ETV Bharat / state

ర్యాగింగ్​కు తట్టుకోలేక.. రైలు కిందపడి విద్యార్థి ఆత్మహత్య

author img

By

Published : Feb 20, 2023, 2:48 PM IST

Student Suicide due to Ragging: సీనియర్ల వేధింపులు తాళలేక నెల్లూరు జిల్లాలో ఇంజనీరింగ్ రెండో సంవత్సరం చదువుతున్న ప్రదీప్ అనే విద్యార్థి.. రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. కుమారుడు చనిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.

Student Suicide due to Ragging
విద్యార్థి ఆత్మహత్య

Student Suicide due to Ragging: ర్యాగింగ్​ను అరికట్టడానికి ఎన్ని చర్యలు చేపట్టినా, ఎన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహించినా.. వాటి బారిన పడుతున్న విద్యార్థులు మాత్రం తగ్గడం లేదు. తాజాగా ర్యాగింగ్​కు మరో ఇంజనీరింగ్ విద్యార్థి బలి అయ్యాడు. కొద్ది రోజుల క్రితం తల్లితండ్రులకు కూడా ర్యాగింగ్ గురించి చెప్పాడు. నిత్యం వేదిస్తున్నారని చెప్పి వాపోయాడు.

కానీ ఇంతలోనే తన కుమారుడు తిరిగి రాని లోకాలకు వెళ్లిపోతాడని వారు అనుకోలేదు. దీంతో ఆ తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతంగా మారింది. తమ కుమారుడు మంచిగా చదువుకుని ప్రయోజకుడవుతాడని అనుకున్నారు. కానీ ఇలా విగత జీవిగా పడి ఉన్న కుమారుడిని చూసి ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.

అసలేం జరిగిందంటే.. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బోగోలు మండలం కడనూతల గ్రామంలోని ఆర్ఎస్​ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ప్రదీప్ చదువుతున్నాడు. ప్రదీప్ తల్లిదండ్రులు పెంచలయ్య, లక్ష్మీలు అనంతసాగర్ మండలంలోని శంకర్ నగర్ గ్రామంలో ఉంటున్నారు. ప్రదీప్ తండ్రి ఆటో డ్రైవర్​గా పని చేస్తున్నారు.

ఇంజనీరింగ్ రెండో ఏడాది చదువుతున్న ప్రదీప్​ను.. తన సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్ చేస్తున్నారని తల్లిదండ్రులకు చెప్పి వాపోయాడు. బీరు బాటిల్స్, బిర్యానీలు కావాలని నిత్యం వేధిస్తున్నారని తల్లిదండ్రులకు చెప్పాడు. తన దగ్గర డబ్బులు లేవని చెప్పినా సరే.. ఫోన్ అమ్మి అయినా సరే తీసుకురావాలని మానసికంగా ఒత్తిడి చేస్తున్నారని.. ప్రదీప్ తన తల్లిదండ్రులకు చెప్పి బాధ పడేవాడని చెప్పారు.

ఎవరెవరు ర్యాగింగ్ చేస్తున్నారో వారి పేర్లు అడిగినా సరే భయపడి చెప్పలేదని అన్నారు. ఇంటికి కూడా వెళ్లకూడదని చెప్పి చిత్ర హింసలు పెట్టి.. మా కుమారుడు చనిపోయేలా చేశారంటూ ప్రదీప్ తల్లిదండ్రులు తెలిపారు. సీనియర్ల వేధింపులు తట్టుకోలేకే.. శనివారం రైలు కింద పడి ఆత్యహత్య చేసుకున్నాడని.. గుండెలు పగిలేలా ఏడుస్తూ చెప్పారు. తమకు న్యాయం జరగాలని ఆ తల్లిదండ్రులు కోరుతున్నారు. దీనిపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని రైల్వే పోలీసులు తెలిపారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.