ETV Bharat / state

'స్వర్ణముఖి బ్యారేజీ ఎత్తు పెంచాలి'

author img

By

Published : Dec 30, 2020, 10:32 PM IST

swarnamukhi barrage
స్వర్ణముఖి బ్యారేజీ

పుష్కర కాలంగా కలగానే మిగిలిన హామీ. 10 వేల ఎకరాల ఆయకట్టుకు భరోసా కల్పించలేని లక్ష్యమది. ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఎందరు పాలకులు వచ్చిన, ఆ సమస్యకు పరిష్కారం లభించడం లేదు. వృథాగా సముద్రానికి వెళుతున్న నీటిని కట్టడి చేసే మార్గం కనిపించడం లేదు. నెల్లూరు జిల్లా వాకాడు వద్ద స్వర్ణముఖి బ్యారేజీ విస్తరణలో జాప్యంపై 'ఈటీవీ భారత్​' కథనం.

నెల్లూరు జిల్లా వరి సాగుకు పెట్టింది పేరు. ఇక్కడ 68 శాతం మంది రైతులు వరిపైనే ఆధారపడ్డారు. పెన్నా, స్వర్ణముఖి, కైవల్య ఇలా అనేక నదులు సాగుకు ఆధారమయ్యాయి. ఇందులో స్వర్ణముఖి నది పాత్ర కీలకంగా చెప్పొచ్చు. చిత్తూరు జిల్లాలోని తిరుపతి, శ్రీకాళహస్తి మీదుగా స్వర్ణముఖి నది వాకాడుకు చేరుతుంది. అక్కడ స్వర్ణముఖి బ్యారేజీ దాటి పామంజి వద్ద సముద్రంలో కలుస్తుంది.

2005లో 50 కోట్ల అంచనా వ్యయంతో ఈ బ్యారేజీ, చెరువులు, కాలువలు ఏర్పాటు చేశారు. 9500 ఎకరాల ఆయకట్టుకు దీని ద్వారా నీరు అందుతోంది. 34గేట్లు ఉన్న ఈ బ్యారేజీ 2008లో జాతికి అంకితమైంది. అప్పట్లోనే గేట్లు మరో ఒకటిన్నర అడుగుల ఎత్తు పెంచాలని రైతులు కోరారు. అయితే ఇప్పటికీ ఆ దిశగా అడుగులు లేవు. -పురుషోత్తం రెడ్డి

స్వర్ణముఖి వరద పోటెత్తిన ప్రతిసారి ఈ బ్యారేజీ వద్ద నీటిని నిల్వ చేసుకునే అవకాశం లేకుండా పోతోంది. దీంతో వరద మొత్తం సముద్రం పాలౌతోంది. ఇటీవల నివర్ తుపాన్ సమయంలోనూ 50వేల క్యూసెక్కుల నీరు వృథాగా సముద్రం పాలైంది. ఈ గేట్ల ఎత్తు పెంచితే మరో 10వేల ఎకరాలకు నీటిని మళ్లించవచ్చు. కోట ఆనకట్ట వద్ద, గూడలి పరిసరాల్లో ఈ నీటిని వినియోగించవచ్చు. - మల్లి కుమార్, దుగరాజపట్నం

ఈ ప్రతిపాదన ఏళ్లుగా అమలుకు నోచుకోకపోవడం రైతులను కలవరపెడుతోంది. అలాగే మూడు టీఎంసీల నీరు శాశ్వతంగా తెలుగు గంగ నుంచి కేటాయించాలని ప్రతిపాదనలున్నాయి. ఇటీవల ఐఏబీ సమావేశంలోనూ దీనిపై చర్చ జరిగింది. ఇది సాకారమైతే ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని రైతులు చెబుతున్నారు.

వైఎస్.రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏర్పాటైన స్వర్ణముఖి బ్యారేజీ ఎత్తు పెంచగలిగితే వాకాడు పరిసర ప్రాంతాలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది.

ఇదీ చదవండి :

శ్మశానం పక్కన స్థలాలు వద్దు.. పట్టాల పంపిణీకి రాని గ్రామస్థులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.