ETV Bharat / state

ఇకపై ధర్నాలు, నిరసనలు, పోరాటాలు.. ఎమ్మెల్యే కోటంరెడ్డి సంచలన ప్రకటన

author img

By

Published : Feb 17, 2023, 7:17 PM IST

YCP Rebel MLA Kotam Reddy fight against YCP govt: రాష్ట్ర ప్రభుత్వ తీరును విమర్శిస్తూ.. తొలిసారిగా నెల్లూరు గ్రామీణ వైసీపీ అసమ్మతి ఎమ్మెల్యే పోరాటానికి శ్రీకారం చుట్టారు. తన నియోజకవర్గంలోని సమస్యలను ప్రభుత్వం పరిష్కరించే వరకూ ఇక నుంచి ధర్నాలు, నిరసనలు చేపడతానని ప్రకటించారు. 'ముస్లింల నిరసన గొంతుక' పేరుతో పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నిరసన కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్‌పై కోటంరెడ్డి ప్రశ్నల వర్షం కురిపించారు. 'ఇదెక్కడి న్యాయం సీఎం జగన్ గారూ' అంటూ ధ్వజమెత్తారు.

YCP rebel MLA Kotam
YCP rebel MLA Kotam

YCP rebel MLA Kotam Reddy fight against YCP govt: నెల్లూరు గ్రామీణ అసమ్మతి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తొలిసారిగా వైసీపీ ప్రభుత్వంపై నిరసన కార్యక్రమాన్ని ప్రారంభించారు. తాజాగా నెల్లూరు కలెక్టరేట్ వద్ద నిరసనకు పిలుపునిచ్చిన కోటంరెడ్డి.. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున తన పార్టీ కార్యాలయంలో ఈరోజు 'ముస్లింల నిరసన గొంతుక' అనే పేరుతో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. నిరసన కార్యక్రమానికి నియోజకవర్గం నలుదిక్కుల నుంచి వందలాదిమంది ముస్లిం సోదరులు విచ్చేసి.. వారి సమస్యలను విన్నవించుకున్నారు.

ఇక నుంచి ధర్నాలు, నిరసనలు: కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ.. తన నియోజకవర్గంలోని సమస్యల పరిష్కారం కోసం ఇక నుంచి ధర్నాలు, నిరసనలు చేపడతానని ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పలు అభివృద్ది పనులకు నిధులు విడుదల చేసి, పనులను ప్రారంభించిందన్నారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం.. ఆ పనులకు నిధులను విడుదల చేయకుండా నిలిపివేసిందని విమర్శించారు. ముందు ప్రభుత్వం చేసిన అభివృద్ది పనులను.. తరువాత వచ్చిన ప్రభుత్వం నిలిపివేయడం ఆశ్చర్యంగా ఉందని కోటంరెడ్డి వ్యాఖ్యానించారు.

ఆ నిధులెక్కడివి సీఎం జగన్ గారూ?: వైసీపీ అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు అవుతున్నా ఈనాటి వరకూ గురుకుల పాఠశాల అంశాన్నే పట్టించుకోలేదన్నారు. రూ.2 కోట్లను వెచ్చిస్తే గురుకుల పాఠశాల పూర్తవుతుందని అనేకసార్లు ప్రభుత్వాన్ని వేడుకున్నా.. డబ్బులు లేవని చెప్తూ నాలుగేళ్లు కాలయాపన చేశారని ఆగ్రహించారు. పిల్లల చదువుకునేందుకు డబ్బులు వెచ్చించని ప్రభుత్వం.. నెల్లూరు నగర నడిబొడ్డున రూ.2.5 కోట్లు పెట్టి నగర కమిషనర్ ఇల్లు కట్టుకోవడానికి నిధులెక్కడి నుంచి కేటాయించింది? అని కోటంరెడ్డి ప్రశ్నించారు.

రూ.15 కోట్లు ఏమయ్యాయి సీఎం గారూ?: బారాషాహీద్ దర్గా అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి జగన్‌ని కలిసి రూ.15 కోట్లు అడుగగా.. 15 రోజుల్లో విడుదల చేస్తామని హామీ ఇచ్చారన్నారు. కానీ.. నేటికీ ఫైనాన్షియల్ క్లియరెన్స్ కాలేదు, నగదును విడుదల చేయలేదు, జీఓని చిత్తు కాగితంలా మార్చేశారని మండిపడ్డారు. 15 రోజుల్లో నిధులు విడుదల చేస్తానని హామీ ఇచ్చిన సీఎం జగన్.. ఇప్పటికి ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు ఎందుకో? సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 'ఇదెక్కడి న్యాయం జగన్ గారూ'.. తమ నియోజకవర్గ ప్రజలపైనే ఇందుకింత వివక్ష చూపుతున్నారని కోటంరెడ్డి ధ్వజమెత్తారు.

ఇక నుంచి ధర్నాలు, నిరసనలు, పోరాటాలు చేస్తా.. ఎమ్మెల్యే కోటంరెడ్డి

ముస్లింలు, దళితులు, గిరిజనుల కోసం గురుకుల పాఠశాలను పూర్తి చేయాలని కోరుతూ నాలుగేళ్లు పోరాడాను. గతంలో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్కచెరువుపాడులో రూ.15 కోట్ల రూపాయలతో ముస్లిం గురుకుల పాఠశాల నిర్మాణం చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఒక ఎమ్మెల్యేగా నేను రూ. 2కోట్లు పెడితే ఆ గురుకుల పాఠశాల పూర్తి అవుతుందని వేడుకున్నాను. దానికి డబ్బులు లేవని చెప్తూ నాలుగేళ్లుగా కాలయాపన చేశారు. రెండు కోట్లు, మూడు కోట్లు లేవని చెప్పే వీళ్లూ.. నెల్లూరు నగర నడిబొడ్డున రూ.2.5 కోట్లు పెట్టి నగర కమిషనర్ ఇల్లు కట్టుకోవడానికి నిధులెక్కడి నుంచి కేటాయించారు?- కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, వైసీపీ అసమ్మతి ఎమ్మెల్యే

ఆ అవమానం తట్టుకోలేకే బయటికొచ్చా..: మూడు తరాలుగా ఆ కుటుంబం కోసం తాను పని చేశానని, చివరికి చాలా అవమానించారని కోటంరెడ్డి ఆవేదన చెందారు. ఆ అవమానం తట్టుకోలేకే తాను వైసీపీకి దూరంగా జరిగానన్నారు. ప్రజా సమస్యల కోసం ప్రజాపక్షాన కోటంరెడ్డి గొంతుక వినిపిస్తూనే ఉంటుందన్నారు. నియోజకవర్గ, ప్రజల సమస్యల పరిష్కారం కోసం.. ప్రభుత్వం చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా ఎటువంటి ఫలితం దక్కలేదని ఆగ్రహించారు. ఇక ప్రజలతోనే కలిసి ఉద్యమించక తప్పడం లేదని.. పనులు పూర్తి చేయకుంటే సీఎం జగన్ విడుదల చేసిన జీఓని తీసుకొని హైకోర్టు, సుప్రీంకోర్టుకు వెళ్తానని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హెచ్చరించారు.

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.