ETV Bharat / state

House Taxes Hike: 'పాత విధానాన్నే కొనసాగించండి.. పెంచిన పన్నులను వెంటనే తగ్గించండి'

author img

By

Published : Jul 1, 2021, 10:13 AM IST

ఇంటి పన్నులను తగ్గించాలంటూ.. రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష పార్టీల నాయకులు ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం పెంచిన ఆస్తి పన్ను, చెత్త పన్నులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

Left parties protest across the state to demand reduction of taxes
పన్నులు తగ్గించాలంటూ రాష్ట్రవ్యాప్తంగా వామపక్షాల ధర్నా

పాత ఆస్తి పన్ను విధానాన్నే కొనసాగించాలని రాష్ట్ర వ్యాప్తంగా సీపీఎం నాయకులు, ప్రజా సంఘాల నేతలు ఆందోళనలను నిర్వహించింది. ఆస్తి పన్ను పెంపు వల్ల ప్రజలపై మరింత భారం పడుతుందని ఆవేదన చెందారు. పన్నులను తగ్గించాలని డిమాండ్ చేశారు.

నెల్లూరు జిల్లాలో...

  • ఆత్మకూరు మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట సీపీఎం ఆధ్వర్యంలో నాయకులు ధర్నా నిర్వహించారు. పెంచిన ఇంటి, చెత్త పన్నును వెంటనే తగ్గించాలంటూ నినాదాలు చేశారు. పన్నుల భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని లేకుంటే తీవ్రంగా ఆందోళన చేస్తామని పట్టణ కార్యదర్శి నాగేంద్ర తెలిపారు. తెదేపా హయాంలో ఉన్న పన్నులను తాము అధికారంలోకి వచ్చాక తగ్గిస్తామంటూ పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీని.. జగన్ ప్రభుత్వం నెరవేర్చాలని డేవిడ్ రాజు కోరారు.
  • నగర పాలక సంస్థలను వ్యాపార సంస్థలుగా ప్రభుత్వం తయారు చేస్తోందని ఏపీ పట్టణ పౌర సమాఖ్య ఆందోళన వ్యక్తం చేసింది. చెత్తకు పన్ను విధించే స్థాయికి ప్రభుత్వం దిగజారడం దారుణమని సమాఖ్య రాష్ట్ర కన్వీనర్ బాబురావు విమర్శించారు. చెత్త, నీరు, ఇంటి పన్నుల పెంపును నిరసిస్తూ నెల్లూరు నగర పాలక సంస్థ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. పన్నుల పెంచుతూ ప్రభుత్వం ఇచ్చిన జీవో కాపీలను నేతలు దహనం చేశారు. అప్పుల కోసం కేంద్రం ఇచ్చే ఆదేశాలను రాష్ట్రం పాటిస్తూ ప్రజలపై భారాలు మోపుతోందని ధ్వజమెత్తారు.

కర్నూలు జిల్లాలో...

  • పాత ఆస్తిపన్ను విధానాన్నే కొనసాగించాలని... పెట్రో, డీజిల్ ధరలను తగ్గించాలని కర్నూలు నగరంలో సీపీఎం ఆధ్వర్యంలో ఆందోళనలు నిర్వహించారు. సచివాలయాల ఎదుట ఆ పార్టీ కార్యకర్తలు ధర్నాలు చేపట్టారు. పెట్రో ధరలను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని కోరారు. కరోనా కష్టకాలంలో... ఆస్తి పన్ను పెంపు వల్ల ప్రజలపైమరింత భారం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
  • రాష్ట్ర ప్రభుత్వం పెంచిన ఆస్థి పన్ను, చెత్త పన్నులను వెంటనే ఉపసంహరించుకోవాలని కర్నూలులో భాజపా నాయకులు డిమాండ్ చేశారు. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న వేళ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాల వల్ల సామాన్య ప్రజలు భయందోళనకు గురి అవుతున్నారని జిల్లా అధ్యక్షుడు రామస్వామి అన్నారు. జగన్మోహన్ రెడ్డి అమ్మ ఒడి కార్యక్రమం ప్రారంభించినప్పటి నుంచి విద్యార్థులు కరోనా కారణంగా అమ్మ ఒడిలోనే ఉన్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ రద్దు చేసి రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని కోరారు.
  • పెంచిన ఇంటి పన్ను తగ్గించాలని నంద్యాలలో పురపాలక సంఘం కార్యాలయం ఎదుట ధర్నాచేశారు సీపీఎం నేతలు. ఆస్తి పన్ను విలువ ఆధారంగా ప్రభుత్వం పన్నుల పెంపు నిర్ణయం అన్యాయమన్నారు. వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు.
  • పట్టణాల్లో పెంచిన ఇంటిపన్ను.. కొత్తగా మరికొన్ని పన్నుల విధింపుపై నంద్యాల మున్సిపల్ కౌన్సిల్లో సభ్యులు అభ్యంతరం తెలిపారు. పన్నుల పెంపును వ్యతిరేకిస్తున్నట్లు తెదేపా కౌన్సిలర్లతో పాటు మెజార్టీ వైకాపా కౌన్సిలర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఛైర్ పర్సన్ మాబున్ని.. కొంతమంది కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం జరిగింది. పెంచిన పన్నులను వ్యతిరేకించిన వైకాపా కౌన్సిలర్లు వెనక్కి తగ్గి అభివృద్ధికి పన్నుల పెంపు అవసరంగా భావించారు. దీంతో ఛైర్ పర్సన్ మాబున్ని అజెండాలోని పన్ను అంశాన్ని పాస్ అని ఆమోదించారు. తెదేపా కౌన్సిలర్లు కౌన్సిల్​లో నుంచి వెళ్లిపోయారు.

