తడిసిన ధాన్యం.. ఆందోళనలో రైతులు.. ప్రభుత్వ భరోసా కోసం ఎదురు చూపులు

author img

By

Published : Dec 13, 2022, 8:43 AM IST

Paddy Farmers

Rain Soaked Paddy : మాండౌస్‌ తుపాన్ వరి రైతులను నట్టేట ముంచింది. కోత సమయంలో కురిసిన అకాల వర్షాలకు అన్నదాతలు కోలుకోలేని దెబ్బతిన్నారు. ఓ వైపు తడిచిన ధాన్యాన్ని ఆరబెట్టుకోవడం.. మరోవైపు కోతకు రాకుండానే పొలంలో వాలిపోయిన పంటను కాపాడుకునేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం తమను ఉదారంగా ఆదుకోకపోతే.. సాగు ఆపేయడమే తమ ముందు కనిపిస్తున్న మార్గమని తేల్చిచెబుతున్నారు.

Rain Soaked Paddy : ఖరీఫ్ సీజన్‌లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఐదున్నర లక్షల ఎకరాల్లో వరి పండించారు. అధిక శాతం రైతులు పంట చేతికి రాగానే మాసూళ్లు చేసి, ధాన్యాన్ని అమ్మేసుకున్నారు. ఆలస్యంగా నాట్లు వేసిన రైతులు పంట మాసూళ్లు చేసి ధాన్యం ఆరబెట్టిన సమయంలో తుపాను వచ్చింది. ఆ ప్రభావంతో కురిసిన అకాల వర్షంతో ఇక్కట్లపాలయ్యారు. మొలకలు వచ్చిన ధాన్యాన్ని వేరుచేసి మిగిలిన దాన్ని కాపాడుకునే ప్రయత్నంలో నిమగ్నయ్యారు. బస్తాల్లో తడిసిన ధాన్యాన్ని వేరే బస్తాల్లోనికి మార్చి తడిసిన ధాన్యాన్ని ఆరబెడుతున్నారు.

పంట చేతికి అందుతున్న సమయంలో వర్షం కురిసిందని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. తిరిగి ధాన్యం ఆరబోయడానికి ఇతర ఖర్చులకు ఐదు వేల రూపాయలు వరకూ ఖర్చు పెట్టాల్సి వచ్చిందని చెబుతున్నారు. మొలకలు వచ్చిన ధాన్యం ఎకరానికి నాలుగు నుంచి ఐదు బస్తాలు పోతుందని.. కనీసం పెట్టుబడిన మొత్తం కూడా వచ్చేలా లేదని చెబుతున్నారు.

"మూడేకరాలు వరి పండించాను. వర్షానికి ధాన్యం తడిసిపోయింది. ఒక ఎకరం నీటిలో ఉండిపోయింది. ధాన్యం తేమ శాతం ఉండకూడదని అధికారులు అంటున్నారు. తడిసిన ధాన్యం తేమ శాతం ఎలా తక్కువగా వస్తుంది." -రైతు

ఓ వైపు ధాన్యం తడిసిపోయి తాము బాధపడుతుంటే తేమ శాతం చూడాల్సిందేనంటూ అధికారులు చెబుతున్నారని రైతులు వాపోతున్నారు. పైగా తమ దగ్గర కొనేటప్పుడు ఉన్న తేమ శాతానికి.. మిల్లుకి వెళ్లిన ధాన్యంలో చూపిస్తున్న తేమ శాతానికి వ్యత్యాసం ఉంటుందని.. ఫలితంగా అధికంగా నష్టపోతున్నామని రైతులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.

కోనసీమ ప్రాంతంలో రైతులు ధాన్యం రాశులపై బరకాలు తొలగించి ఆరబెడుతున్నారు. తేమ పోగొట్టేందుకు కల్లాల్లో ఆరబోస్తున్నారు. మళ్లీ వర్షం వస్తుందేమోనని ఆందోళన చెందుతున్నామంటున్న రైతులు తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి డబ్బులు త్వరగా ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

మాండౌస్‌ తుపాను ఉమ్మడి గుంటూరు జిల్లా రైతులపై తీవ్ర ప్రభావం చూపింది. ప్రధానంగా వరి రైతుల్ని వర్షాలు తీవ్రంగా దెబ్బతీశాయి. హడావుడిగా పంటలు కోసి నూర్పిడి చేసుకున్న రైతులు ఎలాగోలా గట్టెక్కారు. పొలంలో పంట ఉంచిన రైతులు మాత్రం మునిగారు. పొలాల్లో నీటిని బయటకు పంపేందుకు రైతులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. నీరు బయటకు వెళ్తే నూర్పిడులు చేపట్టి తడిసిన ధాన్యమైనా ఇంటికి చేర్చుకుని అమ్ముకోవాలని రైతులు భావిస్తున్నారు. మరికొన్నిచోట్ల పంట కోతకు రాలేదని అలాగే ఉంచగా.. అది ఈదురు గాలులకు ఒరిగిపోయింది. ముందస్తుగా కోతలు చేపట్టిన రైతులు సైతం ధాన్యాన్ని ప్రైవేటు వ్యాపారులకే విక్రయించారు. ప్రభుత్వం నుంచి డబ్బులు రావటం ఆలస్యం అవుతోందని అందుకే ప్రైవేటు వ్యాపారులకు అమ్మేశామని వారు చెబుతున్నారు.

గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలోని సేకూరు,ములుకుదురు,మాచవరం, నిడుబ్రోలు, పచ్చలతాడిపర్రు గ్రామాల్లో దెబ్బతిన్న పంటలను తెదేపా నేత ధూళిపాళ్ల నరేంద్ర పరామర్శించారు. పాడైపోయిన ధాన్యాన్ని గిట్టుబాటు ధరకు ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.

కృష్ణా జిల్లా చల్లపల్లి మండలంలోని రాముడుపాలెం, పురిటిగడ్డ, మేకావారిపాలెం, పాగోలు, తదితర పంచాయతీల పరిధిలో ముంపుబారిన పడిన పొలాలను.. మండలి బుద్ధప్రసాద్ పరిశీలించారు. వైసీపీ ప్రభుత్వంలో డ్రైనేజీ తవ్వకాల్లో చేసిన అవినీతే రైతుల దుస్థితికి కారణమని ఆయన ఆరోపించారు. ఏ డ్రైన్‌ని చూసినా అస్తవ్యస్తంగా ఉన్నాయని, మట్టితో పూడిపోయి ఉన్నాయని చెప్పారు.

వర్షానికి తడిసిన వరి ధాన్యం

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.