ETV Bharat / state

నేడు మంగళగిరిలో ఏపీ జ్యుడీషియల్ అకాడమీని ప్రారంభించనున్న సీజేఐ

author img

By

Published : Dec 30, 2022, 6:56 AM IST

CJI Justice DY Chandrachud Tour of AP: ఏపీ జ్యుడీషియల్ అకాడమీని నేడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీ వై చంద్రచూడ్ ప్రారంభించనున్నారు. ఉదయం 9 గంటలకు అకాడమీ ప్రారంభోత్సవ కార్యక్రమం జరగనుంది. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో జరిగే రాష్ట్ర న్యాయాధికారుల సమావేశంలోనూ సీజేఐ పాల్గొననున్నారు. ఇప్పటికే విజయవాడకు చేరుకున్న ఆయనను సీఎం జగన్‌ మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం బెజవాడ దుర్గమ్మను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దర్శించుకున్నారు.

CJI Justice DY Chandrachud
CJI Justice DY Chandrachud

CJI Justice DY Chandrachud Tour of AP: న్యాయాధికారుల శిక్షణ కోసం మంగళగిరి సమీపంలోని కాజా వద్ద, కొత్తగా ఏర్పాటు చేసిన ఏపీ జ్యుడీషియల్‌ అకాడమీ.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీ వై చంద్రచూడ్‌ చేతులమీదుగా ప్రారంభంకానుంది. జ్యుడీషియల్‌ అకాడమీ ప్యాట్రన్‌ ఇన్‌ ఛీప్, ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర, జ్యుడీషియల్‌ అకాడమీ అధ్యక్షుడు, బోర్డ్‌ ఆఫ్‌ గవర్నర్లు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.

రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఏపీలో ప్రత్యేకంగా జ్యుడీషియల్ అకాడమీ ఏర్పాటు కావాల్సి ఉన్నా.. వేర్వేరు కారణాలతో సాకారం కాలేదు. మొదట్లో కర్నూలులో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావించగా.. హైకోర్టు ఆదేశాలతో వెనక్కి తగ్గింది. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కాజా వద్ద జ్యుడీషియల్ అకాడమీ ఏర్పాటుకు జీవో ఇచ్చారు. ప్రైవేటు భవనాన్ని అద్దెకు తీసుకున్నారు. ఇక్కడే అకాడమీని ప్రారంభించి న్యాయమూర్తులు, కోర్టు ఉద్యోగులకు శిక్షణ ఇవ్వనున్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై చంద్రచూడ్ జ్యూడీషియల్ అకాడమీని ఇవాళ ప్రారంభించనున్నారు.

ఏపీ జ్యుడీషియల్ అకాడమీని ప్రారంభించిన తర్వాత సీజేఐ.. ఆచార్య నాగార్జున యూనివర్శిటీకి చేరుకుంటారు. ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని.. ఆన్‌లైన్‌ ద్వారా హైకోర్టు రికార్డుల డిజిటలైజేషన్‌ ప్రాజెక్టు కేంద్రం నిర్మాణానికి శ్రీకారం చుడతారు.ఆన్ లైన్ సర్టిఫైడ్ కాపీల జారీకి సంబంధించి సాఫ్ట్ వేర్ అప్లికేషన్స్​ను ప్రారంభిస్తారు. ఏపీ హైకోర్టుకు సంబంధించిన మొదటి వార్షిక నివేదికను విడుదల చేసిన తర్వాత న్యాయాధికారులను ఉద్దేశించి మాట్లాడతారు.

గురువారం సీజేఐ గన్నవరం చేరుకోగా.. విమానాశ్రయంలో హైకోర్టు సీజే , సీఎస్, డీజీపీ స్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి విజయవాడ నొవాటెల్ హోటల్​కు వెళ్లిన సీజేఐని.. సీఎం జగన్ మర్యాదపూర్వకంగా కలిశారు. కొద్ది సేపు భేటీ అనంతరం నోవాటెల్ నుంచి కనకదుర్గ అమ్మవారి దేవాలయానికి సీజేఐ వెళ్లారు. దుర్గామల్లేశ్వర స్వామి వార్లను దర్శించుకున్నారు. దేవాదాయ శాఖ మంత్రి, ఆలయ ఈవో, అధికారులు సీజేఐకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. పూర్ణ కుంభంతో అమ్మవారి అంతరాలయానికి తీసుకువెళ్లారు. వేదపండితులు జస్టిస్ డీ వై చంద్ర చూడ్ కు ఆశీర్వచనాలను అందించి.. అమ్మవారి తీర్థ ప్రసాదాలను, శేషవస్త్రాలను, చిత్రపటాన్ని అందించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.