రాజకీయ మనుగడ కోసం చంద్రబాబును విమర్శిస్తే ఊరుకోం: టీడీపీ నేతలు

author img

By ETV Bharat Andhra Pradesh Desk

Published : Jan 10, 2024, 8:34 PM IST

tdp_on_kesineni

TDP Leaders Fires on Kesineni Nani: సీఎం జగన్​తో కేశినేని నాని భేటీ అవడంపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేశినేని వెళ్లి జగన్ కాళ్లు పట్టుకోవటంతో అతనో వైసీపీ కోవర్ట్ అని స్పష్టమైందని టీడీపీ నేతలు ధ్వజమెత్తారు. రాజకీయ మనుగడ కోసం జగన్​ని కలిసి చంద్రబాబుని విమర్శిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.

TDP Leaders Fires on Kesineni Nani: కేశినేని నాని జగన్​ భేటీపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిన్నింటి వాసాలు లెక్కపెట్టే, వ్యక్తిత్వం లేని వ్యక్తి కేశినేని నాని అని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న ధ్వజమెత్తారు. చంద్రబాబు రెండుసార్లు ఎంపీ సీటిచ్చి గెలిపిస్తే, ఆయన్నే మోసగించాడని దుయ్యబట్టారు. కేశినేని భవనానికి అనుకుని ఉన్న నాగయ్య స్థలాన్ని కబ్జా చేద్దామని చూస్తే తప్పని చెప్పిన చంద్రబాబు శత్రువు అయ్యాడా అని నిలదీశారు. కేశినేని నానికి వ్యతిరేకంగా మాట్లాడమని చంద్రబాబు ఎప్పుడూ తనకు చెప్పలేదని తన కుటుంబసభ్యులపై ప్రమాణం చేసి చెప్తున్నానన్న బుద్దా వెంకన్న, చంద్రబాబు తనతో మాట్లాడించారని కేశినేని ఆయన కుమార్తెపై కనకదుర్గమ్మ సన్నిధిలో ప్రమాణం చేయగలడా అని ప్రశ్నించారు.

సీఎం జగన్‌ను కలిసిన ఎంపీ కేశినేని నాని - రాజకీయ వర్గాల్లో చర్చ

ఒకసారి కేశినేని నాని గురించి మాట్లాడానని తనను చంద్రబాబు మందలించారని కూడా తెలిపారు. రాజకీయ మనుగడ కోసం జగన్​ని కలిసి చంద్రబాబుని విమర్శిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. కేశినేని నాని వైసీపీ కోవర్ట్ అని ఇవాళ జగన్ కాళ్లు పట్టుకోవటంతో స్పష్టమైందని బుద్దా వెంకన్న అన్నారు. స్వతంత్ర అభ్యర్థిగా 2లక్షల ఓట్ల మెజారిటీతో గెలుస్తానని బీరాలు పలికిన వాడు ఇప్పుడెందుకు జగన్​ని కలిశాడని నిలదీశారు. స్వతంత్ర అభ్యర్థిగా కేశినేని నాని పోటీ చేసి గెలిస్తే తన బుద్దా భవన్ కేశినేని నానికి రాసిస్తా, ఓడితే కేశినేని భవన్ ఇస్తావా అని సవాల్‌ విసిరారు. బీసీలు సంపాదిస్తే అక్రమార్జనా, కేశినేని నాని సంపాదిస్తే సక్రమార్జనా అని ప్రశ్నించారు. 90ల్లోనే దుర్గ గుడి మీద షాపుల కోసం 1.15 కోట్లు కట్టానని బుద్దా వెంకన్న తెలిపారు.

టికెట్ ఇవ్వకపోయినా అధినేత ఆదేశాలు తప్పకుండా పాటిస్తా: టీడీపీ ఎంపీ కేశినేని నాని

తనతో రావాలని ముఖ్య నేతలకు కేశినేని ఫోన్లు: కేశినేని నానితో కలిసి రావాల్సిందిగా వివిధ నియోజకవర్గాల్లోని తన అనుచరులకు ఫోన్లు చేయగా నానితో వెళ్లేందుకు తెలుగుదేశం నేతలు నిరాకరించారు. విజయవాడ పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లోని ముఖ్య నేతలకు కేశినేని ఫోన్లు చేసారు. మైలవరం తెలుగుదేశం నేత బొమ్మసాని సుబ్బారావుతో సహా వివిధ నేతలకు కేశినేని ఫోన్లు చేయగా తెలుగుదేశం వీడి వచ్చేదే లేదంటూ వారు కేశినేనికి చెప్పారు. జగన్ ఇంటి గడప తొక్కాక కేశినేనిని కలిసేదే లేదని బొమ్మసాని తేల్చి చెప్పారు. లోకేశ్​ వద్దకు వెళ్లి తాను తెలుగుదేశంలోనే ఉంటానని బొమ్మసాని సుబ్బారావు స్పష్టం చేసారు. రాష్ట్ర కార్యదర్శి గన్నే ప్రసాద్ కూడా లోకేశ్​ని కలిసి తాను తెలుగుదేశంలో ఉంటున్నానని స్పష్టం చేసారు.

రోడ్డు ప్రారంభోత్సవంలో టీడీపీ ఎంపీ, వైసీపీ ఎమ్మెల్యే - మారుమ్రోగిన ఇరు పార్టీల నినాదాలు

ఫ్లెక్సీలపై కేశినేని చిత్రపటం తొలగింపు: విజయవాడ ఎంపీ కేశినేని నాని సీఎం జగన్ మోహన్ రెడ్డిని కలిసి ఆ పార్టీలో చేరనున్నట్లు ప్రకటించడంతో తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో కంచికచర్ల తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద ఉన్న ఫ్లెక్సీలపై ఎంపీ కేశినేని నాని చిత్రపటాన్ని తొలగించారు. అదేవిధంగా నాని ఉన్న ప్లెక్సీని పూర్తిగా తీసేశారు. చంద్రబాబు, లోకేశ్​పై విమర్శలు చేయటాన్ని వారు ఖండించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.