ETV Bharat / state

Sanitation Problem in AP: ఏపీలో పడకేసిన పారిశుద్ధ్యం.. ప్రజారోగ్యంపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి..

author img

By

Published : Jul 27, 2023, 12:32 PM IST

Sanitation Problem in AP: వర్షాకాలం వచ్చిందంటే చాలు.. సీజనల్ వ్యాధులు ప్రజలపై పడగ విప్పుతాయి. అతిసారం, విష జ్వరాలతో ప్రజలు ఇబ్బందులు పడే అవకాశం ఉంది. అయినప్పటికీ ప్రజారోగ్యంపై ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వ్యవహరిస్తోంది. పారిశుద్ధ్య నిర్వహణ, శుద్ధ జలాల అందించడంపై ఆయా శాఖలు దృష్టి పెట్టడం లేదు. ఇక గ్రామాల పరిస్థితి అయితే మరింత అధ్వానంగా తయారైంది. వైసీపీ సర్కార్ హయాంలో పంచాయతీలకు నిధుల్లేక పారిశుద్ధ్యం పూర్తిగా పడకేసింది. ప్రజల ప్రాణాలు పోతున్నా ప్రభుత్వానికి మాత్రం ఏం పట్టడం లేదు.

Etv Bharat
Etv Bharat

Sanitation Problem in AP: వైసీపీ ప్రభుత్వం గద్దెనెక్కిన నాలుగేళ్ల నుంచి పారిశుద్ధ్యా‌‌న్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. దానికి కృష్ణాజిల్లా గన్నవరం మండలం తెంపల్లి గ్రామమే నిదర్శనం. గతేడాది జులై 14న ఈ గ్రామంలో అతిసారం వ్యాపించి నలుగురు ప్రాణాలు కోల్పోగా.. 150 మంది వరకు అస్వస్థతకు గురయ్యారు. మురుగు ప్రవహిస్తున్న చోటనున్న మంచినీటి పైప్‌లైన్‌ లీకవడమే దీనికి కారణం. సాధారణ పరిస్థితులు ఏర్పడేవరకు అప్పట్లో జిల్లా యంత్రాంగం పర్యవేక్షించినప్పటికీ సమస్య శాశ్వత పరిష్కారంపై దృష్టి చూపలేదు. ఫలితంగా ఏడాది తర్వాత కూడా తెంపల్లిలో పల్లపు దారులు, మురుగు కదలని కాలువలు, నీటికుంటల్లో తాగునీటి మోటార్లు దర్శనమిస్తున్నాయి. దీంతో ఈ వర్షాకాలంలో ఎలాంటి విపత్తులు తలెత్తుతాయోనని గ్రామస్థులు భయపడుతున్నారు.

ఒక్క తెంపల్లి మాత్రమే కాదు రాష్ట్రవ్యాప్తంగా పలు గ్రామాల్లో ఇలాంటి పరిస్థితులే నెలకొన్నాయి. కర్నూలులో శుభ్రం చేయని ట్యాంకుల నుంచే మంచినీరు సరఫరా చేస్తున్నారు. కుళాయిల్లో రంగు మారిన నీరు సరఫరా అవుతున్నా అధికారుల్లో చలనం లేదు. పారిశుద్ధ్య నిర్వహణ లోపాలతో శ్రీ సత్యసాయి జిల్లాలో దోమల విజృంభణ పెరిగింది. అధికారిక గణాంకాల ప్రకారం.. గత అయిదు నెలల్లోనే 95 డెంగీ, 4 మలేరియా కేసులు నమోదయ్యాయి. బాధితుల అసలు సంఖ్య వందల్లోనే ఉంటుంది. గుంటూరు జిల్లాలో ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు 57 డెంగీ కేసులను గుర్తించారు. ఇలా రోగాలకు కారణమయ్యే సమస్యలను పరిష్కరించడంపై జగన్ సర్కారు దృష్టి పెట్టలేదు.

