ETV Bharat / state

అధికారపక్షమైనా, ప్రతిపక్షమైనా నాది ప్రజాపక్షమే: కోటంరెడ్డి

author img

By

Published : Feb 21, 2023, 7:24 PM IST

YSRCP REBEL MLA KOTAMREDDY : గ్రామీణ ప్రాంతంలో రోడ్లు, కాలువలు, కల్వర్టులు సరిగా లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వైసీపీ రెబల్​ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్​రెడ్డి తెలిపారు. ఈనెల 25న ప్రజల సమస్యలపై నిరసన చేపట్టనున్నట్లు ప్రకటించారు.

YSRCP REBAL MLA KOTAMREDDY
YSRCP REBAL MLA KOTAMREDDY

YSRCP REBEL MLA KOTAMREDDY : నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రజా సమస్యలపై ఈ నెల 25న నిరసన కార్యక్రమం చేపడుతున్నట్లు వైఎస్సార్సీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్​ రెడ్డి ప్రకటించారు. గ్రామీణ ప్రాంతంలో రోడ్లు, కాలువలు, కల్వర్టులు సక్రమంగా లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన మీడియా సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా తాను ప్రజాపక్షానే నిలబడుతానన్నారు. దెబ్బతిన్న రోడ్లు, పొట్టేపాలెం, ములుముడి కలుజులపై కల్వర్టులు, కొమ్మరపుడి లిఫ్ట్ ఇరిగేషన్, బీసీ భవన్, అంబేడ్కర్ భవన్​లను నిర్మించాలని అధికారులకు ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా స్పందన లేదని మండిపడ్డారు.

ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకే నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు కోటంరెడ్డి తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎలక్షన్​ కోడ్ కారణంగా తన కార్యాలయ ఆవరణంలోనే ఈ నిరసన చేపడుతున్నట్లు స్పష్టం చేశారు. సింహపురి గ్రామ దేవత ఇరుకళల పరమేశ్వరి అమ్మవారి జాతరకు ప్రభుత్వం ఇప్పటి వరకు అనుమతి ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. వచ్చే నెల 26, 27, 28 తేదీల్లో జాతర నిర్వహించాల్సి ఉన్నందున ఈ నెల 25లోగా అనుమతి ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. తాను అధికార పార్టీని విభేదించక ముందే జాతర నిర్వహిస్తానని ప్రకటించినట్లు చెప్పారు.

"నెల్లూరు గ్రామీణంలో ప్రజా సమస్యలపై ఈనెల 25న ధర్నా. రోడ్లు, కాల్వలు, కల్వర్టుల సమస్యల పరిష్కారం కోసం ధర్నా. అధికారపక్షమైనా, ప్రతిపక్షమైనా ప్రజాపక్షాన నిలబడతా. రోడ్ల మరమ్మతుల కోసం అధికారుల చుట్టూ తిరిగినా పని కాలేదు. కాంట్రాక్టర్‌కు బిల్లు ఇవ్వకపోవడంతో సగంలోనే పనులు నిలిచాయి. ఇరుకళల అమ్మవారి జాతరకు ఇప్పటివరకు అనుమతి ఇవ్వలేదు. సొంత నిధులతో మార్చి 26, 27, 28న జాతర నిర్వహిస్తాం"-కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, వైసీపీ రెబల్​ ఎమ్మెల్యే

నెల రోజుల క్రితం దేవాదాయ శాఖ అధికారులకు లేఖ రాస్తే.. ఎన్నికల కోడ్ కారణంగా అనుమతి ఇవ్వడం లేదని ఇప్పుడు అధికారులు చెప్పడం సరికాదన్నారు. ఎన్నికల కోడ్​కు జాతర నిర్వహణకు ఏమి సంబంధమని ప్రశ్నించారు. తనకు అనుమతి ఇవ్వకపోయినా నెల్లూరు రూరల్ ఇంఛార్జ్, ఎంపీ ఆదాల ప్రభాకర్​ రెడ్డి ద్వారానైనా అమ్మవారి జాతర నిర్వహించాలని కోరారు. ఈ నెల 25లోపు అధికార పక్షం నుంచి జాతరకు సంబంధించి అనుమతులు రాకపోతే.. ఈ నెల 26న ఆలయ పండితులతో చర్చించి తదుపరి నిర్ణయం ప్రకటిస్తానని కోటంరెడ్డి స్పష్టం చేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.