ETV Bharat / state

Crops Submerged in Flood కాల్వలను గాలికి వదిలేశారు.. పంటను వర్షాలకు వదిలేయాల్సి వచ్చింది!

author img

By

Published : Jul 29, 2023, 1:44 PM IST

Crops Submerged in Flood Water: కుండపోత వర్షాలతో రైతులు అల్లాడిపోతున్నారు. జిల్లావ్యాప్తంగా పలు మండలాల్లో వేల ఎకరాలకు పైగా పొలాలు నీట మునిగాయి. వరదని పొలాల నుంచి కొల్లేరులోకి పంపే నిర్వహణను ఏళ్ల తరబడి గాలికి వదిలేయడంతో.. ఏటా వర్షాల కారణంగా ఇలా నష్టపోతున్నామని రైతులు వాపోతున్నారు.

Etv Bharat
Etv Bharat

Crops Submerged in Flood Water: ఓ వైపు వర్షం.. మరోవైపు వరద.. వెరసి అన్నదాత వెన్నువిరుస్తున్నాయి. నాట్లు వేసి నాలుగు వారాలైనా గడవకముందే పంట నామరూపాల్లేకుండా పోయాయి. దీంతో రైతులు దిక్కుతోచని స్థితిలో లబోదిబోమంటున్నారు. వరదని పొలాల నుంచి కొల్లేరులోకి పంపే నిర్వహణ ఏళ్ల తరబడి గాలికి వదిలేయడంతో.. ఏటా వర్షాల కారణంగా ఇలా వందల మంది రైతులు నష్టపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు దీనిపై స్పందించి.. కాలువలు బాగు చేసి తమ బతుకులు మార్చాలని వేడుకుంటున్నారు.

ఏలూరు జిల్లా వ్యాప్తంగా కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, ఎగువ నుంచి వస్తున్న వరద ఉద్ధృతికి జిల్లాలో సుమారు 13 మండలాల్లో పంట పొలాలు నీట మునిగాయి. ప్రస్తుత ఖరీఫ్ సీజన్​లో ఇప్పటి వరకు 92 వేల 300 ఎకరాల్లో వరినాట్లు వేయగా.. 30 వేలకు పైగా ఎకరాల్లో వరి పైరుని వరద ముంచెత్తింది. ముదినేపల్లి మండలంలో 13,700 ఎకరాలకు గాను 95 శాతం వరి పంట ముంపు బారిన పడింది. మండవల్లి మండలం లింగాల, పెరికిగూడెం, అయ్యవారిరుద్రవరాల్లో పొలాలు పాక్షికంగా నీట మునగగా.. నాలుగు మండలాల్లో కలిపి దాదాపు 17 వేల ఎకరాల్లో పంట నీట మునిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.

వరద ముంపు సమయాల్లో పొలాల్లో నిలిచిన నీటిని కాలువలు ఉన్నా.. వాటి నిర్వహణ లేకపోవడంతో.. కిక్కిస, జమ్ము, తూడు, గుర్రపుడెక్క పెరిగిపోయి నీరు దిగువకు వెళ్లే అవకాశం లేక పొలాలు ముంపునకు గురవుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేల రూపాయలు పెట్టుబడులు పెట్టి నాట్లు వేశామని.. వర్షాకాలానికి ముందే కాలువలు శుభ్రం చేయాల్సి ఉన్నా.. అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఏటా తాము బలవుతున్నామని రైతులు వాపోతున్నారు.

కళ్లముందే వరి నాట్లు నీటిలో నాని పాచిపోవడం చూసి రైతులు గుండెలు బాదుకుంటున్నారు. ఎన్నో ఆశలతో అప్పులు తెచ్చి పంటమీద పెడితే.. వర్షం వరద రూపంలో కన్నీటిని మిగిల్చిందని అన్నదాతలు ఆక్రోశిస్తున్నారు. ఇప్పటికైనా డ్రెయిన్లలో పూడిక తీసి, మురుగు కాలువలు బాగు చేయాలని లేని పక్షంలో.. పూర్తిగా పంట నష్టపోయి రోడ్డున పడే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

"వరద ముంపు సమయాల్లో పొలాల్లో నిలిచిన నీటిని కాలువలు ఉన్నా.. వాటి నిర్వహణ లేకపోవడంతో.. కిక్కిస, జమ్ము, తూడు, గుర్రపుడెక్క పెరిగిపోయి నీరు దిగువకు వెళ్లే అవకాశం లేక పొలాలు ముంపునకు గురవుతున్నాయి. వేల రూపాయలు పెట్టుబడులు పెట్టి నాట్లు వేశాము. వర్షాకాలానికి ముందే కాలువలు శుభ్రం చేయాల్సి ఉన్నా.. అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఏటా మేము బలవుతున్నాము. అధికారులు దీనిపై స్పందించి.. కాలువలు బాగు చేసి మా బతుకులు మార్చాలని వేడుకుంటున్నాము." - రైతుల ఆవేదన

కుండపోత వర్షాలతో అల్లాడుతున్న అన్నదాత
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.