ETV Bharat / state

Safe Pharma Management Change: కొత్త యాజమాన్యం చేతుల్లో సేఫ్ ఫార్మా సంస్థ..

author img

By

Published : Jun 27, 2023, 12:01 PM IST

Etv Bharat
Etv Bharat

Safe Pharma Management Change: మత్తుమందుల తయారీ, అనుమతి లేని ఔషధాల ఉత్పత్తికి సంబంధించి ఈడీ కేసులు ఎదుర్కొంటున్న సేఫ్ ఫార్మాలో కీలక పరిణామం చోటుచేసుకుంది. పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం గోళ్లపాడులోని సేఫ్‌ ఫార్ములేషన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ కొత్త వ్యక్తుల చేతుల్లోకి వెళ్లింది. వివరాల్లోకి వెళ్తే..

కొత్త యాజమాన్యం చేతుల్లో సేఫ్ ఫార్మా సంస్థ

Safe Pharma Management Change: మత్తు మందుల తయారీ, అనుమతులు లేని ఔషధాల ఉత్పత్తితో.. ఈడీ, పోలీసు కేసులు ఎదుర్కొంటున్న సేఫ్‌ ఫార్మా సంస్థ.. అనూహ్యంగా కొత్త యాజమాన్యం చేతిలోకి వెళ్లిపోయింది. న్యూయార్క్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఓ సంస్థ సేఫ్‌ ఫార్మాను కొనుగోలు చేసింది. కేసులతో పీకల్లోతు కష్టాల్లో ఉన్న సేఫ్‌ సంస్థను గుట్టుచప్పుడు కాకుండా విక్రయించగా.. వివాదాలు పరిష్కరించుకునే బాధ్యత పాత యాజమాన్యానిదేనని కొనుగోలుదారులు స్పష్టం చేశారు.

వివరాల్లోకి వెళ్తే.. ఇటీవల వివాదాలకు కేంద్రబిందువుగా నిలిచిన పల్నాడు జిల్లాలోని సేఫ్‌ఫార్మా సంస్థ మరోసారి చేతులు మారింది. ఒకప్పుడు గోళ్లపాడులో కోడెల కుటుంబం ఆధ్వర్యంలో నడిచిన ఈ సంస్థకు ఎంతో పేరు ప్రఖ్యాతలు ఉండేవి. ఆయన మరణానంతరం వైఎస్సార్​సీపీ మద్దతుదారులు ఈ సంస్థను కొనుగోలు చేశారు. నిషేధిత ట్రెమడాల్ మాత్రలు తయారు చేసి.. వాటిని కాల్షియం మాత్రలుగా ప్యాక్ చేసి విదేశాలకు ఎగుమతి చేస్తుండగా.. ఈ ఏడాది ఫిబ్రవరిలో ముంబయి కష్టమ్స్‌ అధికారులు పట్టుకున్నారు. ఉగ్రవాదులు విరివిగా వినియోగించే ఈ ట్రెమడాల్‌ మాత్రల్ని తయారుచేసి విదేశాలకు పంపటంపై కేసు నమోదు చేశారు.

ALSO READ: విజయవాడ చిరునామాతో మాదక ద్రవ్యాల విక్రయం.. ఉగ్రవాద సంస్థకు నిధులు

సంస్థ ఆథరైజ్డ్‌ సిగ్నేటర్‌.. శనగల శ్రీధర్‌రెడ్డిని అరెస్ట్ చేసినా.. యాజమాన్యం అవేమీ పట్టించుకోకుండా మళ్లీ మత్తు బిల్లలు తయారీ చేసేది. ఈ క్రమంలో మే 3వ తేదీన రాష్ట్ర ఔషధ నియంత్రణశాఖ అధికారులు జరిపిన తనిఖీల్లో మత్తుబిళ్లల తయారీలో వినియోగించే మూడు కిలోల ఆక్సోకోడోన్‌ లభ్యమైంది. దీనిపై పిడుగురాళ్ల డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ జూన్ 16న ముప్పాళ్ల స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా మరోసారి కేసు నమోదయింది.

ఈ కేసుల విచారణ జరుగుతుండగానే.. సేఫ్‌పార్మా సంస్థను గుట్టుచప్పుడు కాకుండా విక్రయించేశారు. యాజమాన్యం వాటాలు విక్రయించగా న్యూయార్క్‌ కేంద్రంగా ఫార్మా వ్యాపారం నిర్వహిస్తున్న మరూరి కుమారస్వామిరెడ్డి కొనుగోలు చేశారు. ఆయన స్వగ్రామం కూడా పల్నాడు జిల్లా చాగంటివారి పాలెం కావడంతో.. కోడెలపై ఉన్న గౌరవంతోనే ఈ సంస్థను కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. దీంతోపాటు సంస్థలో ఉద్యోగులు ఉపాధి కోల్పోకూడదన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.

ALSO READ: విశాఖలో నిషేధిత మత్తు ఇంజక్షన్లు స్వాధీనం..

ఈడీ, పోలీసు కేసులపై చర్యలకు ఉపక్రమిస్తున్న వేళ.. చడీచప్పుడు కాకుండా కంపెనీలో వాటాలు అమ్మేసుకోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. కేసుల నుంచి బయటపడటానికా..? లేక ఇంకేమైనా లొసుగులు ఉన్నాయా..? లేదా రిస్కులు భరించలేక వాటాలు విక్రయించుకున్నారా? అనేది తేలాల్సి ఉంది. కేసులకు సంబంధించి పూర్తి బాధ్యత గతంలో ఉన్న యాజమాన్యానిదేనని.. ఆ మేరకు పకడ్బందీగా ఎమ్.ఓ.యూలు రాసుకున్నట్లు కొత్త యాజమాన్యం తెలిపింది. కంపెనీ నిబంధనలు అనుసరించి చట్టబద్ధంగా వాటాలు మార్పిడి చేసుకున్నామని కుమారస్వామిరెడ్డి తెలిపారు. మే 22 నుంచి సేఫ్‌ కంపెనీ తమ స్వాధీనంలోకి వచ్చిందన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.