ETV Bharat / state

Nagaravanam: డోన్‌ సమీపంలో నగరవనం.. వేగంగా పనులు!

author img

By

Published : Jul 12, 2021, 8:07 PM IST

కర్నూలు జిల్లాలో మరో నగర వనం అందుబాటులోకి రానుంది. ఇప్పటికే నగర పరిధిలో ఒకటి ఉండగా.. ప్రజల ఆరోగ్యం మానసిక వికాసం కోసం డోన్‌లో మరొకటి ముస్తాబవుతోంది. డోన్‌ - ఎర్రగుంట్ల మధ్యలో బేతంచెర్ల ప్రధాన రహదారి పక్కన అటవీ శాఖ నిర్మిస్తున్న నగరవనంపై ప్రత్యేక కథనం.

nagara vanam
డోన్‌ సమీపంలో నిర్మిస్తున్న నగరవనం

డోన్‌ సమీపంలో నగరవనం

ప్రకృతిని కాపాడుకోవాలన్న ఉద్దేశం సహా.. అడవులపై అవగాహన కల్పించాలన్న లక్ష్యంతో... అటవీ శాఖ వివిధ ప్రాంతాల్లో నగరవనాలను ఏర్పాటు చేస్తోంది. అందులో భాగంగా.. కర్నూలు నగరం గార్గేయపురం సమీపంలో ఓ నగరవనాన్ని అందుబాటులోకి తెచ్చారు. డోన్ సమీపంలో మరో నగరవనం రూపుదిద్దుకుంటోంది. ధర్మవరం గ్రామ వనసంరక్షణ సమితి ఆధ్వర్యంలో మొత్తం 60 హెక్టార్‌లలో 2.50 కోట్లతో పనులకు శ్రీకారం చుట్టారు.

అధునాతన ఆట వస్తువులు, జిమ్‌, మధ్యలో ఫౌంటేయిన్‌, అంతర్గత రహదారులు, చుట్టూ కంచె వంటి పనులు చేపట్టారు. నగరవనం చుట్టూ 3 కిలోమీటర్ల మేర 14 లక్షలతో ప్రధాన మార్గాలను, నగరవనం లోపల 7 లక్షలతో అంతర్గత రహదారులను నిర్మించారు. ఒకచోట ప్రవేశిస్తే రెండు కొండల చుట్టూ తిరిగి వనం లోపలికి వచ్చేలా రహదారులను అత్యంత సుందరంగా ఏర్పాటు చేస్తున్నారు.

నగరవనం అవసరాలకు విద్యుత్‌ స్తంభాలు, నియంత్రికల పనులను సుమారు రూ.5 లక్షలతో చేపట్టారు. 3.50 లక్షలతో బోరు, నీటి గొట్టాలు, కుళాయిలు వంటివి ఏర్పాటు చేశారు. కొండపై క్యాంపు కార్యాలయం పక్కన 15 వేల లీటర్ల సామర్థ్యం గల నీటి ట్యాంకులు, సంపులను నిర్మించారు. అటవీ ప్రాంతం కావడంతో చుట్టూ రూ.15 లక్షలతో ఫెన్సింగ్‌ వేయించారు. వీఐపీలు, ఉన్నతాధికారులు, మంత్రుల కోసం రూ.10 లక్షలతో క్యాంపు కార్యాలయాన్ని నిర్మిస్తున్నారు. డోన్‌లో నగరవనం ఏర్పాటు కావటంపై స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

నగర వనం ప్రవేశం మార్గం వద్ద ఆర్చ్‌ని అధునాతనంగా నిర్మిస్తున్నారు. పక్కనే సెక్యూరిటీ ఉండేందుకు 5 లక్షలతో గదిని ఏర్పాటు చేస్తున్నారు. త్వరలోనే పనులు పూర్తి చేసి.. అందుబాటులోకి తీసుకురావటానికి అధికారులు కృషి చేస్తున్నారు.

ఇదీ చదవండి:

Rayalaseema Lift: తెలుగుదేశం కాదు.. తెలంగాణ దేశం పార్టీ: మంత్రి అనిల్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.