ETV Bharat / state

విజయవాడ బస్టాండ్​లో గంజాయి బాబులు హల్‌చల్‌.. ఆరు కిలోల లిక్విడ్ గంజాయి పట్టివేత

author img

By

Published : Mar 29, 2023, 2:14 PM IST

Ganja Transportation in state: రాష్ట్రంలో గంజాయి అక్రమ రవాణా, అమ్మకాలు మూడు పువ్వులు ఆరు కాయలు అన్న విధంగా యథేచ్చగా జరుగుతుంది. అంతేకాకుండా గంజాయి మత్తులో దాడులు పెరిగిపోయాయి. సరదాలకు అలవాటుపడిన యువకులు గంజాయి రవాణాతో డబ్బు సంపాదిస్తూ.. అదే మత్తుకు బానిసలవుతున్నారు. అధిక శాతం కేసుల్లో గంజాయి ప్రేరేపిత దాడులు ఎక్కువగా ఆందోళన కలిగిస్తోంది.

Ganja Transportation in state
Ganja Transportation in state

Ganja Transportation in state: రాష్ట్రంలో గంజాయి వ్యసనపరుల ఆగడాలు శ్రుతిమించుతున్నాయి. పగలూ, రాత్రీ తేడా లేకుండా గంజాయి, మాదకద్రవ్యాలు సేవిస్తూ... ప్రజలకు ఇబ్బందులు సృష్టిస్తున్నారు. విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్‌స్టేషన్‌లో గంజాయిబాబులు హల్‌చల్‌ చేయడం కలకలం రేపింది. గంజాయి మత్తులో తూలుతూ ముగ్గురు వ్యక్తులు పరస్పరం దాడులకు దిగారు. వీరి ప్రవర్తనతో ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. ప్రయాణికుల ఫిర్యాదుతో అప్రమత్తమైన ఆర్టీసీ భద్రత సిబ్బంది... గంజాయి సేవించిన ముగ్గురిని పట్టుకున్నారు. బస్టాండ్‌తోపాటు పరిసర ప్రాంతాల్లో... ఇటీవల గంజాయి, మాదకద్రవ్యాల వినియోగం విపరీతంగా పెరుగుతోందని.. ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నివారణ చర్యలు చేపట్టాలని పోలీసులను కోరుతున్నారు.

విజయవాడలో బస్టాండ్​లో గంజాయి బాబులు హల్‌చల్‌.. ఆరు కిలోల లిక్విడ్ గంజాయి పట్టివేత

ఆరు కిలోల లిక్విడ్ గంజాయి పట్టివేత.. కొరియర్ ద్వారా రవాణా జరుగుతున్న ద్రవ రూపంలో ఉన్న గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకోవటం కలకలం రేపుతోంది. విశాఖ నుంచి కొరియర్ ద్వారా పార్శిల్ రూపంలో విజయవాడ బాలాజీనగర్​కు లిక్విడ్ గంజాయి చేరుకుంది. గంజాయి కొరియర్ ద్వారా నగరానికి వస్తుందని పక్కా సమాచారం అందటంతో పోలీసులు పార్శిల్ కొరియర్​పై నిఘా పెట్టారు. బాలాజీనగర్ డిటీడీసీ కొరియర్ సంస్థ వద్ద మాటువేసి దానిని తీసుకునేందుకు వచ్చిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఆ పార్శిల్​ను తెరిచి చూడగా ద్రవ రూపంలో ఉన్న గంజాయిని చూసి పోలీసులు విస్తుపోయారు. ఈ దందాలో కీలక వ్యక్తి ఎవరు? ఎన్ని రోజుల నుంచి ఈ అక్రమ రవాణా జరుగుతోందనే అంశంపై లోతుగా దర్యాప్తు చేపట్టారు.

ఇద్దరు నిందితులను అదుపులోనికి తీసుకున్న పోలీసులు.. మరో ఇద్దరి కోసం ప్రత్యేక బృందాన్ని విశాఖకు పంపారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న ఇద్దరిలో ఒకరు ఫైనాన్సర్ వెంకటేశ్వరరావు, మరొకరు ఆటో డ్రైవర్ ఈశ్వరరెడ్డిగా గుర్తించారు. వీరిద్దరూ రాణిగారితోట 18వ డివిజన్​లోని ఓ ఆసుపత్రి ఎదురు వీధిలో ఒకే ఇంట్లో నివాసం ఉంటున్నట్లు.. పోలీసులు తెలిపారు. నిందితులిద్దరూ సుమారు మూడు రోజుల క్రితం విశాఖ వెళ్లి అక్కడ అరుణ్ కుమార్, గౌరి అనే ఇద్దరి నుంచి గంజాయిని కొనుగోలు చేసి కొరియర్ ద్వారా పార్శిల్ చేయించుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. వీరి నుంచి ఆరు కిలోల లిక్విడ్ గంజాయిని, రెండు కిలోల సాధారణ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులిద్దరిపై ఎన్టీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. కృష్ణ లంక పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ తరహా ఘటన ఈ నెలలో ఇది రెండవది కావటం కలలకం రేపుతోంది. ఈ నెల 8వ తేదీన కాకినాడకు చెందిన ఒక యువకుడు బెంగుళూరు నుంచి సుమారు 46 గ్రాముల ఎండిఎంఏ అనే డ్రగ్​తో కృష్ణలంక పోలీసులకు పట్టుబడటంతో పోలీసులు అతడిపై నేసు నమోదు చేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.