ETV Bharat / state

AP JAC: డిమాండ్ల సాధనకై.. రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల నిరసన

author img

By

Published : Apr 29, 2023, 8:58 PM IST

Village, Ward Secretariat Employees Agitation
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల నిరసన

Employees Agitation : తమ సమస్యలను పరిష్కరించాలని.. రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్​ కార్యాలయాల వద్ద గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ధర్నాలు నిర్వహించారు. ఏపీజేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమంలో వార్డు, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.

Village, Ward Secretariat Employees Agitation : రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తమ సమస్యలను పరిష్కరించకుంటే రేపటి నుంచి మూడో దశ ఉద్యమాన్ని మరింత ఉదృతం చేస్తామని.. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు హెచ్చరించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు తమ నిరసన తెలియజేశారు.

ప్రభుత్వం శ్రమ దోపిడీకి పాల్పడింది : గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని ఏపీ అమరావతి జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు ఏపీజేఏసీ మలిదశ ఉద్యమ కార్యాచరణలో భాగంగా చివరి రోజైన ఈ రోజు.. రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ధర్నాలు నిర్వహించారు. వారి సమస్యలపై ధర్నా నిర్వహించగా.. కృష్ణా జిల్లా కలెక్టరేట్ వద్ద నిర్వహించిన ధర్నాలో బొప్పరాజు పాల్గొన్నారు. రెండు సంవత్సరాలలో ప్రొహిబిషన్​ డిక్లేర్ చేస్తానన్న ప్రభుత్వం.. రెండు సంవత్సరాల తొమ్మిది నెలల తర్వాత డిక్లేర్ చేసి శ్రమ దోపిడీకి పాల్పడిందని ఆయన విమర్శించారు.

ఏపీ ఐకాస అమరావతి ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్‌ వద్ద గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. తమ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వానికి ఇప్పటికే పలుమార్లు వినతి పత్రాలు అందజేసినా.. ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు జాబ్ చార్ట్ ఇవ్వాలని కోరారు. సంబంధం లేని పనులను సచివాలయ సిబ్బందికి అప్పగిస్తున్నారని ఇది సరికాదని అన్నారు. వేతన బకాయిలు, పదోన్నతులు, ఉద్యోగాల్లో బదిలీలు తదితర సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

ఉద్యోగులకు ఒకటో తేదీనే జీతాలు, పింఛన్లు చెల్లించాలని కోరారు. 11వ పీఆర్సీ ప్రతిపాదించిన స్కేల్స్ బయటపెట్టాలని.. పెండింగ్​లో ఉన్న నాలుగు డీఏల అరియర్స్ చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. బాకీ ఉన్న పీఆర్సీ బకాయిలు చెల్లించాలన్నారు. 12వ పే రివిజన్ కమీషన్​ను వెంటనే నియమించాలని కోరారు. సీపీఎస్​ రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని డిమాండ్​ చేశారు. అవుట్​ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు పెంచాలని కోరారు. నూతనంగా ఏర్పడిన జిల్లా కేంద్రాల్లో 16 శాతం హెచ్ఆర్ఎ ఇవ్వాలన్నారు. ఈ సంవత్సరంలో ఫిబ్రవరి 13న సీఎస్​కు అందించిన మెమోరాండంలోని డిమాండ్లను పరిష్కరించాలని కోరారు.

అన్ని క్యాడర్ల ఉద్యోగులు ఐక్యం కావాలి : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి.. ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని శ్రీకాకుళం సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ జంక్షన్ వద్ద ఏపీ జేఏసీ అమరావతి ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో పాల్గొని.. మద్దతు తెలియజేశారు. గత నాలుగు సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వం రెగ్యులర్, సీపీఎస్, కాంట్రాక్ట్, ఔట్​ సోర్సింగ్, ఉపాధ్యాయులు, కార్మికులు, స్క్రీమ్ వర్కర్లు, పెన్షనర్ల సమస్యలను పరిష్కరించటంలో తీవ్రంగా వైఫల్యం చెందిందన్నారు. ఈ నేపథ్యంలో సమస్యల పరిష్కారానికై.. అన్ని క్యాడర్ల ఉద్యోగులు ఐక్య ఉద్యమాలు నిర్వహించాలని కోరారు. అన్ని సంఘాల నాయకులందరూ ఒకే తాటిపైకి వచ్చి ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఐక్య ఉద్యమాలకు సీఐటీయూ శ్రీకాకుళం జిల్లా కమిటీ సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు.

సచివాలయ ఉద్యోగులు మానసిక ఒత్తిడికి గురవుతున్నారు : వైసీపీ ప్రభుత్వం హయాంలో సచివాలయం సిబ్బంది సైతం మానసిక ఒత్తిడికి గురవుతున్నారని ఏపీజేఏసీ అమరావతి నాయకులు కర్నూలులో అన్నారు. సచివాలయ సిబ్బంది సమస్యలు పరిష్కరించాలని కర్నూలులోని ధర్నా చౌక్ వద్ద ఏపీజేఏసీ అమరావతి ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ప్రభుత్వ ఉద్యోగులకు అందుతున్న సౌకర్యాలు సచివాలయ సిబ్బందికి వర్తింపజేయాలని ఏపీజేఏసీ అమరావతి కర్నూలు జిల్లా అధ్యక్షుడు గిరికుమార్ రెడ్డి డిమాండ్ చేశారు.

ఎన్ని విజ్ఞప్తులు చేసినా పట్టించుకోవటం లేదు: పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టరేట్ వద్ద ఏపీజేఏసీ అమరావతి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో పలు ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొన్నారు. గత 50 రోజులుగా ఏపీజేఏసీ ఆధ్వర్యంలో శాంతియుత నిరసన కార్యక్రమాలు చేపడుతుంటే.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదని నాయకుడు శ్రీరామ్ మూర్తి ప్రసాద్ ఆరోపించారు. బకాయిలు చెల్లించాలని ప్రభుత్వానికి ఎన్ని విజ్ఞప్తులు చేసినా పట్టించుకోవడంలేదని ఆరోపించారు.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.