ETV Bharat / state

గోల్కొండ ఆర్టిలరీ సెంటర్‌లో.. అగ్నివీర్​లకు మొదలైన శిక్షణ!

author img

By

Published : Jan 10, 2023, 11:46 AM IST

AGNIVEERS TRAINING
అగ్నివీర్ శిక్షణ

AGNIVEERS TRAINING: కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన అగ్నిపథ్ ప్రారంభమైంది. అర్హులైన యువకులను ఎంపికచేసిన సైనిక అధికారులు తీర్చిదిద్దుతున్నారు. కఠిన శిక్షణ పూర్తి చేసుకున్న అగ్నివీరులు సైన్యంలో చేరి దేశానికి సేవలు అందించనున్నారు.

AGNIVEERS TRAINING: సైన్యానికి అదనపు బలం జోడించేలా.. కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్‌కి ఆశించిన దానికంటే ఎక్కువ స్పందనే లభించింది. తొలుత విమర్శలు వెల్లువెత్తినా ఆ కార్యక్రమం వల్ల యువతకు లభించే అవకాశాలపై సైనిక అధికారులు కూలంకషంగా వివరించారు. అధికారుల పిలుపుతో యువత పెద్ద ఎత్తున అగ్నిపథ్ నియామక ర్యాలీలో పాల్గొంది. అర్హత సాధించినవారికి ప్రస్తుతం సైనిక కేంద్రాల్లో శిక్షణ కొనసాగుతోంది.

డిసెంబర్ 25 నుంచి 31లోగా నిర్దేశించిన శిక్షణా కేంద్రాల్లో రిపోర్ట్ చేయాల్సిందిగా అభ్యర్థులకు అధికారులు సూచించారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్రం గోల్కొండలోని ఆర్టిలరీ సెంటర్‌లో 2265మంది అగ్నివీరులు చేరారు. వారికి జనవరి 1నుంచి శిక్షణ మొదలైంది. దేశంలో పేరొందిన ఆర్మీ శిక్షణా కేంద్రాల్లో గోల్కొండ ఆర్టిలరీ సెంటర్ ఒకటి. దాదాపు 1900 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ శిక్షణా కేంద్రంలో అగ్నివీరులను.. అన్ని విభాగాల్లోనూ సుశిక్షితులుగా తీర్చిదిద్దుతున్నారు. 31 వారాలపాటు శిక్షణ కొనసాగనుంది. తొలి 10వారాలు బేసిక్ మిలటరీ ట్రైనింగ్ పేరిట శిక్షణనిస్తున్నారు. ఆ తర్వాత 21వారాలపాటు అడ్వాన్స్ మిలటరీ ట్రైనింగ్ పేరుతో శిక్షణ ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు.

"ప్రస్తుతం ఆర్టిలరీ సెంటర్​కు 2300మంది అగ్నివీర్​లు శిక్షకు వచ్చారు. ఫిబ్రవరి నెల మధ్యలో మరో 3300మంది అగ్నివీర్​లు రానున్నారు. వారికి మార్చి 1వ తేదీనుంచి శిక్షణను ప్రారంభించనున్నాము. ఆర్టిలరీ సెంటర్​ హైదరాబాద్​లో 5500మంది అగ్నివీర్​లు శిక్షణ తీసుకోనున్నారు. ఇది ఇండియన్​ ఆర్మీలో చేరనున్న 40000మందిలో 15శాతంగా ఉంది." -రాజీవ్​ చౌహాన్​, కమాండెంట్​ గోల్కొండ ఆర్టిలరీ సెంటర్​

ప్రస్తుతం అభ్యర్థులకు దేహదారుఢ్యం పెంచేలా శిక్షణ కొనసాగుతోంది. ఉదయం 4 నుంచే అగ్నివీరుల దినచర్య మొదలవుతోంది. ప్రతిరోజు తమ గదులు, మూత్రశాలలు శుభ్రపరుచుకుంటారు. మైదానంలోకి వెళ్లి కసరత్తులు చేస్తారు. ఆ తర్వాత తరగతి గదుల్లో బోధన ఉంటుంది. మూర్తిమత్వం, భాషా నైపుణ్యంతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానంపై చైతన్యం కల్పిస్తున్నారు. ఆ వినియోగంపై తరగతులు చెప్పిన తర్వాత.. మైదానంలో వాటి వినియోగంపై అవగాహన కల్పిస్తున్నారు. తుపాకులతో ఎలా కాల్చాలి. శుత్రువులను ఎలా మట్టుబెట్టాలనే అంశంపై మెలకువలు నేర్పిస్తున్నారు.

శారీరకంగా, మానసికంగా ధృడంగా ఉండేలా శిక్షణ కార్యక్రమం రూపొందించారు. అగ్నివీరులుగా ఎంపిక కావడంపై యువకులు వ్యక్తం చేస్తున్నారు. అగ్నివీరులుగా శిక్షణపూర్తి చేసుకున్న తర్వాత సైన్యంలో.. నాలుగేళ్లపాటు సేవలందిస్తారు. ఆ తర్వాత అగ్నిపథ్‌లో నిర్దేశించిన విధంగా 25శాతం మందిని సైన్యానికి ఎంపిక చేస్తారు. మిగతా 75శాతం మందికి అగ్నివీర్ సర్టిఫికెట్ అందించి ఇతర ఉద్యోగాల్లో కోటా పొందేలా సౌలభ్యం కల్పిస్తారు.

అగ్నివీర్​లకు ప్రారంభమైన శిక్షణ

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.