ETV Bharat / state

‘జయహో బీసీ’ సభలో సీఎం జగన్‌..నా వెనుక ఆ నలుగురున్నారు..

author img

By

Published : Dec 8, 2022, 7:13 AM IST

Updated : Dec 8, 2022, 11:01 AM IST

Chief Minister Jagan in 'Jayaho BC' meeting: వైసీపీ నిర్వహించిన ‘జయహో బీసీ’ సభలో ముఖ్యమంత్రి జగన్‌... పదే పదే ‘నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ, నా మైనారిటీ’ అని పలుసార్లు నొక్కిచెబుతూ ప్రసంగించారు. అదంతా వింటే రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు నిజంగానే సర్వాధికారాలు, సాధికారత వచ్చేశాయని అనిపించడం సహజం. కానీ... తరచి చూస్తే వాస్తవ పరిస్థితులు అందుకు పూర్తి భిన్నంగా కనిపిస్తాయి.

CM Jagan in Jayaho BC
జయహో బీసీ సభలో సీఎం జగన్‌

Chief Minister Jagan in 'Jayaho BC' meeting: విజయవాడలో నిర్వహించిన బీసీ సదస్సులో సీఎం జగన్‌...ప్రసంగం చూస్తే..మంత్రిమండలిలో మొదటిసారి 56శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు స్థానం కల్పిస్తే.. రెండోవిడతలో 70 శాతానికి తీసుకెళ్లామని..ఐదుగురు ఉపముఖ్యమంత్రుల్లో నలుగురు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలే ఉన్నారని ఈరోజు 25 మంది మంత్రుల్లో 11 మంది బీసీలేనని చెప్పుకొచ్చారు.

వాస్తవంగా చూస్తే..గత కేబినెట్‌లో గానీ, ఇప్పుడు గానీ..బొత్స సత్యనారాయణ వంటి సీనియర్లు సహా ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులెవరికైనా సొంతంగా నిర్ణయాలు తీసుకునేందుకు, స్వతంత్రంగా మాట్లాడేందుకు స్వేచ్ఛ లేదన్నది అందరికీ తెలిసిన విషయమే. ముఖ్యమంత్రి కార్యాలయంలోని అధికారులకు ఉన్న ప్రాధాన్యమైనా ఆ మంత్రులకు ఉన్నట్లు కనిపించదు. చివరికి విలేకరుల సమావేశం పెట్టాలన్నా కూడా సీఎంవో అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. కనీసం మాట్లాడే స్వేచ్ఛ కూడా లేని మంత్రులకు ఇక నిర్ణయాధికారం ఎక్కడుంటుంది? గత, ప్రస్తుత మంత్రివర్గాల్లో హోం మంత్రులుగా ఉన్నవారు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మహిళలే. కానీ అప్పుడూ, ఇప్పుడూ ఆ శాఖపై పెత్తనం సకల శాఖల మంత్రిది, సీఎంఓలోని కొందరి ముఖ్యులదే అన్న విమర్శలు ఉన్నాయి. రాష్ట్రంలో ఎస్సీలపైనే దాడులు జరుగుతున్నా, ఎస్సీలపైనే ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ కేసులు పెడుతున్నా వారు ఎప్పుడైనా నోరెత్తి అదేమని అడిగే పరిస్థితి లేదు.

