ETV Bharat / state

ఐదో ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేశాము.. హైకోర్టుకు నివేదించిన రాష్ట్ర ప్రభుత్వం

author img

By

Published : Mar 21, 2023, 10:34 AM IST

AP Finance Commission : రాష్ట్ర ఐదో ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు సూచించింది. ఇందుకు సంబంధించిన వివరాలను ప్రభుత్వ తరఫున న్యాయవాది కోర్టు ముందు ఉంచారు. అయితే గతంలో ఐదవ ఆర్థిక సంఘం ఏర్పాటును కోరుతూ.. టీడీపీ హైకోర్టును ఆశ్రయించింది.

AP State Fifth Finance Commission
ఏపీ ఐదో ఆర్థిక సంఘం

AP State Fifth Finance Commission: రాష్ట్ర ఐదో ఆర్థిక సంఘాన్ని మూడేళ్ల కాలానికి ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. ఇందుకు సంబంధించిన జీవోను జారీచేసినట్లు కోర్టుకు వివరించింది. ఛైర్‌పర్సన్, మరో నలుగురు సభ్యుల వివరాలను ప్రభుత్వ న్యాయవాది శ్రేయాస్‌రెడ్డి మెమో రూపంలో కోర్టు ముందు ఉంచారు. శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం పూర్వ ఉపకులపతి ప్రొఫెసర్‌ రత్నకుమారిని ఛైర్మన్‌గా నియమించినట్లు మెమోలో తెలిపారు. విశాఖ ఏయూ విశ్వవిద్యాలయం విశ్రాంత రెక్టార్‌ ప్రొఫెసర్‌ ఎం ప్రసాదరావు, విజయవాడ పీబీ సిద్ధార్థ ఆర్ట్స్ అండ్​ సైన్స్‌ కళాశాల విశ్రాంత ప్రిన్సిపల్‌ ప్రొఫెసర్‌ ఎంవీఎన్‌ పద్మారావు, పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ప్రకాశం జిల్లా పూర్వ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ కాకి కృపారావులను సభ్యులుగా, గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ప్రస్తుత డైరెక్టర్, శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం విశ్రాంత ప్రొఫెసర్‌ డాక్టర్‌ కేవీ రమణారెడ్డిని సభ్య కార్యదర్శిగా నియమించినట్లు వివరించారు.

ఈ మేరకు గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ నోటిఫికేషన్‌ జారీ చేసిన వివరాలను ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు అందించారు. పిటిషనర్‌ తరఫు న్యాయవాది పీవీజీ ఉమేశ్‌ చంద్ర స్పందిస్తూ.. కమిషన్​ను ఏర్పాటు చేసిన నేపథ్యంలో.. ప్రభుత్వం కోర్టు ముందు ఉంచిన వివరాలను నమోదు చేసి వ్యాజ్యంపై విచారణను ముగించాలని కోరారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర, జస్టిస్‌ ఆర్‌ రఘునందన్‌ రావుతో కూడిన ధర్మాసనం.. వివరాలను నమోదు చేసి విచారణను ముగించింది.

ఫైనాన్స్‌ కమిషన్​ ఏర్పాటుకు హైకోర్టులో టీడీపీ : స్టేట్‌ ఫైనాన్స్‌ కమిషన్​ను ఏర్పాటు చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ టీడీపీ అధికార ప్రతినిధి జీవీ రెడ్డి గతంలో హైకోర్టులో పిల్‌ దాఖలు చేశారు. రాష్ట్రంలో నాలుగో ఫైనాన్స్ కమిషన్‌ కాల పరిమితి 2020తో ముగిసిందని అందులో గుర్తు చేశారు. ఇప్పటి వరకు ఐదో ఫైనాన్స్‌ కమిషన్​ను ఏర్పాటు చేయలేదని అప్పుడు కోర్టు ముందు ఉంచారు. కమిషన్‌ ఏర్పాటు చేయకపోవడం వల్ల.. స్థానిక సంస్థల నిధులను శాస్త్రీయ కోణంలో పంపిణీ చేయడం లేదని ఆరోపించారు.

భారత రాజ్యాంగంలోని అధికరణ 243(ఐ) ప్రకారం ప్రతి రాష్ట్రానికి ఆర్థిక సంఘం ఉండాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఇటీవలే ఈ వ్యాజ్యంపై విచారణ సందర్భంగా.. కమిషన్‌ ఏర్పాటుకు సంబంధించిన ఫైల్‌ పరిశీలనలో ఉందని త్వరలో ఏర్పాటు చేస్తామని ప్రభుత్వ న్యాయవాది హైకోర్టుకు నివేదించారు. ఈ వ్యవహారం ప్రస్తుతం గవర్నర్‌ పరిధిలో ఉన్నందున విచారణను నాలుగు వారాలకు వాయిదా వేస్తున్నట్లు అప్పుడు కోర్టు ప్రకటించింది. కమిషన్‌ ఏర్పాటుపై పురోగతిని తదుపరి విచారణలో తెలియజేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి హై కోర్టు సూచించింది.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.