ETV Bharat / state

అభ్యాగులకు అండగా.. ఎందరికో ఆదర్శంగా.. 'ప్యూర్ స్మైల్ సేవా సంస్థ' సేవలు

author img

By

Published : Mar 4, 2023, 9:39 PM IST

Pure Smile Seva
Pure Smile Seva

A woman from Nellore district standing by the poor: 'మానవ సేవే - మాధవ సేవ' అనే నినాదంతో కుల, మత అనే తేడాలు లేకుండా నిరుపేదలకు సేవ చేయటం, అభ్యాగుల ఆకలిని తీర్చటమే లక్ష్యంగా 'ప్యూర్ స్మైల్ సేవా సంస్థ' ముందుకెళ్తోందని, ఇలాంటి సేవ చేసే అవకాశం రావటం ఆ దేవుడు తనకిచ్చిన గొప్ప వరంగా భావిస్తున్నానని.. 'ప్యూర్ స్మైల్ సేవా సంస్థ' నిర్వాహకురాలు షేక్ పర్వీన్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. తమ సంస్థ ద్వారా ఆపదలో ఉన్నవారికి, చదువుకోవాలని ఆసక్తి ఉండి ఆర్థిక సమస్యలతో మధ్యలోనే చదువు ఆపేసినవారికి, ఆకలితో అలమటిస్తున్నవారికి సహాయాన్ని అందిస్తూ, నిత్యం అన్నదానాలు చేస్తూ.. రోజుకు 100 మంది ఆకలిని తీరుస్తున్నామని తెలిపారు. తాను చేస్తున్న సేవలకు గానూ ఇప్పటివరకూ 50 అవార్డులు, ఒక డాక్టరేట్‌ వచ్చాయని, ఇదొక జాబ్‌గా ముందుకెళ్తున్నామని ఆమె పలు కీలక విషయాలను వెల్లడించారు.

A woman from Nellore district standing by the poor: ఓ సాధారణ ఇల్లాలు.. కష్టంలో ఉన్నాము ఏదైనా సహాయం చేయండి అని ఎవరైనా ఆమె ఇంటికి వెళితే ఖాళీ చేతులతో మాత్రం పంపించదు. ఖచ్చితంగా తనవంతు సహాయాన్ని చేసే తీరుతుంది. ఆ నమ్మకంతో ఆమెను సహాయం కోరేవారి సంఖ్య రోజురోజుకు పెరిగింది. దాంతో ఆర్థిక భారం పెరిగింది. అయినా కూడా పేదలకు సహాయం చేయడానికి ఆమె మాత్రం వెనుకంజ వేయలేదు. ఓ వైపు దేవుడిని ప్రార్థిస్తూనే, మరోవైపు ఆమె భర్తకు వచ్చే పింఛన్, పిల్లలు పంపించే నగదుతో సహాయం చేస్తూ ముందుకు సాగింది. ఈ క్రమంలో ఆమె చేస్తున్న సేవ గురించి తెలుకున్న పలువురు దాతలు.. ఆర్థిక సహకారం అందించటం మొదలుపెట్టారు. గతంలో ఆమె నుంచి సహాయం పొందినవారు తమ కష్టాలు తీరాయి అంటూ.. చిరునవ్వులతో ధన్యవాదాలు చెప్తూ, వారివంతుగా సహాయాలు చేయడం ప్రారంభించారు. దీంతో ఆ ఇల్లాలు.. మరింత ఉత్సాహంతో ముందుకెళ్లింది. 2017వ సంవత్సరంలో 'ప్యూర్ స్మైల్' పేరుతో సేవా సంస్థను నెలకొల్పింది. ఆమె సేవలను గుర్తించిన ప్రభుత్వాలు, పలు సంస్థలు అవార్డులను ప్రకటించాయి. ఇప్పటివరకూ దాదాపు 50 అవార్డులు, ఒక డాక్టరేట్‌ ఆమెను వరించాయి.

వివరాల్లోకి వెళ్తే.. నెల్లూరు నగరానికి చెందిన షేక్ పర్వీన్ ఐదేళ్లుగా కుల, మత భేదాలు లేకుండా సేవ కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. ఈ సేవ కార్యక్రమానికి ఆమె భర్త షౌకత్ హుస్సేన్ సపోర్ట్ చేస్తూ..తనవంతు సహకారాన్ని అందించారు. భర్త షౌకత్ పంచాయితీ రాజ్‌లో ఎస్‌ఈగా ఉద్యోగం చేస్తూ పదవీ విరమణ చేశారు. వారికి ముగ్గురు పిల్లలు. వాళ్లంతా ఆర్థికంగా స్థిరపడ్డారు. విదేశాల్లో బంధువులు, స్నేహితుల సహాయంతో పేదవాళ్లకు సేవ చేయడం ప్రారంభించారు.

