ETV Bharat / state

'భౌ'బోయ్​ కుక్కలు.. విజయవాడలోనూ వెంటపడ్డాయి

author img

By

Published : Feb 28, 2023, 9:51 PM IST

Mad dog rampage
పిచ్చి కుక్కలు

Dogs rampage: కుక్క. చాలామంది పెంచుకునే జంతువు.. నిత్యం మన మధ్యే తిరిగే ప్రాణి. కానీ ఇప్పుడు ఆ కుక్కలంటేనే తెలుగు రాష్ట్రాల ప్రజలు భయపడుతున్న పరిస్థితి. హైదరాబాద్​లో కుక్కల దాడిలో చిన్నారి మృతి చెందడంతో.. ఇప్పుడు అందరూ భౌబోయ్​ కుక్కలంటూ పరుగులు తీస్తున్నారు. కుక్కలు కూడా అదేవిధంగా ప్రవర్తిస్తున్నాయి. ఏదో ఒకచోట జనంపై దాడులు చేస్తున్నాయి. ముఖ్యంగా చిన్న పిల్లలపై దాడి చేయడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న టెన్షన్​ అందరినీ వెంటాడుతోంది. తాజాగా విజయవాడలో ముగ్గురు చిన్నారులపై దాడికి పాల్పడ్డాయి. దీంతో మున్సిపల్​ అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్​ చేస్తున్నారు.

Dogs rampage: విజయవాడలోని భవానీపురంలో కుక్కల స్వైరవిహారం స్థానికులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. హైదరాబాద్​లో కుక్కల దాడిలో చిన్నారి మృతి చెందిన ఘటన మరువక ముందే.. విజయవాడలో ఒక్కరోజే కుక్కలు ముగ్గురు చిన్నారులపై దాడి చేశాయి. హైదరాబాద్​లో ప్రమాదం జరిగినప్పుడైనా విజయవాడలో అధికారులు మేల్కొని ఉంటే ముగ్గురు చిన్నారులు ఇప్పుడు బాధితులుగా మారేవారు కాదని పలువురు వాపోతున్నారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఇకనైనా స్పందించి కుక్కలను నియంత్రించాలని డిమాండ్ చేస్తున్నారు.

స్పందించని అధికారులు..: భవానీపురంలో పిచ్చికుక్కల దాడిలో ముగ్గురు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. కుక్కల సమస్య తీవ్రంగా ఉందని ఫిర్యాదు చేసినా అధికారుల నుంచి సరైన స్పందన లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కుక్కల వల్ల పిల్లలకు ఏదైనా పెద్ద ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నిస్తున్నారు.

బయటకు రావాలంటేనే భయం..: భవానీపురం మసీదు వీధిలో ఒకేరోజు ముగ్గురు పిల్లలపై పిచ్చికుక్కల దాడి చేయడం నగరంలో కలకలం సృష్టించింది. కుక్కల దాడిలో నజీర్, చైతన్య, జెస్సికా అనే చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. తమ ప్రాంతాల్లో పిచ్చి కుక్కల సంచారం విపరీతంగా పెరిగిందని, కుక్కలను పట్టుకోవాలని తాము అధికారులకు ఫిర్యాదు చేసినా.. సరైన స్పందన లేదని భవానీపురం వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పిచ్చికుక్కలు పెరిగిపోవడంతో బయటకు రావాలంటేనే భయంగా ఉందని వారు ఆందోళన చెందుతున్నారు.

కాపాడేవారిపైనా దాడి..: స్కూల్ నుంచి వస్తున్న సమయంలో ఒక్క కుక్క తనపై దాడికి దిగిందని బాధితుడు నజీర్ వాపోయాడు. చేతులు, కాళ్లపై విచక్షణారహితంగా దాడి చేసిందన్నాడు. తనను కాపాడేందుకు వచ్చిన వారిపై కూడా.. కుక్క దాడికి పాల్పడిందని, కిరాణ షాపు వద్ద ఉన్న వారు వచ్చి కుక్కను కొట్టడంతో వెళ్లిపోయిందని.. లేకపోతే తనను చంపేసేదని అవేదన చెందుతున్నాడు.

ఫిర్యాదును పట్టించుకోరే..: భవానీపురం ప్రాంతంలో కుక్కలు ఎక్కువగా ఉన్నాయని అధికారులకు చెప్పినా వారు పట్టించుకోలేదని బాధితుడి తండ్రి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మేయర్, కమిషనర్ ఏం చేస్తున్నారో ఆర్థం కావడం లేదని విమర్శించారు. కుక్క దాడి చేయడంతో చేతులు, కాళ్లకు గాయలయ్యాయని తెలిపారు. ఇంకా ఎక్కువ ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని నిలదీస్తున్నారు. హైదరాబాద్​లో ప్రమాదం జరిగినప్పుడైనా విజయవాడలో అధికారులు మెల్కొని ఉంటే ముగ్గురు చిన్నారులు ఇప్పుడు బాధితులుగా మారేవారు కాదని వాపోతున్నారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఇకనైనా స్పందించి కుక్కలను నియంత్రించాలని డిమాండ్ చేస్తున్నారు. జంతువులపై ప్రేమ ఉన్నావారు కుక్కలను వారి నివాసాలకు తీసుకువెళ్లి పెంచుకోవాలని సూచించారు. జంతు ప్రేమికులు కూడా పరిస్థితిని అర్ధం చేసుకోవాలని కోరారు.

చిన్నారి జెస్సికాపై రెండు కుక్కలు దాడి ..: తాము చూస్తుండగానే పిల్లలపై కుక్కలు దాడి చేశాయని ప్రత్యక్ష సాక్షులు చెపుతున్నారు. చిన్నారి జెస్సికాపై రెండు కుక్కలు దాడి చేస్తుంటే తాము వచ్చి కుక్కలను అడ్డుకోవడం జరిగిందని తెలిపారు. తాము వచ్చే కొద్ది క్షణాల సమయంలోనే జెస్సికా మెడ, చేతులు, కాళ్లపై కుక్కలు గాయాలు చేశాయని అవేదన వ్యక్తం చేశారు. కుక్కల సమస్య అధికంగా ఉందని అధికారులకు చెప్పినా సరిగా పట్టించుకోలేదని మండిపడుతున్నారు. ఏదైనా సంఘటన జరిగినప్పుడు అధికారులు వచ్చి హడావుడి చేయడం తప్ప పరిష్కరం మాత్రం చూడటం లేదని స్థానికుడైన ఆంజనేయులు అంటున్నారు.

శాశ్వత పరిష్కారం చూపాలి..: నగర పాలక సంస్థ అధికారులు స్పందించి నగరంలో కుక్కల బెడదను నివారించాలని నగర వాసులు కోరుతున్నారు. ఒక ప్రాంతంలో కుక్కలను పట్టుకుని మరోక ప్రాంతంలో వదిలేయకుండా శాశ్వత పరిష్కరం చూపాలని స్థానిక మహిళ కృష్ణవేణి కోరుతున్నారు.

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.