ETV Bharat / state

కబ్జా కోరల్లో పెన్నా విలవిల

author img

By

Published : May 28, 2020, 8:34 AM IST

incestigation of penna lands in nellore district
కబ్డా కోరల్లో పెన్నా విలవిల

నెల్లూరు జిల్లాలో పెన్నా నదీ తీర పరిరక్షణ, స్థానిక ప్రజల అవసరాల కోసం నిర్దేశించిన భూములను.... పెత్తందారులు, వారి అనుచరులు ఆక్రమించేస్తున్నారు. ప్రభుత్వ భూములను తమవిగా చూపి వేరుశనగ సాగు చేసేందుకు విడవలూరు ప్రాంత వలస రైతులకు అప్పగించి లక్షలు ఆర్జిస్తున్నారు.

కబ్డా కోరల్లో పెన్నా విలవిల

చేజర్ల మండలం పెళ్లేరు గ్రామ 648 సర్వే నంబరులోని పెన్నా పొరంబోకు భూములపై ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు 18 బోర్లు తవ్వారు. కొందరు ఆ భూములను ఆక్రమించి స్థానికులను వాటిలోకి రానివ్వటం లేదు. దాంతో స్థానికులు జిల్లా పాలనాధికారికి ఫిర్యాదు చేశారు. తిమ్మాయిపాలెంలోని ఒకటో సర్వే నంబరులో ఆక్రమణలపై పలు వివాదాలు కొనసాగుతున్నాయి. కోటితీర్థంలో భూ ఆక్రమణలు అధికంగా ఉన్నాయి. వీటిపై తూర్పుకంభంపాడు, కోటితీర్థంలో వివాదాలు పెరుగుతున్నాయి. ఆక్రమణలపై అధికారుల ఆదేశాలను ఆక్రమణదారులు ఖాతరు చేయటం లేదు. పశువులు, జీవాలు స్వేచ్ఛగా తిరుగుతూ మేత మేసి నీరు తాగే ప్రదేశాలను ఆక్రమించి సాగు చేయటంతో గ్రామాల్లోని పేదలు ఇబ్బందులు పడుతున్నారు.

తాగునీటిని పీల్చేస్తున్న అక్రమ మోటార్లు..

పెన్నానదిలో అక్రమ సాగుకు తీరం వెంబడి ప్రభుత్వ భూముల్లో వందల సంఖ్యలో బోర్లు ఏర్పాటు చేశారు. ఒక్కో బోరు నుంచి క్యూసెక్కుకు పైగా నీటిని తోడేస్తున్నారు. ఇలాంటి మోటార్లు మండలంలో వందల సంఖ్యలో ఉన్నాయి. సోమశిల జలాశయం నుంచి నెల్లూరు నగరానికి తాగునీటి కోసం విడుదల చేసిన నీరు బోర్లకు మళ్లుతోంది. పెత్తందారుల పలుకుబడితో సమీపంలోని రైతుల సర్వే నంబర్లు చూపి ప్రభుత్వ భూముల్లో ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్తు స్తంభాలు ఏర్పాటు చేయిస్తున్నారు.

చేజర్ల మండలం పెళ్లేరులోని 649 సర్వే నంబరులోని 638 ఎకరాల్లో సగానికిపై ఇతర ప్రాంతాల వారు ఆక్రమించారని, ఈ కారణంగా తమ ఊరి ప్రజల అవసరాలకు ఇబ్బందిగా ఉందని మజరా గ్రామమైన పుల్లనీళ్లపల్లివాసులు జిల్లా పాలనాధికారికి ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై కలెక్టరు విచారణకు ఆదేశించారు. రెవెన్యూ యంత్రాంగం నిషేధాజ్ఞలు జారీ చేసింది. అయినా ఆక్రమణలు ఆగలేదని గ్రామస్థులు ఈనాడు-ఈటీవీ భారత్ బృందానికి వివరించారు. ఈ భూమి సాగు చేయకుండా ఆపాలని, బోర్లకు విద్యుత్తు సరఫరా ఇవ్వవద్దని వారు కోరుతున్నారు.

అడుగుపెడితే కేసులు...

''పెన్నాతీర గ్రామాల్లోని పోరంబోకు భూముల్లో ఎవరు ప్రవేశించినా కేసులు నమోదు చేస్తాం. ప్రభుత్వ భూముల్లోని విద్యుత్తు కనెక్షన్లు తొలగించాలని, కొత్తవాటిని రెవెన్యూ సిబ్బంది సమక్షంలో ఏర్పాటు చేయాలని విద్యుత్తు శాఖకు సూచించాం. ఇప్పటికే ప్రభుత్వ భూమిని ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశాలిచ్చాం.'' - గీతావాణి, తహసీల్దారు

ఇదీ చదవండి:

కామన్​ గ్రేడింగ్​తో పది విద్యార్థులను పైతరగతికి అనుమతించాలని పిల్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.