IMD issues Orange Alert in Coastal Andhra: కోస్తాంధ్రకు ఆరెంజ్ హెచ్చరిక.. రెండ్రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం
Published: Sep 4, 2023, 9:04 PM


IMD issues Orange Alert in Coastal Andhra: కోస్తాంధ్రకు ఆరెంజ్ హెచ్చరిక.. రెండ్రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం
Published: Sep 4, 2023, 9:04 PM

IMD Has Released a Bulletin on The Rains Across The State: కోస్తాంధ్రలో నేడు, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది. దీంతో కోస్తాంధ్ర, యానాంకు.. ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసినట్లు వెల్లడించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తూ..రాబోయే వర్షాలకు సంబంధించి.. ఓ ప్రకటన విడుదల చేసింది.
IMD issues Orange Alert in Coastal Andhra: రాష్ట్రవ్యాప్తంగా గత రెండు రోజులుగా ఏకధాటిగా వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. ఈ వర్షాల కారణంగా ఆయా ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ క్రమంలో ఇంకెన్ని రోజులు ఈ వర్షాలు కురవనున్నాయి..? ఏయే జిల్లాలో భారీ నుంచి అతి భారీగా వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి..? అనే వివరాలకు సంబంధించి.. వాతావరణ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది.
Two Days Rains: ఆ ప్రకటన ప్రకారం.. కోస్తాంధ్రలో నేడు, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. కోస్తాంధ్ర, యానాంకు.. ఐఎండీ (IMD) ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసినట్లు పేర్కొంది. కోస్తాంధ్రలో 11.56 సెంటీమీటర్ల నుంచి 20.44 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే సూచనలున్నాయని వివరించింది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. దీంతోపాటు రెండు రోజులుగా కురుస్తున్న కారణంగా పలు జిల్లాలో నెలకొన్న పరిస్థితులను వాతావరణ శాఖ వెల్లడించింది.
Anantapur District Weather Update: అనంతపురం జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. తాడిపత్రి, పుట్లూరు మండలాల్లో కురిసిన భారీ వర్షానికి వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. వర్షాల కోసం ఇంతకాలం ఎదురుచూసిన రైతులకు ఇది ఉపశమనం కలిగించింది. వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో.. పంటలకు సకాలంలో నీరు అందుతుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరికొన్ని చోట్ల పంటలు నీట మునగడంతో.. నష్టం వాటిల్లే పరిస్థితి ఏర్పడింది. కొన్ని గ్రామాల్లో రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి.
Kurnool District Weather Update.. కర్నూలులో సోమవారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు.. రహదారులు జలమయమయ్యాయి. వర్షం కారణంగా రాయలసీమ జోన్ ఎస్సై అభ్యర్థుల దేహదారుఢ్య పరీక్షలను వాయిదా వేసినట్లు.. కర్నూలు రేంజ్ డీఐజీ సెంథిల్ కుమార్ ప్రకటించారు. ఈ నెల 21న తిరిగి నిర్వహిస్తామని తెలిపారు.
YSR District Weather Update.. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో వైయస్సార్ జిల్లాలో కుందూ నదిలో వరద ఉద్ధృతి కొనసాగుతోంది. కర్నూలు, నంద్యాల సహా వైయస్సార్ జిల్లాలోని ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల ప్రభావంతో.. కుందూనదిలో వరద ఉరకలు వేస్తోంది. నంద్యాల, వైయస్సార్ జిల్లాల సరిహద్దులోని రాజోలు ఆనకట్ట వద్ద ఆదివారం సాయంత్రానికి వరద 33 వేల క్యూసెక్కులకు చేరింది. నదిలో వరద ప్రవాహం క్రమంగా తగ్గుతోందని అధికారులు తెలిపారు.
Prakasam District Weather Update.. ప్రకాశం జిల్లా గిద్దలూరులో రెండు రోజుల నుంచి ఏకధాటిగా వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం సుమారు 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవగా.. సోమవారం తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేని వర్షం కురిసింది. ఆగస్టులో తీవ్ర ఉక్కపోతతో అల్లాడిపోయిన ప్రజలకు ఉపశమనం దక్కింది. పంటలు కూడా ఎండిపోతున్నాయని బాధపడుతున్న రైతులు.. వర్షాలతో తిరిగి పుంజుకోవచ్చని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు వర్షాల ధాటికి గిద్దలూరులోని ప్రభుత్వ కార్యాలయాలు, కూరగాయల మార్కెట్, ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి పెద్ద ఎత్తున నీరు చేరింది. మురుగునీరు రోడ్లపై ప్రవహిస్తుండటంతో.. దుర్వాసన వ్యాపించి ప్రజలకు ఇబ్బందిగా మారింది. ఎక్కడికక్కడ డ్రైనేజీ పనులు పెండింగులో ఉంచడం వల్లే.. వర్షాలు పడ్డప్పుడల్లా అవస్థలు తప్పడం లేదని స్థానికులు వాపోతున్నారు.