సాధారణంగా ముస్లిం మహిళలు బయటకు వచ్చి సేవా కార్యక్రమాలు చేయడం చాలా అరుదుగా కనిపిస్తుంది. కానీ, పర్వీన్ మాత్రం పేద ప్రజలకు సేవ చేయడమే తన జీవిత లక్ష్యంగా భావించి.. ఐదేళ్ల నుంచి నెల్లూరు నగరం శివారు ప్రాంతాల్లో నివాసిస్తున్న ఎందరో అభ్యాగులకు, నిరుపేదలకు ఆర్థిక సహాయాన్ని చేస్తూ వచ్చారు. 2017 నుంచి 'ప్యూర్ స్మైల్ సంస్థ' ద్వారా.. చదువుకోవాలని ఆసక్తి ఉండి, డబ్బులు లేక చదువును మధ్యలోనే ఆపేసిన వారికి ఆర్థికంగా చేయూతనిచ్చి వందలాది మందిని చదివించారు.

అంతేకాదు, ఇప్పటికీ పేద విద్యార్ధులకు వస్త్రాలు, పుస్తకాలను అందజేస్తూ వస్తున్నారు. నెల్లూరు నగరంలోని పోర్లు కట్టపై నివసించే అభాగ్యులను ఐదేళ్లుగా ఆదుకుంటున్నారు. రోడ్లపై ఉన్నవారికి ప్రతి రోజు భోజనం అందిస్తాస్తున్నారు. వృద్ధాశ్రమలు, దివ్యాంగుల పాఠశాలల్లో కావాల్సిన వసతులకు ఆర్థికంగా సహాయం చేస్తున్నారు. కుట్టుమిషన్లు కొనలేని బీద మహిళలకు 'జీవన జ్యోతి' పేరుతో ఇప్పటివరకు 14 లక్షల విలువైన 200 కుట్టుమిషన్లు అందజేశారు.

ఈ సందర్భంగా ప్యూర్ స్మైల్ సంస్థ నిర్వాహకురాలు షేక్ పర్వీన్ మాట్లాడుతూ..'' పేద ప్రజలకు సేవ చేసే ఆవకాశం ఆ దేవుడు నాకు ఇచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాను. ఇది నా జాబ్. నా భర్త, నా పిల్లలు ఈ సేవ కార్యక్రమంలో చురుకుగా పాల్గోంటారు, సహాయాలు చేస్తుంటారు. ఇంటి ఇద్దెలు, నా భర్తకు వచ్చే పింఛన్, పిల్లలు పంపించే నగదుతో చెల్లిస్తూ.. మిగిలిన నగదును ఆపదలో ఉన్నవారికి సాయం చేస్తుంటాను. సేవ సంస్థ ద్వారా పెళ్లి రోజు, పుట్టిన రోజుల సందర్భంగా అన్నదానాలు చేస్తూ.. రోజుకు 100 మంది ఆకలిని తీరుస్తున్నాము. లాక్‌డౌన్‌ సమయంలో 50 రోజుల పాటు భోజనాన్ని సరఫరా చేసి, వందలాది మంది ఆకలిని తీర్చాము. గత ఏడాది నెల్లూరులో వరదలు వచ్చినప్పుడు ఆహార పోట్లాలు, వంట సామగ్రి, దుస్తులను అందజేశాము. సంస్థ ద్వారా పేద రోగులకు ఉచితంగా మందులు ఇస్తున్నాము.'' అని ఆమె తెలిపారు.

అనంతరం ఆమె భర్త షౌకత్ హుస్సేన్ మాట్లాడుతూ.. తాను ఉద్యోగం చేస్తున్న రోజుల్లోనే పర్వీన్ సేవా కార్యక్రమాలు చేస్తుండేందని తెలిపారు. రానున్న రోజుల్లో ఈ సేవలను ఇంకా విస్తృత పరుస్తామన్నారు. తమ సంస్థ అవసరం ఎక్కడ ఉన్న అక్కడికి వెళ్లి సహాయం చేస్తామని ఆయన పేర్కొన్నారు. తొందరలోనే నీడలేని వృద్ధుల కోసం ఆశ్రమం ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే, కుట్టు మిషన్ల కేంద్రాన్ని ఏర్పాటు చేసి, మహిళలకు శిక్షణతో పాటు ఉచితంగా కుట్టుమిషన్లను అందజేస్తామని షౌకత్ వెల్లడించారు.

ఇప్పటికే ప్యూర్ స్మైల్ సేవా సంస్థ ద్వారా స్వర్ణ దీపం, కారుణ్య, విశ్వ వెలుగు వంటి దివ్యాంగుల ఆశ్రమాలకు వాషింగ్ మెషీన్లు ఫ్రీజ్‌లు, ఫ్యాన్లు , సీసీ కెమోరాలను అందించారు. ఉన్నత చదువులు చదివే పేద విద్యార్థులకు ఫీజులతో పాటు ల్యాప్ టాప్‌లు అందజేశారు. ఇక, ప్రతి సంవత్సరం రంజాన్ మాసంలో జకాత్ రూపంలో లక్షల రూపాయలను సాయం చేశారు. సుకన్య సంవృద్ధి యోజన కింద పొదుపు చేసేందుకు 30మంది పేదింటి ఆడ పిల్లలకు ఏటా వెయ్యి రూపాయలు అందిస్తూ.. ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నారు షేక్ పర్వీన్.

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.