ETV Bharat / state

ఖాళీ స్థలం కనిపిస్తే చాలు.. తప్పుడు రికార్డులతో స్వాహా.. రిజిస్ట్రార్​ ఫిర్యాదుతో వెలుగులోకి..

author img

By

Published : Jan 4, 2023, 8:09 AM IST

Occupancy of places in the city: ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్న స్థలాలు కనిపిస్తే చాలు వాటికి తప్పుడు రికార్డులు సృష్టిస్తున్నారు. స్థల యజమానుల పేర్లతో నకిలీ ఆధార్‌ కార్డులు సృష్టిస్తున్నారు. విజయవాడలో నకిలీ ప్రభుత్వ స్టాంపులు, సంతకాలతో.. ఖాళీ స్థలాలను తన పేరుమీదకు మార్చుకుంటున్న వ్యక్తిని గవర్నర్​పేట పోలీసులు అదుపులోకి తీసుకుని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. గాంధీనగర్‌ జాయింట్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ 1 వేగామణి చైతన్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Occupancy of places in the city
స్థలం కనిపిస్తే స్వాహా చేస్తున్న ఘరానా మోసగాడు

Occupancy of places in the city: విజయవాడలో ఖాళీ స్థలం కనపడితే చాలు నకిలీ డాక్యుమెంట్స్ సృష్టిస్తారు. గుట్టుచప్పుడు కాకుండా నగరంలో జరుగుతున్న ఈ నకిలీ దందా సబ్ రిజిస్ట్రార్ ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది. గాంధీనగర్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం పరిధిలో ఇటీవల కొన్ని స్థలాలకు తప్పుడు డాక్యుమెంట్లుతో తనఖా రిజిస్ట్రేషన్లు జరిగినట్లు జాయింట్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ 1 వేగామణి చైతన్యకు కొంత మంది స్థల యజమానులు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టగా గుణదలకు చెందిన రాజచైతన్య అనే వ్యక్తి పేరు మీద వరుసగా స్థలాలు రిజస్ట్రేషన్‌ జరిగినట్లు గుర్తించి మరింత లోతుగా దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తు బాధ్యతలను రిజిస్ట్రేషన్‌ శాఖలోని నిఘా విభాగానికి అప్పగించినట్లు సమాచారం. వీరి అంతర్గత విచారణలో పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

వరుసగా జరిగిన రిజిస్ట్రేషన్లను తనిఖీ చేసిన అధికారులు ఒకే వ్యక్తి పేరు మీద తనఖా రిజిస్ట్రేషన్లు జరిగినట్లు గుర్తించారు. రిజిస్ట్రేషన్ల కోసం వినియోగించిన డాక్యుమెంట్లను పరిశీలించారు. ప్రధానంగా ఆధార్‌ కార్డులను పరిశీలిస్తే అవి నకిలీవని తేలింది. ఖాళీ స్థలాల యజమానుల పేరు మీద నకిలీ ఆధార్‌ కార్డులు సృష్టించినట్లు గుర్తించారు. పలు సర్వే నెంబర్లలో ఉన్న ఖాళీస్థలాల డాక్యుమెంట్లకు నకిలీ పత్రాలు సృష్టించి రిజిస్ట్రేషన్‌ చేసినట్లు గుర్తించారు. ఇలా నకిలీ పత్రాల సృష్టిలో పలువురు స్థిరాస్థి వ్యాపారుల పాత్ర ఉన్నట్లు స్పష్టమైంది . ఖాళీస్థలాలను గుర్తించి వాటికి సంబందించిన రిజిస్ట్రేషన్‌ పత్రాలకు నకళ్లను సంపాదించేవారని గుర్తించారు.

రిజిస్ట్రేషన్‌ కార్యాలయంలో మాత్రమే స్థిరాస్తి పత్రాలకు నకళ్లు ఉంటాయి. వీటిని సంపాదించటం కష్టమని రిజిస్ట్రేషన్‌ అధికారులు అంటున్నారు. సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో పని చేసే ఎవరైనా ఈ ముఠాకు సాయం చేసి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఇలా ఖాళీస్థలాలకు సంబందించిన పత్రాలకు నకళ్లు సంపాదించి వాటిలోని పేర్లలో నకిలీ ఆధార్‌ కార్డులు, ఇతర పత్రాలను సృష్టించి గుట్టుచప్పుడు కాకుండా రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. అయితే ఒకరిద్దరు స్థల యజమానులు జరిగిన మోసాన్ని గుర్తించటంతో ఈ దందా బయటపడింది . విచారణలో మరికొన్ని స్థలాలు ఇలా తిరుమణి రాజ చైతన్య పేరు మీద తనఖా రిజిస్టర్‌ అయినట్లు గుర్తించారు. దీనిపై జాయింట్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఐపీసీ 419, 420 , 465 (పోర్జరీ), 467, 468 రెడ్‌ విత్‌ 120 (బి) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.