ETV Bharat / state

భార్యను బీరు సీసాలతో పొడిచిన భర్త.. ఆవు పొలంలో దిగిందని దాడి

author img

By

Published : Mar 27, 2023, 3:15 PM IST

crimes and accidents
crimes and accidents

Crimes and Accidents: భార్య కాపురానికి రావట్లేదని.. బీరు సీసాలతో పొడిచి దాడి చేశాడు ఓ భర్త. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆమెను ఆసుపత్రికి తరలించారు. మరోచోట.. కారు బీభత్సం సృష్టించింది. టీ దుకాణంలోకి దూసుకెళ్లడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఇలా వివిధ ప్రమాదాలలో ముగ్గురు మృతి చెందారు.

Crimes and Accidents: ఎన్టీఆర్ జిల్లా నందిగామలో అమానుష ఘటన జరిగింది. భార్యను బీరు సీసాలతో పొడిచి హత్యాయత్నం చేశాడు ఓ భర్త. ఈ ప్రమాదంలో భార్య పరిస్థితి విషమంగా ఉండటంతో విజయవాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. నందిగామ బీసీ కాలనీకి చెందిన శ్రీలక్ష్మీకి 11 ఏళ్ల క్రితం పల్లపు ఆంజనేయులుతో వివాహం జరిగింది. పెళ్లైనప్పటి నుంచి తరచూ మద్యం సేవించి ఆంజనేయులు వేధిస్తుండటంతో.. శ్రీలక్ష్మీ కొంతకాలంగా అతనికి దూరంగా ఉంటుంది. స్థానిక బీసీ కాలనీలో ఇద్దరు మగ పిల్లలతో కలిసి అద్దెకు ఉంటుంది. భార్యాభర్తల మధ్య గతంలో అనేకసార్లు గొడవలు జరిగాయి.. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు కూడా చేసుకున్నారు.

కాగా శ్రీలక్ష్మి కాపురానికి రావట్లేదని.. తనతో దూరంగా ఉంటుందని ఉదయాన్నే బీసీ కాలనీకి ఆంజనేయులు వచ్చాడు. భర్త మాటలు విన్న శ్రీలక్ష్మి భయంతో లోపల ఉండిపోయింది. కొద్ది సేపటికి భర్త మాటలు వినపడకపోవడంతో వెళ్లిపోయాడని భావించి బయటికి వచ్చింది. వెంటనే ఆంజనేయులు రెండు బీరు సీసాలతో శ్రీలక్ష్మీపై దాడి చేశాడు. ఎక్కడపడితే అక్కడ బీరు సీసాలతో పొడవడంతో శ్రీలక్ష్మీకి తీవ్ర గాయాలయ్యాయి. శ్రీలక్ష్మీని నందిగామ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం విజయవాడకు తరలించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

బొలెరో బోల్తా: అనంతపురం జిల్లా నార్పల మండలం బొమ్మకుంటపల్లి గ్రామ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపు తప్పి బొలెరో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో సురేంద్ర (23), దిలీప్ (18) అనే ఇద్దరు మృతి చెందగా.. నలుగురికి గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. దిలీప్ అనే వ్యక్తి పుట్టినరోజు సందర్భంగా పార్టీ చేసుకొని తిరిగి వస్తున్న సమయంలో ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదానికి అతి వేగమే కారణమని పేర్కొన్నారు.

కారు బీభత్సం: మితిమీరిన వేగం వలన ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. దేవరాపల్లి జాతీయ రహదారిపై వేగంగా వచ్చిన కారు.. ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టి.. కొంత దూరం ఈడ్చుకొని వెళ్లింది. అనంతరం పక్కనే ఉన్న టీ దుకాణంలోకి దూసుకువెళ్లింది. ఈ ఘటనలో అప్పలనాయుడు అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాన్ని పోస్ట్​మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో దుకాణం పూర్తిగా ధ్వంసం కాగా.. అందులోని ముగ్గురు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. కారులోని వ్యక్తి ప్రమాదం నుంచి సురక్షితంగా బయట పడగా.. అతనిని పోలీస్ స్టేషన్​కి తరలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఆవు పొలంలో దిగిందని.. దాడి: చిత్తూరు జిల్లా గంగవరం మండలంలోని చిన్నూరు గ్రామంలో అమానుష ఘటన జరిగింది. ఆవు తన పొలంలో మేతకు దిగిందని.. అశోక్ కుమార్ అనే వ్యక్తిపై దాడి చేశారు. అశోక్ కుమార్ తల్లి రాధమ్మ పొలానికి ఆవుని తీసుకొని వెళ్లింది. ఆవు భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి పొలంలో మేతకు వెళ్లడంతో గొడవ మొదలైంది. దీనిపై రాధమ్మను భాస్కర్ రెడ్డి దుర్భాషలాడాడు. దీనిపై స్పందించిన అశోక్ కుమర్.. దుర్భాషలాడొద్దు అని చెప్పాడు. అయినా సరే వినిపించుకోకుండా.. తనపై దాడి చేశారని అశోక్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు.

రోడ్డంతా పెయింట్ మయం: బాపట్ల జిల్లా జె. పంగులూరు మండలం రేణింగవరం వద్ద జాతీయ రహదారిపై ఓ లారీ బోల్తా పడింది. డివైడర్​ను ఢీకొని లారీ బోల్తా పడినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. లారీ కంటైనర్ బోల్తా పడటంతో లోపల ఉన్న పెయింట్ డబ్బాలు పగిలి.. రోడ్డు మొత్తం పెయింట్ మయం అయింది. రోడ్డుపైన పడిన లారీని క్రేన్ సహాయంతో పక్కకు జరిపి ట్రాఫిక్​కు అంతరాయం లేకుండా చేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.