ETV Bharat / state

'కరోనా కన్నా ఆకలి ఎక్కువ భయపెడుతోంది'

author img

By

Published : Mar 28, 2020, 12:22 PM IST

లాక్‌డౌన్‌ కారణంగా నెల్లూరులో వలస కూలీల జీవనం దారుణంగా ఉంది. ఎక్కడా పనులు దొరక్క రోజువారీ జీవనం గడిపేందుకు తల్లడిల్లిపోతున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి వచ్చిన వలస కార్మికులు సొంత ఊళ్లకు వెళ్లలేక, ఉన్నచోట ఉండలేక అవస్థలు పడుతున్నారు.

nellore daily wagers
nellore daily wagers

'కరోనా కన్నా ఆకలి ఎక్కువ భయపెడుతోంది'

కరోనాను కట్టడి చేసేందుకు ప్రభుత్వం లాక్​డౌన్ విధించగా... నెల్లూరు జిల్లాలోని వలస కూలీలు పొట్టకూటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నెల్లూరు నగరంతో సహా జిల్లాలో 30వేల మందికి పైగా వలస కూలీలు ఉన్నారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల నుంచి పనుల కోసం నెల్లూరు జిల్లాకు వచ్చారు. రెక్కాడితే కానీ డొక్కాడని బతుకులు వీరివి. ప్రస్తుతం లాక్​డౌన్ అమల్లో ఉన్నందున వీరికి పనులు దొరకడం లేదు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో బయటకు రావొద్దని అధికారులు హెచ్చరిస్తున్నా... వీరు ఏదైనా పని దొరుకుతుందన్న ఆశతో రోజూ ఉదయాన్నే రోడ్లపైకి వస్తున్నారు. నిరాశతో వెనుదిరుగుతున్నారు.

ప్రభుత్వం ఆదుకోవాలి...

ప్రస్తుతం పనులు దొరకని కారణంగా కుటుంబాన్ని పోషించలేకపోతున్నామని వలస కూలీలు అంటున్నారు. సరిగ్గా తిని చాలా రోజులు అవుతుందని దీనంగా చెబుతున్నారు. కరోనా కన్నా ఆకలి ఎక్కువ భయపెడుతోందన్నారు. వీటికి తోడు ఇంటి అద్దె, కరెంట్ బిల్లు ఇతరత్రా ఖర్చులకు డబ్బు చెల్లించాలంటే అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు. కరోనా వైరస్​ ఉందేమోనన్న భయంతో చాలామంది పని ఇవ్వడానికి వెనకడుగు వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వమే తమకు ఉపాధి కల్పించి ఆదుకోవాలని వేడుకుంటున్నారు.

ఇదీ చదవండి: కరోనా సోకిందన్న అనుమానంతో వ్యక్తి ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.