వర్షాకాలం వ్యాధులు, ప్రజారోగ్యంపై ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోంది. పారిశుద్ధ్య నిర్వహణ, శుద్ధ జలాన్ని అందించడంపై ఆయా శాఖలు కనీసం దృష్టి చూపడం లేదు. అతిసారంతోపాటు డెంగీ, మలేరియా, టైఫాయిడ్‌లాంటి విషజ్వరాలపై ప్రజా చైతన్య కార్యక్రమాలను వైద్యశాఖ నామమాత్రంగానే చేస్తోంది. ఆసుపత్రులు, వైద్య సిబ్బంది ఈ విషయంలో అసలు చొరవ చూపడం లేదు. శాఖల మధ్య సమన్వయ లోపం వల్ల పట్టణాలు, పల్లెలనే తేడా లేకుండా వీధులు మురికి కూపాలవుతున్నాయి. కొన్ని చోట్ల ముక్కు మూసుకుని వెళ్లాల్సి వస్తోంది. చాలా చోట్ల మంచి నీటి పైపులైన్లలో మురుగు కలిసే పరిస్థితులు ఉన్నాయి. మంచి నీటి ట్యాంకులు తరుచూ శుభ్రం చేయడం లేదు. పారిశుద్ధ్య నిర్వహణకు గ్రామపంచాయతీలను నిధుల కొరత వెన్నాడుతోంది. ఆర్థిక సంఘం నిధుల మళ్లింపు, సర్పంచుల అధికారాలను పరిమితం చేయడం పారిశుద్ధ్య సమస్య పెరగడానికి ఒక కారణంగా నిలుస్తోంది. రాష్ట్రంలో సగానికి పైగా మైనర్‌ పంచాయతీలు చిన్నచిన్న పనులు, పారిశుద్ధ్య నిర్వహణకు ఆర్థిక సంఘం నిధులపైనే ఆధారపడతాయి. నిధుల్లేక అవి దిక్కులు చూడాల్సి వస్తోంది.

ఆశా కార్యకర్తలు, ఏఎన్​ఎమ్​లు చెత్త, మురుగు ఉన్న ఫొటోలను సెల్‌ఫోన్లలో తీసి యాప్‌ ద్వారా పంపిస్తే పంచాయతీ సిబ్బంది శుభ్రపరచాలి. బాగయ్యాక చిత్రాలను తిరిగి యాప్‌లో పెట్టాలి. కానీ సమన్వయ లోపంతో ఈ ప్రక్రియ నామమాత్రంగా మారింది. ఒకే ప్రాంతం నుంచి వస్తున్న రోగులను గుర్తించి ఆ ప్రాంతాల్లో లార్వా నిర్మూలన, వైద్య శిబిరాలను నిర్వహణ వంటి వాటిపై వైద్య యంత్రాంగం శ్రద్ధ చూపడం లేదు. కేసులు భారీగా పెరిగితేనే దృష్టి పెడుతున్నారు తప్ప ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా 52 కేంద్రాల్లో డెంగీ నిర్దారణ పరీక్షలు చేస్తున్నారు. ఈ కేంద్రాలు దూరంగా ఉండటంతో గ్రామీణ ప్రాంతాలకు సేవలందడం లేదు. మలేరియా, ర్యాపిడ్ కిట్లను ఆరోగ్య ఉపకేంద్రాల స్థాయిలోనే అందుబాటులో ఉంచాలి. కిందటేడాది కంటే ఈసారి కిట్లను క్షేత్రస్థాయి వరకు అందుబాటులో ఉంచినందునే పరీక్షలు పెరిగి కేసులు బయటపడుతున్నాయని రాష్ట్ర ప్రజారోగ్య శాఖ సంచాలకులు డాక్టర్ రామిరెడ్డి తెలిపారు. రాష్ట్రంలో ఈ ఏడాది జనవరి నుంచి జులై 16వ తేదీ వరకు 2వేల 498 డెంగీ, 2 వేల 1 మలేరియా కేసులు నమోదయ్యాయి. జనవరి నుంచి జూన్‌ వరకు 14 వేల 473 టైఫాయిడ్‌ కేసులు, 26వేల 754 డయేరియా కేసులు వెలుగుచూశాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.