ETV Bharat / state

యథేచ్ఛగా చౌక బియ్యం అక్రమ రవాణా.. పట్టించుకోని అధికారులు

author img

By

Published : Nov 12, 2020, 3:06 PM IST

కరోనా కష్టకాలంలో పేదల ఆకలి తీర్చేందుకు ప్రభుత్వం ఇచ్చే ఉచిత బియ్యాన్ని అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు. కాదేది అక్రమార్జనకు అనార్హం అన్నట్లు.. పెద్దఎత్తున రేషన్ బియ్యం అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. పట్టపగలే పని కానిచ్చేస్తున్నా.. అధికారులకు మాత్రం పట్టడం లేదు. విషయం తెలుసుకొని అక్కడి వెళ్లిన ఈటీవీ-ఈటీవీ భారత్ బృందంతో సదరు వ్యక్తులు బేరసారాలకు దిగడం.. విచ్చలవిడిగా జరిగే రేషన్ బియ్యం దందాకు నిదర్శనంగా నిలుస్తోంది.

ration rice illegal business a
యథేచ్ఛగా చౌక బియ్యం అక్రమ రవాణా.

కరోనా ధాటికి ఉపాధి కోల్పోయి.. ఆకలితో అలమటించే పేదల ఆకలి తీర్చేందుకు ప్రభుత్వాలు నెలకు రెండుసార్లు ఉచితంగా రేషన్ బియ్యాన్ని పంపిణీ చేస్తున్నాయి. ఇలా ఇస్తున్న బియ్యాన్ని కొంతమంది అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు. ప్రజల నుంచి కిలో బియ్యాన్ని 7 రూపాయలకు కొనుగోలు చేసి.. బయట 20 రూపాయలకు అమ్ముకుంటున్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నాయుడుపేట పురపాలక సంఘం కేంద్రంగా రేషన్ బియ్యం అక్రమ రవాణా జోరుగా సాగుతోంది.

జోరుగా దందా..

నాయుడుపేట రాజగోపాలపురంలోని బియ్యం వ్యాపారి.. తన గోదాము నుంచి రేషన్‌ బియ్యం బస్తాలను తరలించేందుకు వాహనంలోకి బియ్యాన్ని ఎక్కిస్తున్నాడు. విషయం బయటకు తెలియడంతో ఈటీవీ-ఈటీవీభారత్ బృందం అక్కడికి చేరుకుంది. చౌక బియ్యం బస్తాలను వాహనానికి ఎక్కిస్తుండగా అక్కడి దృశ్యాలను చిత్ర, వీడియో రూపంలో బంధించింది. గమనించిన యజమాని ఇవి నెల్లూరు జిలకర బియ్యమని, తడ మండలం అపాచీ కంపెనీకి పంపుతున్నట్లు, ఇందులో ఎలాంటి మోసం లేదని నచ్చజెప్పేందుకు ప్రయత్నించాడు. అంతా పద్దతి ప్రకారం లేబుల్‌ వేసి ఉన్నాయని, మిల్లుల నుంచి తెప్పించి ఎగుమతి చేస్తున్నట్లు చెబుతూనే బేరసారాలకు సిద్దమయ్యాడు.

బేరసారాలు..

వ్యానులో ఉన్న బస్తాల్లోని బియ్యం బయటకు తీసి.. ఇవి రేషన్‌ బియ్యం కదా అని ప్రశ్నించగా.. అందులో కొన్ని బస్తాలు మాత్రమే చౌక బియ్యమని.. మిగిలినవి నెల్లూరు జిలకర రకానికి చెందిన బియ్యంగా చెప్పసాగారు. గోదాములో ఉండే బస్తాలను పరిశీలించిన ఈనాడు-ఈటీవీ బృందాలు.. ఇవన్నీ రేషన్ బియ్యమని, వాటిని వేరువేరు పేర్లతో ఉన్న గోనె సంచుల్లో వేసి అక్రమ రవాణాకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. దీనిపై ప్రశ్నించిన ఈనాడు-ఈటీవీ బృందాలతో సదరు వ్యక్తి బేరసారాలకు దిగాడు. ‘ఏదో వ్యాపారం చేసుకుంటున్నాం, వదిలేయండి.. మీకేం కావాలో చెప్పండి చేస్తాం.. చిత్రాలు, వీడియోలు తీయడం ఆపేయండి’ అంటూ కాళ్ల బేరానికి దిగాడు.

ఇక ఫలితం లేదని వెనక్కి...

ప్రలోభాలకు తలోంచని ఈనాడు-ఈటీవి బృందం వీడియోలు, చిత్రాలు తీస్తుండటం.. వాహనంలోకి ఎక్కించిన బియ్యం బస్తాలను వెనక్కు దింపి, తిరిగి గోదాములోకి చేర్చారు. అయితే బస్తాలు దింపేసి వాహనం వెళ్లే ప్రయత్నం చేస్తుంటే.. వేసుకుని పొమ్మంటావా చెప్పు.. అంటూ బేరాలాడటం చూస్తే అక్కడ ఏమేరకు రేషన్ బియ్యం దందా జరుగుతుందో అర్ధమవుతోంది. ఇదంతా జరుగుతున్నప్పటికీ రెండు, మూడు వ్యానుల్లో దొరవారి సత్రం, సూళ్లూరుపేట వైపు చౌక బియ్యం తరలించడం గమనార్హం.

ఇదే తీరునా..

నగరంలో ఎంతో మంది వ్యాపారులు ఇదే తరహాలో దుకాణం ఒక చోట.. గోదాములు మరోచోట ఏర్పాటు చేసుకొని.. అక్కడి నుంచి రేషన్‌ బియ్యం అక్రమ వ్యాపారం చేస్తున్నట్లు పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. పట్టణంలో పలుచోట్ల గోదాముల్లో పెద్దఎత్తున రేషన్‌ బియ్యం నిల్వలు ఉన్నట్లు సమాచారం. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి చౌక బియ్యం అక్రమ రవాణాను నిరోధించడంతోపాటు సదరు వ్యాపారులు, మిల్లర్లపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైన ఉంది.

ఇవీ చూడండి...

క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు... ఏడుగురు అరెస్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.