ETV Bharat / state

అభివృద్ధే లేనప్పుడు.. ఆర్థిక వృద్ధి ఎలా సాధ్యం..? : టీడీపీ

author img

By

Published : Apr 5, 2023, 1:55 PM IST

TDP on AP Financial Condition : అధికార వైసీపీ ప్రభుత్వం దగ్గర డబ్బుల్లేవని.. దాని వల్ల రాష్ట్రంలో మౌలిక వసతుల ఏర్పాటును రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోతోందని టీడీపీ మండిపడింది. ప్రభుత్వం బడ్జెట్​లో చూపిన విధంగా వాస్తవ లెక్కలు లేవని ఆరోపించింది. ఇలా అయితే రాష్ట్రం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవలసి ఉంటుందని విమర్శించింది.

Neelayapalem Vijaykumar
నీలాయపాలెం విజయకుమార్‌

Tdp Spokesperson Neelayapalem Vijaykumar : ఆర్థిక సంవత్సరం ప్రారంభం కాగానే దేశంలో మొట్టమొదటి సారి అప్పు చేసిన రాష్ట్రం ఏపీనే అని టీడీపీ విమర్శించింది. రాష్ట్రంలో 16.4 శాతం వృద్ధి అంటూ రాష్ట్ర బడ్జెట్‌లో చూపిస్తూ వైసీపీ ప్రభుత్వం గొప్పలకు పోతోందని.. వాస్తవ పరిస్థితులు అలా కనిపించటం లేదని ఆరోపించింది. వృద్ధిరేటు ఎక్కడా కనిపించకుండా బడ్జెట్‌లో చూపించడం హాస్యాస్పదమని అభిప్రాయపడింది. రాష్ట్ర ఆదాయం పూర్తిగా మద్యం పైనే ఆధారపడి ఉందని తెలిపింది. ఖర్చు పెట్టనిదే వృద్ధి ఎక్కడి నుంచి వచ్చింది అంటూ ప్రశ్నించింది.

మద్యంపై ఆదాయం పెంచుకోవడానికి వైసీపీ ప్రభుత్వం చూస్తోందని టీడీపీ అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయకుమార్‌ విమర్శించారు. నెల్లూరులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గుత్తేదారులకు బిల్లులు ఇవ్వటంలేదని.. బిల్లులు రోజురోజుకు పెరుగుతున్నాయని ఆరోపించారు. అభివృద్ధే లేనప్పుడు రాష్ట్రంలో వృద్ధి ఎలా వచ్చిందో ప్రభుత్వం చెప్పాలని ప్రశ్నించారు. మౌలిక సదుపాయాలు లేక.. స్థిరాస్తి రంగం పడిపోయిందని ఎద్దెవా చేశారు. ఈ ఒక్క ఏడాదిలోనే లక్ష కోట్ల రూపాయలను వైసీపీ ప్రభుత్వం అప్పు తెచ్చిందని విమర్శలు చేశారు.

తెలుగుదేశం హయాంలోనే 54 లక్షల పింఛన్లు ఇచ్చామని విజయకుమార్‌ తెలిపారు. కొత్త సామాజిక పింఛన్లు ఏమైనా ఇస్తున్నారా అని వైసీపీని ప్రశ్నించారు. ఇంతకు ముందెప్పుడూ లేనట్లు కొత్తగా వీళ్లే తెచ్చినట్లు ఊదరగొడుతున్నారని దుయ్యబట్టారు. ఉద్యోగులకు ప్రభుత్వం సమయానికి జీతాలు అందించలేకపోతోందని అన్నారు. అంతే కాకుండా ప్రభుత్వం దగ్గర డబ్బుల్లేవని.. దానివల్ల రోడ్లు, తాగునీటి వసతులు వంటి సౌకర్యాలను రాష్ట్రంలో ప్రభుత్వం అందించలేక పోతోందని విమర్శించారు.

నవరత్నాలంటే రంగురాళ్లే తప్పా.. కొత్తగా తెచ్చినవి కాదన్నారు. పెట్టుబడులు లేవని.. ఏ పెట్టుబడులతో ఆర్థిక రంగంలో వృద్ధి వచ్చిందో జగన్‌ చెప్పాలని ప్రశ్నించారు. అసలు ఖర్చే పెట్టనప్పుడు ఆర్థిక రంగంలో వృద్ధి ఎలా వచ్చిందో జగన్‌ రెడ్డి చెప్పాలని నిలదీశారు. అప్పులు తీసుకోవడానికే జీఎస్‌డీపీని అదనంగా చూపుతున్నారని అన్నారు. ఈ ఏడాదిలోనే సుమారు లక్ష కోట్ల రూపాయలను వైసీపీ ప్రభుత్వం అప్పు చేసిందని పేర్కొన్నారు. జీఎస్‌డీపీని ఎలా లెక్క గట్టారో వివరాలు చెప్పాలని.. జీఎస్‌డీపీ మదింపు, శాంపిల్‌ సైజ్‌ ఎంత, తీసుకున్న ప్రాంతాలేంటో చెబుతారా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.

నీలాయపాలెం విజయకుమార్‌, టీడీపీ అధికార ప్రతినిధి

"ఆర్థిక సంవత్సరం ప్రారంభం కాగానే దేశంలో మొదట అప్పు తీసుకున్నది బుగ్గననే. జీఎస్​డీపీ వృద్ధి వచ్చిందని అంటారు కానీ.. ఇక్కడ మాత్రం ఏమీ కనిపించదు. వచ్చిన ఆదాయంలో మద్యం ఆదాయం తొలగిస్తే.. కేవలం 6 నుంచి 7 శాతం వరకు మాత్రమే." - నీలాయపాలెం విజయకుమార్‌, టీడీపీ అధికార ప్రతినిధి

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.