ప్రకాశం జిల్లాలో...

ఇళ్ల పన్నులు, చెత్త పన్నులు పెంపును నిరసిస్తూ ప్రకాశం జిల్లా చీరాలలో వివిధ ప్రజా సంఘాలు, రాజకీయపార్టీల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. మున్సిపల్ శాఖ విధించిన ఆస్తి ఆధారిత పన్ను, చెత్తపై పన్నులను తక్షణమే రద్దు చేయాలంటూ ర్యాలీ చేపట్టారు. కరోనాతో ఓ పక్క ప్రజలు బాధపడుతుంటే మరొకపక్క ఆస్తి ఆధారిత పన్నులు, చెత్తపై పన్నులు విధిస్తూ అధికభారం మోపడం చాలా బాధాకరమని నాయకులు అన్నారు.

అనంతపురం జిల్లాలో...

పెంచినన ఆస్తి, చెత్త పన్నులు తగ్గించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేశారు. అనంతపురం జిల్లా హిందూపురంలో సీపీఎం ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ కార్యాలయం ముందు అర్ధనగ్న నిరసన చేపట్టారు. పన్నులను పెంచుతూ విడుదల చేసిన జీవోలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అసలే కరోనా కారణంగా జీవనం భారంగా మారిన వేళ.. ఇలా పన్నుల మోత విధిస్తున్న తీరుతో సామాన్య మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉందని సీపీఎం నేత ఇంతియాజ్ ఆవేదన వ్యక్తం చేేశారు. వెంటనే పెంచిన పనులను తగ్గించాలని లేనిపక్షంలో ఉద్యమాలను ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

విజయనగరం జిల్లాలో...

పట్టణ పౌర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అస్తి , చెత్త పన్నులను రద్దు చేయాలని కోరుతూ విజయనగరం నగరపాలక సంస్థ ఎదుట పట్టణ పౌర సంక్షేమ సంఘం నిరసన చేపట్టింది. కరోనాతో ప్రజలు కష్టాల్లో ఉంటే రాష్ట్ర ప్రభుత్వం పట్టణ ప్రజలపై పన్నులనే భారం వేసిందని జిల్లా అధ్యక్షుడు రెడ్డి శంకర్రావు వాపోయారు. జీఓ నెంబర్ 197,198 రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

పశ్చిమగోదావరి జిల్లాలో...

తణుకులో పట్టణ పౌర సమాఖ్య ఆధ్వర్యంలో ధర్నా చేశారు. పట్టణంలో ఆస్తి విలువ ఆధారంగా పన్నులు పెంచే ప్రభుత్వ ఉత్తర్వులను రద్దు చేయాలని ఆందోళన నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయం ఎదుట తమ నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రజల పై పదివేల కోట్ల భారాన్ని పెంచే విధంగా ఆస్తి పన్ను, డ్రైనేజ్ పన్ను, నీటి పన్నులను పెంచుతూ 196, 197, 198 జీవోలను జారీ చేసిందని నాయకులు ఆరోపించారు. గతంలో అద్దె విలువ ఆధారంగా పన్నులు విధిస్తే... తాజా ఉత్తర్వుల ప్రకారం ఆస్తి విలువ ఆధారంగా పన్నులు విధించనున్నారు. కొత్తగా జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని పాత పద్ధతిలోనే పన్నులు విధించాలని పౌర సమాఖ్య జిల్లా నాయకుడు రంగారావు డిమాండ్ చేశారు.

ఇదీ చూడండి:

RDS CANAL: ఆర్డీఎస్​ కుడికాల్వ పనులను ఆపాలని కృష్ణా బోర్డుకు తెలంగాణ లేఖ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.