AP High Court Fire on DGP Rajendranath Reddy: ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిపై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం (హైకోర్టు) ఘాటు వ్యాఖ్యలు చేసింది. 'అడ్వకేట్ కమిషనర్‌పై చేయి చేసుకున్న హిందూపురం సీఐ ఇస్మాయిల్ చర్య మీకు తీవ్రమైనదిగా కనిపించడం లేదా..? అతనికి చిన్న శిక్ష వేసి (పనిష్మెంట్) వదిలేస్తారా..? సమాజానికి ఏం సందేశం ఇద్దామనుకుంటున్నారు..? సమాజానికి ఆదర్శంగా ఉండాల్సిన పోలీసులు దుష్ప్రవర్తనకు పాల్పడటం ఏమిటి..?' అంటూ డీజీపీపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. అనంతరం సీఐ ఇస్మాయిల్‌పై ఎలాంటి చర్యలు తీసుకున్నారో..? న్యాయస్థానానికి చెప్పాలని డీజీపీని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
అడ్వకేట్ కమిషనర్‌పై చేయి చేసుకున్న సీఐ.. గత ఏడాది అక్టోబర్ 21వ తేదీన పోలీసులు గిరీష్ అనే వ్యక్తిని అక్రమ నిర్బంధించారంటూ.. అనంతపురం జిల్లా హిందూపురం పోలీస్ స్టేషన్‌కు అడ్వకేట్ కమిషనర్ ఉదయ్ సింహారెడ్డి వెళ్లారు. గిరీష్‌ను పోలీసులు అక్రమంగా నిర్బంధించడమే కాకుండా, అతన్ని కొట్టినట్లు జ్యుడీషియల్ అధికారులు గుర్తించారు. దీంతో గిరీష్‌ను కోర్టు ముందు హాజరుపర్చేందుకు తీసుకెళ్తామని అడ్వకేట్ కమిషనర్ పోలీసులకు చెప్పగా.. సీఐ ఇస్మాయిల్ అడ్వకేట్ కమిషనర్ పట్ల దురుసుగా ప్రవర్తించి.. ఆయనపై చేయి చేసుకున్నారు.
సుమోటోగా కేసు నమోదు చేసిన హైకోర్టు.. అనంతరం కోర్టు ఆదేశాల మేరకు గిరీష్‌ను కోర్టు ముందు హాజరుపరిచారు. ఆ తర్వాత బాధితుడు గిరీష్‌కి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ పరీక్షల్లో పోలీసులు చిత్రహింసలకు గురి చేసినట్లు తేలింది. ఈ వ్యవహారంపై సీఐపై చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులకు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి లేఖ రాశారు. ఈ క్రమంలో సీఐపై ఉన్నతాధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవటంతో.. హైకోర్టు ఈ ఘటనపై సుమోటోగా కేసు నమోదు చేసి విచారణ జరిపింది.
డీజీపీ రెండు వారాల్లో వివరణ కోరాలి.. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై హిందూపురం ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ కోర్టు గతంలో సీఐ ఇస్మాయిల్‌ను వివరణ కోరింది. అయితే, సీఐ నుంచి సరైనా సమాధానం రాకపోవడంతో డీజీపీ రెండు వారాల్లో వివరణ కోరాలని, అనంతపురం జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటనపై రాష్ట్ర డీజీపీ నుంచి ఎటువంటి సమాధానం రాలేదని రిజిస్ట్రీ న్యాయమూర్తికి వివరించింది. ఈ కేసుపై తాజాగా విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అడ్డుకునేందుకు సుమోటోగా నమోదు చేసిన పిల్‌లో ప్రతివాదులు.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోంశాఖ ముఖ్యకార్యదర్శి, రాష్ట్ర డీజీపీ, అనంతపురం రేంజ్ డీఐజీ, శ్రీ సత్యసాయి జిల్లా, అనంతపురం జిల్లా ఎస్పీలు, పెనుకొండ డీఎస్పీ, హిందూపురం 1వ పట్టణ ఠాణ ఎస్‌హెచ్‌వో, సీఐ ఇస్మాయిల్‌కు నోటీసులు జారీ చేసింది. జూన్ 14న విచారణకు ఇస్మాయిల్ కోర్టు ముందు హాజరు కావాలని తేల్చి చెప్పింది.
ఈ క్రమంలో నేడు హైకోర్టు ధర్మాసనం విచారణ జరిపింది. విచారణలో భాగంగా రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. సీఐ ఇస్మాయిల్‌పై ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలంటూ డీజీపీని ఆదేశిస్తూ.. తదుపరి విచారణను ఈ నెల 28కి న్యాయస్థానం వాయిదా వేసింది.