ETV Bharat / state

Mistake in Hallticket: అధికారుల నిర్లక్ష్యం.. విద్యార్థికి శాపం

author img

By

Published : Apr 29, 2022, 9:49 AM IST

Mistake in hall ticket: హాల్‌టికెట్‌లో సబ్జెక్టులు తారుమారైన విషయం గమనించకపోవడం ఆ విద్యార్థికి శాపంగా మారింది. నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలంలోని కరటంపాడు హైస్కూల్లో శివకుమార్‌ పదో తరగతి చదువుతున్నాడు. తొలిరోజు తెలుగు పరీక్ష అయితే.. హాల్‌టికెట్‌లో హిందీ పేపర్ ఉందని చెప్పి.. నిర్వాహకులు అదే ప్రశ్నాపత్రం ఇచ్చారు. అందులోనూ స్పెషల్ హిందీ పేపర్ ఇచ్చారు. రెండో రోజు మళ్లీ హాల్‌టికెట్‌లో ఉన్నట్లు తెలుగు ప్రశ్నాపత్రం ఇవ్వడంతో శివకుమార్ పరిస్థితి అయోమయంగా మారింది. రెండు పరీక్షలు రాయలేకపోయిన తన కుమారుడు.. విద్యాసంవత్సరం కోల్పోకుండా అధికారులే తగు న్యాయం చేయాలని విద్యార్థి తండ్రి వేడుకుంటున్నారు.

Mistake in nellore tenth class student hall ticket
సబ్జెక్టులు తప్పుగా ముద్రణ అయిన హాల్ టికెట్

హాల్‌టికెట్‌ ముద్రణ లోపం.. విద్యార్థికి శాపం

Mistake in hall ticket: అధికారుల నిర్లక్ష్యం ఓ విద్యార్థి సంవత్సర కాలాన్ని నిరుపయోగం చేసింది. ఎంతో కష్టపడి చదువుకున్న అతడికి.. హాల్‌ టికెట్‌లో మార్పు శాపంగా మారింది. అందులో సబ్జెక్టుల మార్పు కారణంగా ఇప్పటివరకు జరిగిన రెండు పరీక్షల్లో ఫెయిల్‌ అయ్యే పరిస్థితి వచ్చింది. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం డీసీపల్లికి చెందిన మోడెం శివకుమార్‌ ఆత్మకూరు మండలం కరటంపాడు ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. అతడికి ఈ నెల 26న పరీక్షలు రాసేందుకు హాల్‌టికెట్‌ (2217121499) అందజేశారు. దాన్ని తీసుకున్న విద్యార్థి 27వ తేదీన ఆత్మకూరులోని సెయింట్‌ మేరిస్‌ ఇంగ్లిష్‌ మీడియం స్కూల్‌లో పరీక్షకు హాజరయ్యాడు.

గదిలో ఉన్న విద్యార్థులందరికీ తెలుగు పేపర్‌ ఇవ్వగా.. శివకుమార్‌కు మాత్రం హిందీ పేపర్‌ ఇచ్చారు. ఇదేమిటని ఇన్విజిలేటర్‌ను అడగ్గా.. మీ హాల్‌ టికెట్‌లో అదే ఉందని చెప్పడంతో నిర్ఘాంతపోయాడు. విషయం ఉపాధ్యాయులకు చెప్పాలని కోరినా.. పరీక్ష సమయంలో బయటకు వెళ్లేందుకు అనుమతి లేదని చెప్పడంతో.. చేసేది లేక పరీక్ష జరుగుతున్నంత సేపు గదిలోనే కూర్చుండిపోయాడు. ఈ విషయం తెలుసుకున్న ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాసరావుతో పాటు మరో వ్యక్తి రాత్రి 9 గంటల ప్రాంతంలో వచ్చి.. పై స్థాయిలో పొరపాటు జరగడం వల్ల సబ్జెక్టు మారిందని చెప్పారు. తనతో పాటు తీసుకొచ్చిన కాగితంపై సంతకం పెడితే.. తర్వాత పరీక్ష సక్రమంగా రాయిస్తానని నచ్చజెప్పారు. ఇప్పటికే రాయలేకపోయిన తెలుగు పరీక్షను మరో నెల రోజుల్లో జరిగే సప్లిమెంటరీలో రాయాల్సి ఉంటుందని చెప్పడంతో విద్యార్థి కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

మీ అబ్బాయి ఎలాగైనా పాస్‌ అయ్యేలా చూస్తామని హామీ ఇచ్చి.. విద్యార్థితో సంతకం పెట్టించుకుని వెళ్లారు. గురువారం హిందీ పరీక్ష రాయాల్సి ఉండగా.. మళ్లీ తెలుగు (ప్రత్యేక) పరీక్షకు సంబంధించిన ప్రశ్నాపత్రం ఇవ్వడంతో విద్యార్థికి ఏం చేయాలో అర్థం కాక.. రాయకుండా అక్కడే కూర్చుండిపోయారు. ఇన్నాళ్లు కష్టపడి చదివిన తమ కొడుకు విద్యా సంవత్సరాన్ని నాశనం చేస్తున్నారని శివకుమార్‌ తల్లిదండ్రులు బుజ్జయ్య, చెంగమ్మ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

దీనిపై డీఈవో రమేష్‌ను ‘ఈనాడు’ వివరణ అడగ్గా.. హాల్‌టికెట్‌ ఇచ్చేటప్పుడు ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, తీసుకున్న తర్వాత విద్యార్థి అందులో వివరాలను సరిచూసుకోవాలన్నారు. తప్పులుంటే.. వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తే మార్పులు చేసేందుకు అవకాశం ఉండేదని చెప్పారు. ఇదంతా వారి నిర్లక్ష్యంతోనే జరిగిందని తెలిపారు.

ఇదీ చదవండి:

పదో తరగతి ప్రశ్నపత్రాల లీక్‌కు అడ్డుకట్ట లేదా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.