జయహో బీసీ సభలో ప్రసంగిస్తున్న సీఎం జగన్‌

స్థానిక సంస్థల పదవుల్లో బీసీలకు ఎప్పటినుంచో ఉన్న 34శాతం రిజర్వేషన్లలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే...కోర్టు ఆదేశాలతో సుమారు 10శాతం కోత పడింది. వైసీపీ ప్రభుత్వం బీసీలకు 24.13శాతం మాత్రమే రిజర్వేషన్లతో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించింది. దానివల్ల దాదాపు 16వేల 800 పదవుల్ని కోల్పోయామని.. బీసీ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ నిష్క్రియాపరత్వం కారణంగానే తమకు అన్యాయం జరిగిందని చెబుతున్నాయి. రిజర్వేషన్లపై హైకోర్టు తీర్పును రాష్ట్రప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేయకుండా.. రిజర్వేషన్లలో కోత విధించి ఎన్నికలు నిర్వహించడం ద్వారా బీసీల గొంతు కోసిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సర్పంచులు, ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులు, మండల, జిల్లా పరిషత్తుల అధ్యక్షులు, మున్సిపల్‌ ఛైర్మన్లు, మేయర్‌ పదవుల్లో.. తమ ప్రభుత్వహయాంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందినవారు ఎక్కువగా గెలిచారంటూ జగన్‌ పెద్ద జాబితానే చదివారు. అవన్నీ చాలావరకు వారికి రిజర్వేషన్ల దామాషాలో వచ్చిన పదవులే. పోనీ.. వైసీపీ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలపై ప్రేమతో ఎక్కువ సీట్లు వారికిచ్చి, వారిని గెలిపించిందే అనుకున్నా.. నిధులు, విధులు, ఎలాంటి అధికారాల్లేని ఆ పదవులతో తమకు ఒరిగిందేమిటని ఆయా వర్గాలు వేస్తున్న ముఖ్యమైన ప్రశ్న. రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీలకు నిధులు, విధులు ఇవ్వకపోగా... కేంద్ర ఆర్థిక సంఘం ఇచ్చిన నిధుల్నీ లాగేసుకుంది. అధికార పార్టీకి చెందిన సర్పంచులే భిక్షాటన చేస్తూ నిరసన వ్యక్తంచేస్తున్న దృశ్యాలు నిత్యం కనిపిస్తున్నాయి.

జగన్‌ తన ప్రసంగంలో.. ‘నా వెనకాల ఉన్న ఆ నలుగురూ మీరే’ అన్నారు. తన వెనుకున్నది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలని చెప్పడం ఆయన ఉద్దేశం కావొచ్చు! అయితే.. రాష్ట్రంలో ప్రభుత్వ, పార్టీ నిర్ణయాల వెల్లడి, అమలులో సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైవీ సుబ్బారెడ్డిలే కీలకంగా ఉంటున్నారని అందరికీ తెలిసిందే. ముఖ్యమంత్రి వెనుక ఉంటూ..అన్ని వ్యవస్థలనూ నడిపిస్తోంది ఆ నలుగురేనని విపక్షాలు విమర్శిస్తున్నాయి.

జయహో బీసీ సభలో జగన్‌ సహా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులంతా పదేపదే ప్రతిపక్ష నేత చంద్రబాబు పేరెత్తారు. జగన్‌ 120 నిమిషాల తన ప్రసంగంలో 38సార్లు చంద్రబాబు పేరు ప్రస్తావించారు. సీఎం ప్రసంగం ప్రారంభించినప్పటి నుంచి... చివరివరకూ తమ ప్రభుత్వ గొప్పల్ని ఏకరవు పెట్టడం, చంద్రబాబు పేరు ఉటంకించడంతోనే సరిపోయింది. అంతుకుముందు మాట్లాడిన పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం చంద్రబాబును దూషించడానికే ప్రాధాన్యం ఇచ్చారు.

జగన్‌ ప్రభుత్వంలో అత్యంత ‘గ్లామరస్‌’ పోస్టు ఏదైనా ఉందంటే అది సలహాదారు పదవే! ఠంచనుగా నెలనెలా లక్షల రూపాయల జీతం. హోదాకి హోదా. దర్పానికి దర్పం..! రాజకీయ పునరావాసం కల్పించాల్సిన వారందరికీ వైసీపీ ప్రభుత్వం సలహాదారు పదవులను కట్టబెట్టేస్తోంది. ఇదో నిరంతర ప్రక్రియగా కొనసాగుతోంది. ఇటీవల సలహాదారులుగా నియమితులవుతున్న వారిలో ఒకే సామాజికవర్గానికి చెందినవారి పేర్లే ఎక్కువగా కనిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వంలో ప్రస్తుతం 50 మందికిపైగా సలహాదారులుంటే..70శాతం పైగా ఆ సామాజిక వర్గం వారే ఉంటారు. బీసీల సంఖ్య నామమాత్రం. మంత్రివర్గంలో 11 మంది బీసీలకు చోటు కల్పించినట్లు చెబుతున్నప్పుడు సలహాదారు పదవుల్లోనూ అదే దామాషాలో బీసీలకు ఎందుకు అవకాశం కల్పించడం లేదనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.

ఇవీ చదవండి:

Last Updated : Dec 8, 2022, 11:01 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.