకలు, గ్రానైట్‌ పలకలు, గ్రానైట్‌ చిప్స్‌... ఇలా రకరకాల పరిశ్రమలు నెలకొన్నాయి. ఉత్పత్తుల ఎగుమతులు, ముడిసరకు దిగుమతులతో ట్రాన్స్‌పోర్టు రంగం, చిన్నచిన్న ప్యాకింగ్‌ యూనిట్లు, దాబాలు, హోటళ్ళు, మెకానిక్‌ షాపులు వంటివి అనుబంధంగా ఏర్పడ్డాయి. లాక్‌ డౌన్‌ కారణంగా ఈ పరిశ్రమలు మూసివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కార్మికులకు భోజన, వసతి కల్పించి జీతాలిచ్చి ఖాళీగా కూర్చోపెట్టాల్సిన దుస్థితి ఏర్పడింది. దీంతో వీరు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు.

కార్మికులెక్కడ..?

ఆర్థికంగా ప్రభుత్వానికి నష్టం వస్తుందనే ఉద్దేశంతో ఈనెల ప్రారంభంలో పరిశ్రమలకు కొన్ని సడలింపులిచ్చారు. పరిశ్రమలు నిర్వహించుకోవచ్చని చెప్పారు. అదే సమయంలో వలస కార్మికులు వారి స్వరాష్ట్రాలకు వెళ్ళవచ్చని చెప్పటంతో పరిస్థితి తారుమారయ్యింది. గ్రోత్ సెంటర్​లో పనిచేసే కార్మికులు దాదాపు ఇతర రాష్ట్రాలకు చెందినవారే. ఇందులో బిహార్‌, ఒడిశా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలకు చెందిన వారు అధిక సంఖ్యలో ఉన్నారు. 2 నెలలుగా పనుల్లేకపోవడం, మళ్ళీ పంపించే అవకాశం ఉంటుందో లేదోనని వీరంతా స్వరాష్ట్రాలకు బయలుదేరారు. కొందరు కాలినడకన, మరికొంతమంది ప్రభుత్వం ఏర్పాటు చేసిన శ్రామిక రైళ్ల ద్వారా పయనమయ్యారు.

దీంతో పరిశ్రమల్లో పనిచేయడానికి కార్మికులు లేని దుస్థితి ఏర్పడింది. ఈ కారణంగా అనుమతులున్నా పరిశ్రమలు నిర్వహించలేకపోతున్నామని యజమానులు అంటున్నారు. మొత్తం మీద గ్రోత్‌ సెంటర్‌లో ఉన్న 300 పరిశ్రమల్లో ఒకటో అరో తప్పా, ఏవీ తెరుచుకోలేదు. మరోవైపు ఉత్పత్తి అయిన వస్తువులకు మార్కెట్‌ లేకపోవడం వల్ల నిల్వలు పేరుకుపోయాయి. వస్తువుల తయారీకి అవసరమైన ముడి సరకు దిల్లీ, ముంబయి వంటి ప్రాంతాలనుంచి దిగుమతి చేసుకోవలసి ఉంటుంది. ఆ ప్రాంతాలు రెడ్ జోన్లుగా ఉండటం, రవాణా సౌకర్యాలు లేకపోవడం వల్ల ముడి సరకు దిగుమతి అవ్వట్లేదు.

తడిసి మోపెడయిన విద్యుత్ బిల్లులు...

2 నెలలుగా మూతపడ్డ పరిశ్రమలకు విద్యుత్తు బిల్లులు తడిసి మోపెడయ్యాయి. స్థిర ఛార్జీలు రద్దు చేస్తామని ప్రభుత్వం ప్రకటించినా తాజాగా వచ్చిన బిల్లుల్లో ఈ ఛార్జీలు కూడా కలిపి చూపించారు. ఒక కేవీకి 475 రూపాయలు చొప్పున స్థిర ఛార్జీలు ఉంటాయి. ఎంత వినయోగించినా ఈ బిల్లు తప్పనిసరి. ఒక్కో పరిశ్రమ సామర్థ్యం బట్టి 60 నుంచి 100 కేవీ వరకూ విద్యుత్తు సరఫరా తీసుకుంటుంది.. ఇందులో వినియోగించిన యూనిట్‌ ఛార్జీలతోపాటు 80 శాతం స్థిర ఛార్జీలు వసూలు చేస్తారు. పరిశ్రమ పనిచేసినప్పుడు ఈ స్థిర చార్జీలతో కలిపి బిల్లు చెల్లిస్తారు.

అంటే ఒక్కో పరిశ్రమకు 10 వేల నుంచి 70వేల వరకూ ప్రతి నెలా బిల్లు వస్తుంది. లాక్‌ డౌన్‌ కారణంగా విద్యుత్తు వినియోగించకపోయినా స్థిరచార్జీలు కలిపి బిల్లింగు చేయడం వల్ల భారీ మొత్తంలో విద్యుత్తు బిల్లులు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఎమ్.ఎస్.ఎమ్.ఐ ప్యాకేజీపై పారిశ్రామిక వర్గాల్లో సానుకూల స్పందన ఏర్పడినప్పటికీ.. ఉన్న పరిశ్రమల విస్తరణ, బ్యాంకుల వడ్డీ రద్దు వంటి విషయాల్లో తమకు సహకారంగా ఉంటే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

లాక్‌ డౌన్‌ కొనసాగిస్తుండటం వలస కార్మికులు వారివారి స్వరాష్ట్రాలకు వెళ్ళిపోతుండటం వల్ల ఇప్పట్లో పరిశ్రమలు తెరుచుకునే పరిస్థితి కనిపించడంలేదు.

ఇవీ చదవండి.. 'పరిపాలనా భవనంలో లడ్డు విక్రయాలు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.