ప్రకాశం జిల్లాలో రహదారుల నిర్మాణాలు జరగకపోవడం వల్ల ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు. కొన్నిచోట్ల రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరైనా.. గుత్తేదారులు ముందుకు రాక పనులు ప్రారంభం కాలేదు. మరికొన్ని చోట్ల దాదాపు 10 నెలల క్రితం మొదలుపెట్టిన గ్రామీణ రహదారుల పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. సింగరాయకొండ నుంచి చుట్టుపక్కల పల్లెలకు వెళ్లే రహదారులతో పాటు నాగులప్పలపాడు మండలం చదలవాడ నుంచి అమ్మనబ్రోలు వరకు రహదారి పనులు ప్రారంభించి... కంకర రాళ్లు పేర్చి వదిలేశారు. ఆ మార్గాల్లో ప్రయాణించే వారు నరకయాతన అనుభవిస్తున్నారు.
గుత్తేదారులకు బిల్లులు చెల్లించకపోవటం వల్ల నిర్మాణాలు మధ్యలోనే నిలిచిపోతున్నాయనే విమర్శలూ ఉన్నాయి. సగం పనులు చేసి వదిలేసిన రహదారుల నిర్మాణం తిరిగి మొదటి నుంచి ప్రారంభించాల్సి వస్తోంది. మధ్యలో పనులు ఆపేసిన రహదారులపై రాళ్లు తేలి, గోతులు ఏర్పడి ప్రమాదాలకు నిలయంగా మారాయి. రోడ్ల మధ్యలో ఉన్న కల్వర్టులు కూడా కూలిపోయే స్థితికి చేరుతున్నాయని.. వాటి నిర్మాణాలు కూడా చేపట్టాలని ప్రయాణికులు కోరుతున్నారు. అధికారులు దృష్టి సారించి రహదారుల నిర్మాణం పూర్తిచేయాలని ప్రజలు కోరుతున్నారు.
ఇదీ చదవండి: AUTO ACCIDENT : ఆటో బోల్తా... 10 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలు