ETV Bharat / state

హైదరాబాద్​లో పెరుగుతున్న వాయు కాలుష్యం.. దిల్లీ తరహాలో..

author img

By

Published : Nov 9, 2022, 12:44 PM IST

Air pollution in Hyderabad : దేశంలోని మెట్రో నగరాల్లో చలి వల్ల పెరుగుతున్న కాలుష్యం.. హైదరాబాద్‌నూ వణికిస్తోంది. దిల్లీ తరహాలోనే భాగ్యనగరంలో పలు ప్రాంతాల్లో వాయు కాలుష్యం పెరిగిపోయింది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి లెక్కల ప్రకారం.. సనత్‌నగర్‌లో అత్యధికంగా గాలి కలుషితమయ్యింది.

Air pollution
వాయు కాలుష్యం

హైదరాబాద్​లో పెరుగుతున్న వాయు కాలుష్యం

Air pollution in Hyderabad : దేశ రాజధాని దిల్లీ తరహాలోనే హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో కాలుష్యం పెరిగిపోతోంది. సనత్‌నగర్‌లో వాయు నాణ్యత ఆందోళనకరంగా ఉందని కేంద్ర కాలుష్య నియంత్రణమండలి తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈనెల 7న సాయంత్రం 5 గంటలకు గాలి నాణ్యత సనత్‌నగర్‌లో 213 పాయింట్లుగా నమోదైంది. ఇదే సమయంలో జూపార్కు వద్ద 162, హెచ్‌సీయూ 101, రామచంద్రాపురం 77, మలక్‌పేట 55 పాయింట్లుగా నమోదైంది. ఇతర మెట్రో నగరాలు ముంబయి, చెన్నై, బెంగుళూరు నగరాల్లోనూ కాలుష్యం పెరుగుతోంది. కేంద్ర కాలుష్య నియంత్రణమండలి తాజా గణాంకాల ప్రకారం గాలి నాణ్యతా సూచీల్లో ముంబయి 232, బెంగుళూరు119, చెన్నై105 పాయింట్లు నమోదయ్యాయి.

చలిపెరగడంతో దుమ్మూ, ధూళి, వాహనాల పొగ.. గాలిలో కలవడం లేదు. పైపైనే ఒక పొరలా పేరుకుపోతోంది. దీంతో గాల్లో కాలుష్యం పెరిగి.. వాయు నాణ్యత తగ్గుతోంది. దీపావళి పండుగ నుంచి గాల్లో నాణ్యత క్రమంగా క్షీణిస్తోంది. బాణసంచా కాల్చడంతో మూడింత కాలుష్యం పెరిగింది. తర్వాతి రోజుల్లో గాలి నాణ్యత పర్వాలేదన్న స్థాయికి చేరుకున్నా.. వారం రోజుల నుంచి గాల్లో నాణ్యత తగ్గుతోంది. పరిశ్రమలు ఎక్కువగా ఉన్న సనత్‌నగర్‌ పరిసర ప్రాంతాల్లో గాలి ఎక్కువగా కలుషితమవుతోంది. ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం సాయంత్రం ఐదుగంటల వరకూ కాలుష్య లెక్కింపు పరికరంలో గరిష్ఠంగా 324 పాయింట్లు నమోదయ్యాయి. 2.5 మైక్రాన్ల మందమున్న సూక్ష్మధూళి కణాలు కొన్ని కోట్లలో అక్కడ ఉండడం కాలుష్యం పెరిగేందుకు ప్రధాన కారణమైంది.

గాలి నాణ్యత సూచీలో యాభై పాయింట్లు దాటితే ఎవరికైనా ఊపిరి పీల్చుకోవడం కష్టమే. దిల్లీ, నోయిడా, గుర్‌గావ్‌ ప్రాంతాల్లో గాల్లో కాలుష్యం తీవ్రంగా పెరిగితే అక్కడ 300 పాయింట్ల నుంచి 450 పాయింట్ల వరకూ గాలినాణ్యత పడిపోయింది. ఆరోగ్యవంతులపై తీవ్ర ప్రభావం చూపడమే కాకుండా.. ఆస్తమా రోగులకు తీవ్ర ఇబ్బందిని కలిగిస్తుంది. హైదరాబాద్‌లో రెండు, మూడు ప్రాంతాలు మినహా 50 నుంచి 170 పాయింట్ల వరకూ నమోదయ్యాయి. వేలసంఖ్యలో చెట్లున్నా.. పచ్చదనం ఉన్నా.. వాహనాల రాకపోకలు, చిన్న,చిన్న పరిశ్రమల కారణంగా జూపార్క్‌ వద్ద గాలినాణ్యత సూచీలో 162 పాయింట్లు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది.హైదరాబాద్‌లో ఇప్పటినుంచైనా కాలుష్య నియంత్రణ చర్యలు చేపట్టకపోతే దిల్లీలో ప్రాథమిక పాఠశాలలకు సెలవు ప్రకటించినట్టు.. మనం కూడా సెలవులు ప్రకటించాలంటూ నిపుణులు చెబుతున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.